ఆర్టీసీని ప్రభుత్వం నడపాలా.. వద్దా? 

CM KCR comments about RTC - Sakshi

కార్మికులే ప్రశ్నించుకోవాలన్న సీఎం కేసీఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ఇప్పటికే నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ప్రభుత్వం నడపాలా, వద్దా అని కార్మికులు ప్రశ్నించుకోవాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల డిమాండ్లపై బుధవారం జరగనున్న సమావేశానికి సంబంధించి మంగళవారం అధికారులు, మంత్రివర్గ ఉపసంఘం సభ్యులతో కేసీఆర్‌ చర్చించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె నోటీసు ప్రస్తావనకు వచ్చింది. ఆర్టీసీ రూ.2,800 కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని, అలాంటి సమయంలో ఉద్యోగులు తమ జీతాలను  పెంచాలని డిమాండ్‌ చేయటం అసమంజసమని సమావేశంలో అభిప్రాయపడినట్టు తెలిసింది.

టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక ఆర్టీసీ ఉద్యోగులకు 44%  ఫిట్‌మెంట్‌ ఇవ్వడాన్ని సీఎం గుర్తుచేశారు. ఓ రోజంతా ఆర్టీసీ ఉద్యోగులతో సమావేశమై సంస్థను లాభాల్లోకి తీసుకురావాల్సిన అవసరాన్ని గట్టిగా చెప్పిన అంశాన్నీ ప్రస్తావించారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్‌ మేరకు 4,200 మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించామని పేర్కొన్నారు. అయినా ఆర్టీసీ కార్మికులు అనాలోచితంగా సమ్మె నోటీసు ఇవ్వడం తగదన్నారు. 

సగం ఖర్చు జీతాలకే.. 
ఆర్టీసీ ఉద్యోగులు కోరిన స్థాయిలో జీతాలు పెంచితే.. ఏటా వేతనాలపై చేస్తున్న రూ.2,400 కోట్ల కు అదనంగా మరో రూ.1,400 కోట్లు భారం పడుతుందని కేసీఆర్‌ పేర్కొన్నారు. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు తదితర రాష్ట్రాల ఆర్టీసీ ఉద్యోగులతో పోల్చితే తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు ఎక్కువన్నారు. ‘ఆర్టీసీ ఆదాయంలో  జీతభత్యాల కోసమే 52 శాతానికిపైగా ఖర్చు పెడుతోంది. మరే ప్రభుత్వ రంగ సంస్థ కూడా జీతాల మీద ఇంతగా ఖర్చు పెట్టడం లేదు. ఆర్టీసీని లాభాల్లోకి తీసుకెళతామని ఉద్యోగ సంఘాల నాయకులు హామీ ఇచ్చారు.

కానీ 2014–15లో రూ.400 కోట్లకుపైగా, 2015–16లో రూ.776 కోట్లకుపైగా, 2016–17లో రూ.750 కోట్లు, 2017–18లో రూ.680 కోట్ల మేరకు సంస్థ నష్టాల్లో కూరుకుపోయింది..’అని కేసీఆర్‌ పేర్కొన్నారు.  ఈ సమీక్షలో మంత్రులు ఈటల, జగదీశ్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, ఆర్టీసీ చైర్మన్‌ సోమారపు సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top