
లెక్క.. పక్కా!
సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రచార వ్యయం జమ విషయంలో నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరించామని జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది.
- సోనియా ప్రచార వ్యయంపై ఈసీకి నివేదిక
- టీఆర్‌ఆర్ ఫిర్యాదుపై స్పందించిన యంత్రాంగం
- హరీశ్వర్ ఆరోపణలు నిరాధారం
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రచార వ్యయం జమ విషయంలో నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరించామని జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది. గత ఏప్రిల్ 27న చేవెళ్లలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో సోనియాగాంధీ పాల్గొన్నారు. అధినేత్రి సభను ప్రతిష్టాత్మంగా తీసుకున్న కాంగ్రెస్ నాయకత్వం భారీగా జనసమీకరణ చేసింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి చేవెళ్లకు ప్రజలను తరలించేందుకు 700 ఆర్టీసీ బస్సులను అద్దెకు సమకూర్చింది. ఈ క్రమంలోనే సభ విజయవంతానికి రూ. కోటీ 70 వేలను ఖర్చు చేసింది.
అయితే, ఈ వ్యయం ఎవరి ఖాతాలో చూపాలనే అంశంపై జిల్లా యంత్రాంగం సందిగ్ధ పరిస్థితిని ఎదుర్కొంది. స్టార్ క్యాంపెయినర్లు పాల్గొనే సభల వ్యయం విషయంలో కొన్ని సడలింపులు ఉన్నప్పటికీ, అదే వేదిక ను అభ్యర్థులు పంచుకుంటే మాత్రం ఖర్చును వారి లెక్కలో చూపాలని ఎన్నికల కమిషన్ నిబంధనలు ఉన్నాయి. ఈ మార్గదర్శకాల అనుగుణంగా చేవెళ్ల సభలో వేదికెక్కిన పరిగి ఎమ్మెల్యే టి. రామ్మోహన్‌రెడ్డి సహా ఏడుగురు కాంగ్రెస్ అభ్యర్థుల ఖాతాల్లో (ఒక్కో సభ్యుడికి 14 లక్షల 38 వేల 607 రూపాయలు) సభ నిర్వహణా వ్యయాన్ని చూపారు.
సోనియాతో కలిసి తాను వేదికను పంచుకోలేదని, కనీసం కార్యకర్తలకు అభివాదం కూడా చేయలేదని, ఇలాంటి పరిస్థితుల్లో అధినేత్రి ప్రచార ఖర్చును తన ఎన్నికల వ్యయంలో చూపడం ఎంతవరకు సబబని ప్రశ్నిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు రామ్మోహన్‌రెడ్డి లేఖ రాశారు. దీనిపై సమగ్ర నివేదిక పంపాలని జిల్లా యంత్రాంగాన్ని సీఈసీ చీఫ్ కమిషనర్ వీఎస్ సంపత్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో ప్రచార సభకు సంబంధించిన ఫొటోలు, సీడీలు సహా ఆ సభలో సోనియాతో టీఆర్‌ఆర్ అభివాదం చేస్తున్న చిత్రాలను పొందుపరుస్తూ జాయింట్ కలెక్టర్ 2 ఎంవీ రెడ్డి ఈసీకి నివేదిక పంపారు. వ్యయ పరిశీలకుల సూచనల మేరకు ప్రచార ఖర్చును కాంగ్రెస్ అభ్యర్థుల ఖాతాలో చూపినట్లు ఎన్నికల సంఘానికి పంపిన నివేదికలో స్పష్టం చేశారు.
హరీశ్వర్ ఆరోపణలు నిరాధారం
ప్రచార వ్యయం నమోదులో అవకతవకలు జరిగాయని రామ్మోహన్‌రెడ్డి చేతిలో ఓడిపోయిన హరీశ్వర్‌రెడ్డి(టీఆర్‌ఎస్) చేసిన ఫిర్యాదుపై కూడా కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. దీనిపై విచారణకు ఆదేశించిన సీఈసీ... నివేదిక పంపాలని జిల్లా యంత్రాంగానికి లేఖ రాసింది. ఈ క్రమంలోనే హరీశ్వర్‌రెడ్డి ఆరోపణలు నిరాధారమని, ఈసీ పరిశీలకుల కనుసన్నల్లోనే ప్రచార వ్యయాన్ని రికార్డు చేశామని స్పష్టం చేసింది. ఎక్కడా ఎలాంటి పొరపాట్లు చేయలేదని, బిల్లుల ప్రకారం ఖర్చు జమ చేశామని వివరణ ఇచ్చింది.