టీఆర్‌ఎస్‌కే లోకల్ సర్కారు రావడంతో అనుకూలం | Convenience of government with trs local | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌కే లోకల్ సర్కారు రావడంతో అనుకూలం

May 18 2014 3:59 AM | Updated on Aug 14 2018 4:24 PM

టీఆర్‌ఎస్‌కే లోకల్  సర్కారు రావడంతో అనుకూలం - Sakshi

టీఆర్‌ఎస్‌కే లోకల్ సర్కారు రావడంతో అనుకూలం

తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుండడంతో పుర, ప్రాదేశిక పీఠం పోరు రసవత్తరంగా మారింది.

 - హంగ్ మండలాల్లో అధికం గులాబీకే..
 - మునిసిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి
 - జెడ్పీ పీఠంలో  దొంతి నిర్ణయమే కీలకం

 
 సాక్షి ప్రతినిధి, వరంగల్ :తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుండడంతో పుర, ప్రాదేశిక పీఠం పోరు రసవత్తరంగా మారింది. జిల్లా, మండల పరిషత్... మునిసిపల్ చైర్మన్ల ఎన్నికల్లో కొత్త రాజకీయం మొదలైంది. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌తోపాటు మెజారిటీ మండల పరిషత్‌లు, మునిసిపల్ చైర్మన్ పదవులు గులాబీ దళానికే దక్కే అవకాశం కనిపిస్తోంది. స్థానిక సంస్థల్లో మెజారిటీ పదవులను దక్కించుకునేందుకు టీఆర్‌ఎస్ అన్ని రకాలుగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పీఠాన్ని కచ్చితంగా దక్కించుకునేలా రాజకీయాల జోరు పెంచింది. జిల్లాలో 50 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా... కాంగ్రెస్‌కు 24, టీఆర్‌ఎస్‌కు 18, టీడీపీకి 6, బీజేపీకి ఒకటి దక్కారుు. స్వతంత్రులు ఒక మండలంలో గెలిచారు.

కాంగ్రెస్ పెద్ద పార్టీగా అవతరించినా... ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పార్టీకి చైర్మన్ పదవి దక్కే పరిస్థితి లేదు. వరంగల్ జెడ్పీ పీఠం విషయంలో టీఆర్‌ఎస్ ప్రతిష్టాత్మకంగా వ్యవహరిస్తోంది. ఈ పదవిని ఎలాగైనా దక్కించుకోవాలనే ఉద్దేశంతో పార్టీకి చెందిన జెడ్పీటీసీ సభ్యులతోతో హైదరాబాద్‌లో క్యాంపు నిర్వహిస్తోంది. కాంగ్రెస్‌లోని కొందరిని తమ వైపునకు తిప్పుకునే వ్యూహానికి పదునుపెడుతోంది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుండడంతో ఇది జరుగుతుందని కాంగ్రెస్ వర్గాలే అంగీకరిస్తున్నాయి. కాంగ్రెస్ సైతం జెడ్పీ పదవి కోసం ప్రయత్నాలు మొదలుపెట్టినా... సాధారణ ఎన్నికల ఫలితాలతో డీలా పడిపోయింది.

ఎమ్మెల్యే అభ్యర్థులెవరూ క్యాంపు నిర్వహణ విషయంలో ముందుకు రావడంలేదు. అరుుతే టీ పీసీసీ అధ్యక్షుడి సొంత జిల్లా కావడంతో  చైర్మన్ పదవిని చేజిక్కించుకునేందుకు ఆఖరు వరకు ప్రయత్నించే అవకాశం ఉంది. జెడ్పీ చైర్‌పర్సన్ పదవి ఎవరికి దక్కాలనే విషయంలో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నిర్ణయం కీలకం కానుంది. కాంగ్రెస్ జెడ్పీటీసీ సభ్యుల్లో నర్సంపేట నియోజకవర్గంలోని నర్సం పేట, చెన్నారావుపేట, ఖానాపూర్, నెక్కొండ మండలాల నుంచి గెలిచిన వారు దొంతికి విధేయులుగా ఉన్న వారే.

గూడూరు కాంగ్రెస్ జెడ్పీటీసీ సభ్యుడు, కొత్తగూడతోపాటు మరో ముగ్గురు... మొత్తం 9 మంది జెడ్పీటీసీలు దొంతి మాధవరెడ్డి శిబిరంలో ఉన్నారు. టీఆర్‌ఎస్‌కు చెందిన 18 మంది జెడ్పీటీసీలకు వీరు కలిస్తే ఆ పార్టీకి చైర్మన్ పదవి దక్కుతుంది. ఈ క్రమంలో దొంతి మాధవరెడ్డి నిర్ణయం ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పొన్నాల లక్ష్మయ్య తనకు టికెట్ రాకుండా చేశారని భావిస్తున్న దొంతి ఇదివరకే ఆయనపై ఫైర్ అయ్యూరు. ఈ నేపథ్యంలో టీ పీసీసీ అధ్యక్షుడిగా పొన్నాల కొనసాగింనంత కాలం ఆయన కాంగ్రెస్‌లోకి మళ్లీ వచ్చేది అనుమానంగానే కనిపిస్తోంది. దీన్ని అనుకూలంగా మార్చుకుని జెడ్పీ పీఠాన్ని దక్కించుకునేందుకు టీఆర్‌ఎస్ ప్రయత్నిస్తోంది.
 
మండల పరిషత్‌లలో...
జిల్లాలోని 50 మండల పరిషత్‌లకు సంబంధించి కాంగ్రెస్‌కు 18, టీఆర్‌ఎస్‌కు 14, టీడీపీకి 3, న్యూ డెమోక్రసీకి ఒకటి దక్కే పరిస్థితి ఉంది. మిగిలిన 14 మండల పరిషత్‌లలో ఎవరికీ మెజారిటీ రాలే దు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుండడంతో వీటిలో ఎక్కువ మండల పరిషత్ అధ్యక్ష పదవులు ఈ పార్టీకే దక్కనున్నాయి. హంగ్ పరిస్థితులు ఏర్పడిన కేసముద్రం, గోవిందరావుపేట, ములుగు, వెంకటాపూర్, మొగుళ్లపల్లి, రేగొండ, జఫర్‌గఢ్, లింగాలఘణపురం, హన్మకొండ మం డలాలు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోనే ఉన్నాయి. ఈ తొమ్మిది మండల పరిషత్‌లు టీఆర్‌ఎస్‌కు దక్కే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మిగిలిన ఐదు మండల పరిషత్‌లనూ దక్కించుకునేందుకు టీఆర్‌ఎస్ పార్టీ ప్రయత్నిస్తోంది.  

మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో...
జిల్లాలోని జనగామ, మహబూబాబాద్ మునిసిపాలిటీతోపాటు పరకాల, భూపాలపల్లి, నర్సంపేట  చైర్‌పర్సన్ పదవులను దక్కించుకునేందుకు టీఆర్‌ఎస్ ప్రయత్నిస్తోంది. జనగామ మునిసిపాలిటీలో కాంగ్రెస్‌కు మెజారిటీ కౌన్సిలర్ స్థానాలు వచ్చాయి. ఇక్కడ 28 వార్డులు ఉంటే కాంగ్రెస్ 14 గెలుచుకుంది. టీఆర్‌ఎస్ 6, బీజేపీ, స్వతంత్రులు, సీపీఎం కలిసి 14 గెలిచాయి. జనగామ ఎమ్మెల్యే స్థానం టీఆర్‌ఎస్ గెలవడంతో మునిసిపల్ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తోంది.

మెజారిటీ లేకున్నా గత మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అనుసరించిన వ్యూహాన్నే ఇప్పుడు టీఆర్‌ఎస్ అనుసరిస్తోంది.  హంగ్ పరిస్థితులు ఏర్పడిన మహబూబాబాద్, భూపాలపల్లిలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలే గెలిచారు. దీంతో ఈ రెండు మునిసిపాలిటీలు గులాబీ పార్టీకి దక్కనున్నాయి. పరకాలలో ఎక్కువ వార్డులో గెలిచిన టీఆర్‌ఎస్‌కు ఇప్పుడు ప్రభుత్వం రావడం అనుకూలంగా మారింది. నర్సంపేటలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వర్గానికి మెజారిటీ సీట్లు వచ్చాయి. ప్రభుత్వం వచ్చినా ఇక్కడ టీఆర్‌ఎస్ తరఫున చైర్మన్ ఎన్నికయ్యే పరిస్థితి కనిపించడంలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement