మొబైల్‌ టెస్ట్‌ ల్యాబ్స్‌ ఆచరణ సాధ్యమేనా?

Corona Mobile Testing Not Possible In Telangana Says Govt - Sakshi

కరోనా నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం

 పది రోజుల్లో 40,837 పరీక్షలు చేశాం

గాంధీలో పడకల సంఖ్య పెంచాం

హైకోర్టుకు నివేదించిన ప్రభుత్వం

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా పరీక్షలు చేసేందుకు మొబైల్‌ టెస్టింగ్‌ ల్యాబ్స్‌ను వినియోగంలోకి తేలేమని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఆర్టీ–పీసీఆర్‌ టెస్టింగ్‌ యూనిట్లను సంచార వాహనంలో తీసుకువెళ్లడం కష్టమని, బయోసేఫ్టీ వీలుకాదని వివరించింది. అందుకే మొబైల్‌ టెస్టింగ్‌ ల్యాబ్స్‌ ఏర్పాటు చేయాలనే హైకోర్టు ప్రతిపాదనను అమలు చేయలేకపోతున్నామని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకుడు  నివేదించారు. కరోనాపై దాఖలైన పలు ప్రజాహిత వ్యాజ్యాల విచారణ సందర్భంగా ధర్మాసనం ఉత్తర్వుల మేరకు ఆయన హైకోర్టుకు నివేదిక సమర్పించారు. ‘రాష్ట్రంలో 84,134 కరోనా పరీక్షలు నిర్వహిస్తే అందులో జూన్‌ 20 నుంచి 29 వరకు చేసినవి 40,837 ఉన్నాయి. 69,712 నెగిటివ్, 15,394 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. వీటిలో యాక్టివ్‌ కేసులు 9,559 ఉండగా.. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 5,644 కేసులు ఉన్నాయి. (తెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు)

ఇప్పటివరకు 5,582 మంది డిశ్చార్జి అయ్యారు. 253 మంది మరణించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 13, జిల్లాల్లో 18 టెస్టింగ్‌ ల్యాబ్స్‌ ఉన్నాయి. కరోనాకు వైద్యం చేసేందుకు జీహెచ్‌ఎంసీ పరిధిలో 9, జిల్లాల్లో 52 ఆస్పత్రులు ఉన్నాయి. పది రోజుల్లోగా ర్యాపిడ్‌ యాంటి జెన్‌ డిటెక్షన్‌ పరీక్షలు నిర్వహించే అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. గాంధీ ఆస్పత్రిలో ఏప్రిల్‌ 1 నుంచి జూన్‌ 29 నాటికి పీపీఈ కిట్లు 69,389 వినియోగిస్తే 9,728 కిట్స్‌ నిల్వ ఉన్నాయి. ఎన్‌95 మాస్క్‌లు 1.39 లక్షలు/7,811, మూడు పొర ల మాస్క్‌లు 4,41,984/1,15,516, శానిటైజర్లు 12,915/ 3,496, గ్లౌజ్‌లు 1,68,796/12,204, సర్జికల్‌ గ్లౌజ్‌లు 2,12,226/13,924 చొప్పు న వినియోగం–నిల్వ ఉన్నాయి. (కోటి దాటనున్న కోవిడ్‌-19 టెస్ట్‌లు)

రోజు అవసరానికి అనుగుణంగా సరఫరా చేస్తున్నాం. గాంధీలో 1,002 పడకలు ఉన్న వాటిని గతంలో 1,890లకు పెంచగా ఇప్పుడు 2,100కు పెంచాం. 1,000 పడకలకు ఉన్న ఆక్సిజన్‌ సరఫరాను మరో 700 పడకలకు పెంచేందుకు చర్యలు తీసుకున్నాం. 350 వెంటిలేటర్స్‌ ఉన్నాయి. 665 మంది వైద్య సిబ్బంది ప్రక్రియ తుది దశకు వచ్చింది. ప్రభుత్వాసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద 2,157 థర్మల్‌ స్క్రీనింగ్స్‌ ఏర్పాటు చేశాం. మరో 8వేలు త్వరలోనే అందబోతున్నాయి. కరోనా వైరస్‌ నివారణకు ప్రభుత్వం శక్తి వంచన లేకుండా చర్యలు తీసుకుంటోంది. హైకోర్టు ఆదేశాల్ని అమలు చేస్తున్నాం’అని నివేదికలో పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top