రైతును రాజు చేసేదాకా నిద్రపోం..

CM KCR Speech In Telangana Legislative Assembly - Sakshi

స్థిర సంకల్పంతో పనిచేస్తాం: సీఎం కేసీఆర్‌

రైతుబంధు కొనసాగుతుంది.. 24 గంటల ఉచిత విద్యుత్‌ను ఆపేది లేదు

కొత్త రెవెన్యూ చట్టం తెస్తాం.. సీఏఏను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేస్తాం

ఎన్‌పీఆర్‌ బదులు నేషనల్‌ ఐడెంటిటీ కార్డు పెట్టాలి

రాష్ట్రంలో కరోనా లేదు.. దానిపై అసత్యాలు సరికాదు

ఒకవేళ వైరస్‌ వచ్చినా రూ. 1,000 కోట్లు పెట్టయినా అడ్డుకుంటాం

గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మాన చర్చలో సీఎం కేసీఆర్‌ సమాధానం  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రతి రైతును రాజును చేసేదాకా నిద్రపోమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. అరుపులు, పెడబొబ్బలతో ఎవరు అడ్డుపడినా, అడ్డంకులు సృష్టించినా ఆగేది లేదని, స్థిర సంకల్పంతో పని చేస్తామన్నారు. గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ అనంతరం సీఎం కేసీఆర్‌ సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో రైతుబంధు కొనసాగుతుందని, 24 గంటల ఉచిత విద్యుత్‌ను ఆపేది లేదన్నారు. పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తయ్యాయని, కాళేశ్వరం నీళ్లు వారం పది రోజుల్లో సిద్దిపేటకు రాబోతున్నాయన్నారు. కోదాడ వరకు కాకతీయ కాలువలో 120 రోజుల నుంచి నీళ్లు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో నీటి లభ్యత ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు వ్యవసాయ రంగాన్ని ఎంత నాశనం చేశారో ప్రజలకు తెలుసునన్నారు. వారి విధానాల వల్ల కరెంటు, నీటి సమస్యలు ఉన్నాయని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు.

ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం సన్నరకం సోనా వెరైటీని తయారు చేసిందని, అది షుగర్‌ ఫ్రీ వరి అని, మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ బియ్యాన్ని బేషుగ్గా తినవచ్చని వెల్లడించారు. దేశవ్యాప్తంగా సన్నబియ్యానికి అత్యధిక డిమాండ్‌ ఉందని, రాష్ట్రంలో రైతులు ఎక్కువగా సన్న రకమే పండించేలా రైతులను జూన్‌ నాటికి సిద్ధం చేస్తామన్నారు. వరి సాగు విస్తీర్ణం కోటి ఎకరాలైనా అందులో పండే పంటను సద్వినియోగపరిచేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తామన్నారు. రైతు పండించే ప్రతి గింజను కొంటామన్నారు. ఈ ఏడాది వానాకాలంలో 40 లక్షల ఎకరాలు, యాసంగిలో 38 లక్షల ఎకరాల్లో వరి వేశారని, దాన్నుంచి 225 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని, అందులో 100 లక్షల టన్నులు మనం తినడానికే అవుతుందని, మిగిలిన 125 లక్షల టన్నులు ఎఫ్‌ఐసీ తీసుకోవడానికి సిద్ధంగా ఉందన్నారు. సన్న బియ్యం రకం పంట విస్తీర్ణం పెరిగితే రాష్ట్రంలోని మిల్లులకు ప్రోత్సాహం అందించడం ద్వారా ఎగుమతి చేయవచ్చన్నారు. రైతులకు దుఃఖాన్ని కల్పిస్తున్న రెవెన్యూ చట్టాన్ని మారుస్తామని, కొత్త చట్టాన్ని తెస్తామన్నారు. ఈ సందర్భంగా సీఎం వెల్లడించిన అంశాలు ఆయన మాటల్లోనే..

ఆ ఒక్క ఘటన తప్ప అంతా బాగు..
‘‘రాష్ట్రంలో శాంతిభద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయి. దిశ రేప్‌ కేసు విషయంలో అందరం బాధపడ్డాం. మనందరి ఇళ్లలో తల్లులు, భార్య బిడ్డలున్నరు. ఎంత ఖండించినా తక్కువే. అదొక్కటే దురదృష్టకరమైన సంఘటన. దేశం మొత్తంలో ఉన్న సీసీటీవీల్లో 66 శాతం తెలంగాణలో ఉన్నాయి. 6 లక్షల సీసీటీవీ కెమెరాలను తెలంగాణ వచ్చాక ఏర్పాటు చేశాం. ఇక ఐటీ ఎగుమతుల్లో సూపర్‌ డూపర్‌గా ఉన్నాం. ఐటీ ఉత్పత్తుల ఎగుమతుల జాతీయ వృద్ధిరేటు 7–8 శాతం ఉంటే రాష్ట్రంలో 16 శాతం ఉంది. సామాజిక సమతూకం పాటించే విషయంలో ముందుకు వెళ్తున్నాం. అన్ని రంగాల్లో అన్ని వర్గాల ప్రజల ప్రాతినిధ్యం పెరిగితేనే కడుపునిండినట్లు ఉంటది. అందరికీ అవకాశాలు రానప్పుడు ఆక్రోశం ఉంటది. అది మంచిది కాదు.

ముస్లిం కోటాపై ఆందోళన వద్దు..
ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణపట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో ఈ కేసును వాదించేందుకు సీనియర్‌ న్యాయవాదిని నియమించాం. ప్రత్యేక ఉర్దూ డీఎస్సీ నిర్వహణ, ఆలేరు ఎన్‌కౌంటర్‌పై సిట్‌ దర్యాప్తు నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టాలని అక్బరుద్దీన్‌ ఒవైసీ చేసిన విజ్ఞప్తులపై సానుకూల నిర్ణయం తీసుకుంటాం. పాతబస్తీ లాల్‌దర్వాజ మహంకాళి ఆలయ విస్తరణ చేపట్టాలని అక్బరుద్దీన్‌ విజ్ఞప్తి చేయడం సంతోషం.

మాస్క్‌లు ఎందుకు?
రాష్ట్రంలో కరోనా వైరస్‌ లేదు. దానిపై అసత్యాలు, దుష్ప్రచారాలు చేయడం సరికాదు. కరోనా రావొద్దని దేవుణ్ణి ప్రార్థిస్తున్నా. రాష్ట్రానికి కరోనా వైరస్‌ రాదు.. రానివ్వం. ఈ వైరస్‌ ఇక్కడ పుట్టింది కాదు. ఒకవేళ వచ్చినా రూ. వెయ్యి కోట్లు ఖర్చు పెట్టయినా  అడ్డుకుంటాం. మాస్కులు లేకుండానే పని చేస్తాం. 130 కోట్ల మంది ఉన్న దేశంలో 31 మందికే కరోనా వచ్చింది. అందులో ఒకరు దుబాయ్‌ పోయి వచ్చిన వ్యక్తి రాష్ట్రానికి వచ్చాడు. ఇప్పుడు ఆయన కూడా బాగానే ఉన్నారు, బతుకుతాడు. రాష్ట్రంలో కరోనా లేనప్పడు మాస్క్‌లు ఎందుకు? సభలో ఇంత మంది ఉన్నాం. మాస్క్‌లు లేకపోతే సచ్చిపోతామా? 22 డిగ్రీల ఉష్ణోగ్రత దాటితే కరోనా వైరస్‌ బతకదు అని ఒక సైంటిస్ట్‌ చెప్పారు. మన దగ్గర 30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. అలాంటప్పుడు అది బతకదు. పైగా కరోనాకు ఒక్క పారాసిటమాల్‌ టాబ్లెట్‌ సరిపోతుందని వైద్యులు చెప్పారు.

అవసరమైతే కరెంట్, ఆర్టీసీ చార్జీలు పెంచుతాం..
రాష్ట్రంలో విద్యుత్‌ వ్యవస్థాపక సామర్థ్యాన్ని పెంచుకున్నాం. తలసరి విద్యుత్‌ వినియోగం పెరిగింది. ఇది రాష్ట్రానికి గర్వకారణం. కరెంటు మంచిగా ఇస్తే కాంగ్రెస్‌కు బాధగా ఉంది. 24 గంటల కరెంటు అవసరం లేదట. అప్పులు తెచ్చి విద్యుత్‌ ఇస్తున్నారు.. చార్జీలు పెంచుతారా? అని అంటున్నారు. పెంచుతాం.. ప్రజలకు పరిస్థితిని వివరిస్తాం. గత ఆరేళ్లలో ఒక్కసారే ఆర్టీసీ, కరెంట్‌ చార్జీలను స్వల్పంగా పెంచాం. మరోసారి పెంచాల్సి వస్తే పెంచుతాం. ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా కాకుండా సంస్థల మనుగడ కోసం కొంత మేరకు పెంచుతాం. ప్రజల దగ్గర నుంచి వసూలు చేసే పన్నుల ద్వారానే ప్రభుత్వాలు నడుస్తాయి. అయితే ఆ పన్నులు రీజనబుల్‌గా ఉండాలి.

ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా దోఖా చేస్తే వచ్చేదేంటి?
అధికారంలో ఉంటే ఒకలా.. ప్రతిపక్షంలో ఉంటే మరోలా అలవాటు అయిపోయింది. ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి వస్తే చార్జీలు తగ్గిస్తుందా? అదేం దోఖా? ఎంతకాలం ఈ ఆత్మవంచన, ప్రజావంచన. ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా అబద్ధాలు చెప్పి దోఖా చేస్తే వచ్చేదేంటి?

నాకే బర్త్‌ సర్టిఫికెట్‌ లేదు.. ఎక్కడ తేవాలి?
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్‌) వ్యవహారాలు దేశ గౌరవానికి చెందిన అంశాలు. మిగతా రాష్ట్రాల్లాగే సీఏఏను వ్యతిరేకిస్తూ మన అసెంబ్లీలో చర్చించి తీర్మానం చేసి పంపిద్దాం. తమ పౌరసత్వాన్ని నిరూపించుకొనేందుకు ప్రజలు బాగా ఇబ్బందులు పడుతున్నారు. నేను మా ఊళ్లో సొంతింట్లో పుట్టాను. అప్పుడు దవాఖానాలు లేవు. నాకే బర్త్‌ సర్టిఫికెట్‌ లేదు. నువ్వెవరు అంటే ఏం చెప్పాలి? హౌ డూ ఐ ప్రూఫ్‌?  ఆ కాలంలో పెద్దలు ఊళ్లో ఉన్న అయ్యగారిని పిలిపించి జన్మనామ పత్రిక అని రాయించేవాళ్లు.

అదే బర్త్‌ సర్టిఫికెట్‌. దానికి అధికారిక ముద్ర ఉండదు. ఇప్పటికి కూడా నా జన్మనామం పత్రిక నా భార్య దగ్గర ఉంది. ఆ రోజున ఆసుపత్రులు, ఈ రికార్డులు లేవు. నాదే దిక్కులేదంటే, ‘మీ నాయనది తీసుకురమ్మంటే’ నేను చావాల్నా? మాకు 580 ఎకరాల భూమి, పెద్ద కుటుంబం ఉంది. అలాంటి కుటుంబంలో పుట్టిన నాకే బర్త్‌ సర్టిఫికెట్‌ లేకపోతే దళితులకు, నిరుపేదలకు ఎక్కడిది? వివరాలు తెమ్మంటే యాడ తేవాలి? దీనికి బదులు నేషనల్‌ ఐడెంటి కార్డు పెట్టాలి. సీఏఏపై ఓ రోజంతా సభలో చర్చిద్దాం.

పోడు భూములకు రైతుబంధు వర్తించదు..
పోడు భూములకు రైతుబంధు వర్తించదు. సీఎస్, నేను, మంత్రులు అంతా ఒకసారి వెళ్లి ప్రజాదర్బార్‌ పెట్టి పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తాం. గతంతో పోలిస్తే రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయి. ఆత్మహత్యలే జరగవద్దు. దురదృష్టవశాత్తూ జరిగితే ఇతర రాష్ట్రాల కంటే మనం మెరుగైన పరిహారం ఇస్తున్నాం.

ఇళ్ల పథకాల్లో వారు తిన్నారు..
ఇళ్ల పథకాల్లో వారు (కాంగ్రెస్‌ నేతలను ఉద్దేశించి) తిన్నారు. మేం తినము. పేదలకు డబుల్‌ బెడ్రూం ఇళ్లు కట్టిస్తాం. వారి పాలనలో 70–80 లక్షల ఇళ్లు కట్టామని చెప్పారు. అవన్నీ ఏమయ్యాయి.. ఎక్కడ పోయాయి? వారు ఇళ్లు కట్టలేదు... తినేశారు.

3 ఎకరాల భూమి పథకం నిరంతరం..
దళితులకు 3 ఎకరాల భూమి పథకం నిరంతరం కొనసాగుతుంది. ఎంత మంది వస్తే అంత మందికి ఇస్తాం. భూమి ఉంటే కొనుగోలు చేసి ఇస్తాం. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో విదేశాలకు వెళ్లిన వారిని, హైదరాబాద్‌లో స్థిరపడిన వారితో మాట్లాడితే భూమి కొనుగోలు చేసి ఇస్తాం.

త్వరలో ఏపీలో కూడా 25 జిల్లాలు..
స్వాతంత్య్రం వచ్చాక అనేక రాష్ట్రాలు కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాయి. అప్పట్లో ఉమ్మడి ఆం«ధ్రపదేశ్, పశ్చిమ బెంగాల్‌ మాత్రమే చేసుకోలేదు. తెలంగాణ వచ్చాక 33 జిల్లాలు చేశాం. ఏపీ సీఎం మాట్లాడిన దానిని బట్టి త్వరలో ఏపీలో కూడా 25 జిల్లాలు చేయబోతున్నారు. 

ఇంటికో ఉద్యోగం ఇస్తామనలేదు..
మేం ఇంటికో ఉద్యోగం ఇస్తామనలేదు. యువతను తప్పుదారి పట్టించకండి. మా మెనిఫెస్టోలో చూపిస్తారా? మేం అనని విషయాలను అన్నట్లుగా అబద్ధాలు చెప్పకండి. 60 ఏళ్లలో కాంగ్రెస్, టీడీపీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాయి. తెలంగాణ వస్తే మన ఉద్యోగాలు మనకే వస్తాయని చెప్పాం. పోలీసులు, ఇతర ఉద్యోగాలు కలుపుకుంటే 80 వేలు వచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగులు వేలల్లో ఉంటే ప్రైవేటు ఉద్యోగులు లక్షల్లో ఉన్నారు. ఒక్క ఐటీలోనే 7 లక్షలు, పరిశ్రమల్లో 8 లక్షలు, భవన నిర్మాణ రంగంలో 18 లక్షల మంది ఉన్నారు.

ఈ టర్మ్‌ పూర్తయ్యేలోగా మూసీ ప్రక్షాళన..
ఈ టర్మ్‌ పూర్తయ్యేలోగా మూసీ ప్రక్షాళన చేస్తాం. చౌటుప్పల్‌లో కాలుష్యం మేం తెచ్చామా? మేం పరిశ్రమలకు అనుమతులు ఇస్తే పక్కాగా వ్యవహరిస్తున్నాం. కొన్ని మినహా ఇతర పరిశ్రమల్లో 90 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలని చెప్పాం. త్వరలో రాతపూర్వకంగా తెలియజేస్తాం.

సుస్థిరాభివృద్ధిలో మనం భేష్‌..
సుస్థిరాభివృద్ధిలో తెలంగాణ భేష్‌ అని నీతి ఆయోగ్‌ చెప్పింది. ‘కాగ్‌’ లెక్కల ప్రకారం కాంగ్రెస్‌ హయాంలో స్థూల మూల వ్యయం రూ. 59 వేల కోట్లు ఉంటే ఈ ఐదేళ్లలో రూ. 1.6 లక్షల కోట్లకు చేరింది. ఈ లెక్కలు ‘కాగ్‌’లో అందరూ చూడవచ్చు. 2014 నాటికి జీఎస్‌డీపీ రూ. 4 లక్షల కోట్లు ఉంటే అది ఇప్పుడు రూ. 8.6 లక్షల కోట్లకు చేరింది. 2020–21లో 9.5 లక్షల కోట్లు అవుతుందని కాగ్‌ అంచనా వేసింది.

పాతబస్తీకి మెట్రో..
పాతబస్తీకి మెట్రో రైల్‌ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నాం. ఇప్పటికే అలైన్‌మెంట్‌ సమస్యలు పరిష్కారం అయ్యాయి. ఆ పనులను ప్రారంభించి యుద్ధప్రాతిపదిక కొనసాగించాలని మున్సిపల్‌ శాఖ మంత్రిని ఆదేశిస్తున్నా. పాతబస్తీ ఎమ్మెల్యేలు, ఎంఐఎం ఎంపీ సహకరిస్తారు. పాతబస్తీకి తాగునీటి సమస్యను తీరుస్తాం. ఓల్డ్‌ సిటీలో ఆసుపత్రి కడతాం.

ధూల్‌పేటకు కచ్చితంగా వస్తా..
రాష్ట్రంలో 6,299 గుడుంబా తయారీ కుటుంబాలకు రూ. 125.99 కోట్లతో పునరావాసం కల్పించాం. ధూల్‌పేటలో 859 మందికి రూ. 2 లక్షల చొప్పున ఇచ్చాం. ధూల్‌పేటకు వస్తానని పోలేదు. నిజమే ఒప్పుకోవాలి. నేను, సిటీ ఎమ్మెల్యేలు, మంత్రులం కచ్చితంగా వస్తాం. ఇంకా ఏమైనా సాయం కావాలన్నా చేస్తాం. పీఆర్‌సీ, రిటైర్‌మెంట్‌ వయసు పెంపు అమలు చేస్తాం. అందుకు సమయం, సందర్భం ఉంటుంది. సంస్కరణలు తేవాలి.. తప్పించుకోం.. తప్పకుండా చేస్తాం. కాంగ్రెస్‌ దుష్ట పాలనలోనే వచ్చిన దరిద్రం నిరక్షరాస్యత. వారు పట్టించుకోకపోవడం వల్ల అక్షరాస్యతలో దిగువ నుంచి మూడో స్థానంలో ఉన్నాం. అందుకే ‘ఈచ్‌ వన్‌ టీచ్‌ వన్‌’ కార్యక్రమం గురించి చెప్పాను. ఎమ్మెల్యేలు అందులో చురుగ్గా పాల్గొనాలి. అందుకు బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తాం.’’  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top