సీఎం పర్యటన రద్దు | CM canceled | Sakshi
Sakshi News home page

సీఎం పర్యటన రద్దు

Jan 21 2015 3:56 AM | Updated on Jul 25 2018 2:52 PM

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కరీంనగర్ పర్యటన రద్దయింది. ఈ నెల 22న రాత్రి తీగలగుట్టపల్లిలోని...

కరీంనగర్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కరీంనగర్ పర్యటన రద్దయింది. ఈ నెల 22న రాత్రి తీగలగుట్టపల్లిలోని ఉత్తర తెలంగాణ భవన్‌లో బస చేసి, 23న కరీంనగర్‌లో మురికివాడలను సందర్శించనున్నట్టు సీఎం కేసీఆర్ నాలుగు రోజుల క్రితం స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌కు సమాచారం అందించారు. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా సీఎం పర్యటన ఖరారు కావడంతో నగరంలోని హడావుడి నెలకొంది.

అధికారులు, ప్రజాప్రతినిధులు ఆగమేఘాలపై నగరంలో సీఎం సందర్శించే మురికివాడలను గుర్తించే పనిలో పడ్డారు. సంక్షేమ పథకాలు అమలు తీరుపై అధికారులు, ప్రజాప్రనిధులు సమీక్షా సమావేశాలు నిర్వహించారు. కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, నగర మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్, కలెక్టర్ నీతూకుమారిప్రసాద్, జాయింట్ కలెక్టర్ పౌసుమిబసు, మున్సిపల్ కమిషనర్  కేవీ.రమణాచారితో పాటు పలు విభాగాల అధికారులు సీఎం పర్యటన విజయవంతానికి ఏర్పాట్లు చేశారు.

మంగళవారం సాయంత్రం వరకు సీఎం పర్యటన రూట్ మ్యాప్ సైతం ఖరారు చేశారు. తీరా ముఖ్యమంత్రి పర్యటన రద్దయినట్టు రాత్రి సమాచారం అందడంతో అటు నాయకులు, ఇటు అధికారులు హడావుడి తగ్గించారు. ఈ సందర్భంగా మేయర్ రవీందర్‌సింగ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నగరంలో పర్యటిస్తే మురికివాడలకు మహర్దశ వచ్చేదన్నారు. ఇప్పటికే నగర అభివృద్ధికి సంబంధించి ప్రతిపాదనలు తయారు చేశామని వివరించారు. ఈ సమయంలో సీఎం పర్యటన వాయిదాపడటం కొంత నిరాశకు గురిచేసిందన్నారు. తిరిగి కేసీఆర్ నగరానికి ఎప్పుడు వస్తారనే విషయం ఖరారు కాలేదని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement