అండగా ఉంటే..అభివృద్ధి చూసుకుంటా.. : కేసీఆర్‌  

CM KCR Meeting In Khammam - Sakshi

    ప్రాజెక్టులను అడ్డుకునే పార్టీలకు గుణపాఠం చెప్పాలి 

    సీతారామ నిర్మాణంతో జిల్లా సస్యశ్యామలం 

    సమస్యలన్నీ ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తాం 

    సింగరేణి నిర్వాసితులకూ న్యాయం చేస్తాం 

    మధిర, సత్తుపల్లి ఎన్నికల ప్రచార సభల్లో 

సాక్షిప్రతినిధి, ఖమ్మం: ‘టీఆర్‌ఎస్‌కు ఖమ్మం జిల్లా ప్రజలు అండగా ఉంటే.. అభివృద్ధి అంశం నేను చూసుకుంటా. ప్రతిష్టాత్మక సీతారామ ప్రాజెక్టుతో సహా సాగర్‌ చివరి ఆయకట్టుదారుల వెతలను టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పడే కొత్త ప్రభుత్వం తీరుస్తుంది. దీనికి నేను భరోసా ఇస్తున్నా’ అని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అభయమిచ్చారు. టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ మూడో విడత పర్యటనలో భాగంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి, మధిరలో సోమవారం జరిగిన పార్టీ ఎన్నికల ప్రచార సభల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. జిల్లాలోని అనేక ప్రధాన సమస్యలను తన ప్రసంగంలో ఉదహరించడంతోపాటు వాటి పరిష్కారానికి తనదే బాధ్యత అంటూ ముక్తాయించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవ, పట్టుదలతో ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టును రూపొందించామన్నారు.

వేలకోట్ల రూపాయలతో లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించే సీతారామ ప్రాజెక్టు ను అడ్డుకునేందుకు ఏపీ సీఎం చంద్రబాబు చేయ ని ప్రయత్నం లేదని, కేంద్ర జలవనరుల సంఘానికి లేఖలు సైతం రాశారని, ప్రాజెక్టుల నిర్మాణం జిల్లా ప్రజల మనుగడ సమస్య అని.. దానిని పూర్తి చేసుకోవాల్సిన తక్షణ కర్తవ్యం తమదేనని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనులకు ఎవరు.. ఏ రూపంలో అడ్డుపడుతున్నారో? ఉద్యమ చరిత్ర, రాజకీయ చైతన్యం కలిగిన జిల్లా ప్రజలకు తెలుసన్నారు. ఎవరెన్ని రకాలుగా అవాకులు.. చెవాకులు పేలినా.. వచ్చేది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని, ప్రజల సమస్యలన్నీ ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించి తీరుతామన్నారు. ఇప్పటివరకు నిర్వహించిన ప్రతి సర్వేలో కూడా టీఆర్‌ఎస్‌కే అనుకూలంగా ఉందని చెప్పారు. సీతారామ పూర్తయితే సత్తుపల్లి ప్రాంతంలోని లంకాసాగర్, బేతుపల్లి చెరువులు నిండుకుండలా ఉంటాయని, శ్రమించే తత్వం ఉన్న ఈ ప్రాంత రైతులకు ఇక సాగునీటి బాధ ఉండదని స్పష్టం చేశారు. సింగరేణి భూ నిర్వాసితులకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.  
నన్నెవరూ ఢీకొట్టలేరు.. 
సత్తుపల్లి, మధిర నియోజకవర్గాల్లో సీఎం ప్రసంగాలు జిల్లా అభివృద్ధి అంశాలు.. జాతీయ రాజకీయాలపై ప్రధానంగా సాగాయి. సత్తుపల్లిలో చంద్రబాబునాయుడి తీరును ఎండగట్టగా... మధిర సభలో మాత్రం రాహుల్‌గాంధీ, చంద్రబాబు, జాతీయ పార్టీలు ఒక్కటై తనను ఢీకొట్టే ప్రయత్నం చేస్తున్నాయని, ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకు నన్నెవరూ ఢీకొట్టలేరని స్పష్టం చేశారు. మధిర, సత్తుపల్లిలో జరిగిన సీఎం సభలకు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు హాజరుకావడం ఇటు పార్టీ నేతలకు, అటు సీఎంకు సంతృప్తినిచ్చింది. తన ప్రసంగంలో ఇంత పెద్ద ఎత్తున మండుటెండలో ప్రజలు సభలకు రావడంపై సంతృప్తి వ్యక్తం చేసి.. ఈ ఆదరణే వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయదుందుబి మోగిస్తుందనడానికి ఉదాహరణ అని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించిన జలగం వెంగళరావు జిల్లాకు చేసిన అభివృద్ధిని కొనియాడటంతోపాటు మంత్రి తుమ్మల, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి జోడి జిల్లా అభివృద్ధికి మార్గదర్శకం కానుందని, వెంగళరావు ఇద్దరు కుమారులు టీఆర్‌ఎస్‌ అభివృద్ధికి.. పార్టీ విజయానికి చేస్తున్న కృషితో జిల్లాలో పార్టీకి తిరుగులేదనే అభిప్రాయాన్ని సీఎం తన ప్రసంగాల్లో వ్యక్తపరిచారు.

సత్తుపల్లిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో అశ్వారావుపేట టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లు వేదికపైకి రావడానికి ప్రయత్నించగా.. ఎన్నికల నియమాలను, ఖర్చును పరిగణనలోకి తీసుకుని సీఎం ఆయన భుజం తట్టి వారించారు. మధిరలోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి లింగాల కమల్‌రాజ్‌ ఒక్కరినే పరిచయం చేశారు. సత్తుపల్లి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పిడమర్తి రవి విద్యార్థి ఉద్యమ నాయకుడని, రాష్ట్ర సాధన కోసం అలుపెరగక శ్రమించాడని, ఆయనను గెలిపించుకోవాల్సిన అవసరం పార్టీకి ఉందన్నారు. లింగాల కమల్‌రాజ్‌ ఉన్నత విద్యావంతుడైన యోగ్యుడని, స్థానిక సమస్యలు తెలిసిన యువకుడని, ఆయనను గెలిపించాలని కోరారు. మధిర సభలో బోనకల్, ఎర్రుపాలెంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు కావాలని కోరారని, అబద్ధాలు చెçప్పడం తనకు రాదని, రెండింట్లో ఒకచోట కొత్త ప్రభుత్వం రాగానే డిగ్రీ కళాశాల మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. మధిర  రైతుల ఇబ్బందులను మంత్రి తుమ్మల, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివరించారని.. నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు పరిధిలో 3వ జోన్‌లో ఉన్న ఈ ప్రాంతాన్ని కొత్త ప్రభుత్వం రాగానే తక్షణమే 2వ జోన్‌లోకి తెచ్చి ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయదుందుబి మోగించడం చారిత్రక అవసరమన్నారు. సత్తుపల్లి, మధిర సభల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ మువ్వా విజయ్‌బాబు, కొండబాల కోటేశ్వరరావు, పార్టీ అభ్యర్థులు తాటి వెంకటేశ్వర్లు, పిడమర్తి రవి, లింగాల కమల్‌రాజ్, పార్టీ నేతలు నల్లమల వెంకటేశ్వరరావు, బొమ్మెర రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top