కాంగ్రెస్ యువ నేతల పోట్లాట | Combating the young leaders | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ యువ నేతల పోట్లాట

Dec 13 2014 12:43 AM | Updated on Mar 18 2019 9:02 PM

కాంగ్రెస్ యువ నేతల పోట్లాట - Sakshi

కాంగ్రెస్ యువ నేతల పోట్లాట

ఒకరు ఎమ్మెల్యే, మరొకరు మాజీ ఎమ్మెల్యే.. ఆ ఇద్దరు ఒకే పార్టీకి చెందిన యువ నేతలు.. ఓ పెళ్లిలో ఎదురుపడి చేయి చేయి కలిపారు..

  • పరస్పరం దాడి చేసుకున్న ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి  
  • మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ కేంద్రంలో ఘటన
  • హైదరాబాద్: ఒకరు ఎమ్మెల్యే, మరొకరు మాజీ ఎమ్మెల్యే.. ఆ ఇద్దరు ఒకే పార్టీకి చెందిన యువ నేతలు.. ఓ పెళ్లిలో ఎదురుపడి చేయి చేయి కలిపారు.. అంతలోనే ఏదో గలాటా మొదలైంది.. వాదులాటలు.. తోపులాటలు జరిగాయి.. ఆ తర్వాత సీన్ పోలీస్‌స్టేషన్‌కు మారింది. నాపై దాడి జరిగిందంటే.. నాపై దాడి జరిగిందంటూ ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకునేదాకా వెళ్లింది.. ఇదంతా కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి మధ్య జరిగిన వ్యవహారం.
     
    మాదాపూర్ ఏసీపీ రమణకుమార్, బాధితులు తెలిపిన ప్రకారం... మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి బావమరిది లలిత్ శశాంక్‌రెడ్డి వివాహం శుక్రవారం హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగింది. మధ్యాహ్నం పెళ్లి వేడుకకు హాజరైన కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి మండపం దగ్గరికి వెళ్లారు. అప్పటికే అక్కడ ఉన్న విష్ణువర్ధన్‌రెడ్డి, వంశీచంద్‌రెడ్డి ఒకరినొకరు పలకరించుకున్నారు.

    కానీ అంతలోనే అక్కడ తోపులాట, గొడవ జరిగింది. వెంటనే వంశీచంద్‌రెడ్డి మరికొందరు పార్టీ నేతలతో కలసి మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి.. విష్ణువర్ధన్‌రెడ్డి అకారణంగా తనపై దాడి చేశాడని ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో విష్ణువర్ధన్‌రెడ్డి తల్లి ఇందిర, సోదరి విజయారెడ్డి, తమ అనుచరులతో కలసి అదే పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. తమ పెళ్లికి వచ్చిన వంశీచంద్‌రెడ్డి షేక్‌హ్యాండ్ ఇవ్వడంతోనే దాడి చేసి తన మెడపై, వీపుపై కొట్టాడని ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లోని సీసీ కెమెరాల ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నారు.

    వంశీచంద్ గన్‌మన్ మజీర్ స్టేట్‌మెంట్‌ను నమోదు చేసుకున్నారు. వారి ఫిర్యాదుల మేరకు విష్ణువర్ధన్‌రెడ్డిపై 324, 506, 342 సెక్షన్ల కింద... వంశీచంద్‌రెడ్డిపై 341, 323, 290, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని మాదాపూర్ ఏసీపీ రమణకుమార్ తెలిపారు. కాగా.. టీ సీఎల్పీ నేత జానారెడ్డి వంశీ, విష్ణు మధ్య రాజీ కుదిర్చే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర యువజన కాంగ్రెస్ సభ్యత్వ నమోదు అంశమే.. ఈ వివాదానికి కారణమై ఉంటుందని యూత్‌కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.
     
    అకారణంగా దాడి చేశారు: వంశీచంద్‌రెడ్డి

    ‘‘వంశీ అని పలుకరించడంతో విష్ణువర్ధన్‌రెడ్డికి షేక్‌హ్యాండ్ ఇచ్చాను. కానీ ఆయన వేళ్లు విరగ్గొట్టేందుకు ప్రయత్నించాడు. చెయ్యి లాక్కుం టుండగా ముఖంపై దాడి చేశాడు. నా గన్‌మన్ రక్షణగా వస్తే అతనిపైనా దాడి చేశాడు. విష్ణు వ్యక్తిత్వం ఎలాంటిదో ప్రజలందరికీ తెలుసు. ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవు. అయినా దాడి ఎందుకు చేశారో ఆయన్నే అడగాలి.’’
     
    ఉద్దేశపూర్వకంగా కొట్టాడు: విష్ణువర్ధన్‌రెడ్డి

    ‘‘షేక్‌హ్యండ్ ఇవ్వడంతోనే వంశీచంద్‌రెడ్డి నా మెడ, వీపుపై ఉద్దేశపూర్వకంగా కొట్టాడు. అతని వెంట ఉన్న గన్‌మన్ నా వైపు తుపాకీ చూపి బెదిరించాడు. వంశీతో నాకు ఎలాంటి వివాదాలు లేవు. నాపై దాడి ఎందుకు చేశాడో అతనే స్పష్టం చేయాలి. వంశీపై టీ పీసీసీ అధ్యక్షుడికి ఫిర్యాదు చేశాను.’’
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement