ఎవరి లెక్కలు వారివే!

The changing political equations in Medak - Sakshi

తెరపైకి కొత్త కూటములు, పార్టీలు

సీపీఎం నేతృత్వంలో బీఎల్‌ఎఫ్‌

కాంగ్రెస్, కోదండరాంపై సీపీఐ కన్ను

కోదండరాం పార్టీపై తటస్తుల ఆసక్తి

ఉమ్మడి మెదక్‌లో ‘ముందస్తు’ వేడి

ఆసక్తికరంగా మారుతున్న రాజకీయం

ముందస్తు సాధారణ ఎన్నికలపై ఊహాగానాల నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీల కార్యకలాపాలు జోరందుకుంటున్నాయి. ఒకటి, రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు మినహా.. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో మిగతా అన్ని చోట్లా ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులపై కొంతమేర స్పష్టత ఉంది. ఇదిలావుంటే రాబోయే సాధారణ ఎన్నికల్లో కొత్త పార్టీలు, కూటములు కూడా తెరమీదకు వస్తాయనే సంకేతాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పాటయ్యే పార్టీలు, కూటముల తరఫున పోటీ అవకాశాలపై ఔత్సాహిక అభ్యర్థులు అంచనాలు వేసుకుంటున్నారు. మరోవైపు కూటములు, పార్టీలు కూడా క్షేత్ర స్థాయిలో తమ కార్యకలాపాలను ముమ్మరం చేసేలా కార్యాచరణ రూపొందించుకుంటున్నాయి.           

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రంలో కొత్త పార్టీలు, కూటముల ఏర్పాటు తెరమీదకు వస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటున్న ఔత్సాహిక అభ్యర్థులు రాజకీయ లెక్కల్లో మునిగి తేలుతున్నారు. సీపీఎం ఆధ్వర్యంలో ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ (బీఎల్‌ఎఫ్‌) పేరిట కొత్త రాజకీయ కూటమి ఏర్పాటైంది. ప్రధాన రాజకీయ పక్షాలు టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీకి ప్రత్యామ్నాయంగా.. వచ్చే ఎన్నికల్లో అన్ని అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను బరిలోకి దించాలని బీఎల్‌ఎఫ్‌ యోచిస్తోంది.

రాష్ట్ర స్థాయిలో 21 రాజకీయ, అంబేద్కరిస్టు, బహుజన పార్టీలు కూటమిలో భాగస్వాములుగా ఉన్నాయి. జిల్లాలో వీటి సంఖ్య 12 వరకు ఉండగా, కూటమికి సీపీఎం నాయకత్వం వహిస్తోంది. నల్లగొండలో జరిగే సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సమావేశాల అనంతరం జిల్లా స్థాయిలో కూటమి కార్యవర్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే కూటమిలో ఉన్న భాగస్వామ్య పార్టీలు, సంఘాలకు చెందిన కొందరు నేతలు.. వచ్చే ఎన్నికల్లో తాము పోటీ చేయాలనుకుంటున్న స్థానానికి సంబంధించి లెక్కలు వేసుకుంటున్నారు. తాము బలంగా ఉన్న స్థానాల్లో పోటీ చేసి.. కూటమిలో భాగస్వాములకు ఇతర స్థానాలు ఇవ్వాలనే యోచన సీపీఎం నేతల్లో కనిపిస్తోంది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో బలమైన కార్మిక సంఘంగా ఉన్న సీపీఎం నేతలు తాము బలంగా ఉన్న స్థానాలపై ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారు. భాగస్వామ్య పార్టీలు బలంగా ఉన్న స్థానాలు, వారి తరఫున పోటీ చేసే అభ్యర్థులు తదితరాలపైనా క్షేత్ర స్థాయిలో కసరత్తు జరుగుతోంది.

కూటమితో విభేదిస్తున్న సీపీఐ..
బహుజన, వామపక్ష కూటమి (బీఎల్‌ఎఫ్‌)కి దూరంగా ఉన్న సీపీఐ మాత్రం ‘వామపక్ష, ప్రజాతంత్ర, లౌకిక’ కూటమి అనే అంశాన్ని తెరమీదకు తెస్తోంది. ఉమ్మడి మెదక్‌ జిల్లా పరిధిలో హుస్నాబాద్, సిద్దిపేట, దుబ్బాక, నర్సాపూర్‌ తదితర ప్రాంతాలపై ఎన్నికల కోణంలో దృష్టి పెట్టాలని నిర్ణయించింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్, కోదండరాం పార్టీ తదితరాలతో కూడిన రాజకీయ కూటమి ఏర్పాటవుతుందని సీపీఐ జిల్లా నేతలు అంచనా వేస్తున్నారు. సాధారణ ఎన్నికలకు ముందే గ్రామ పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని సీపీఐ వర్గాలు భావిస్తున్నాయి.

గత ఏడాది డిసెంబర్‌ నుంచే గ్రామ స్థాయిలో సభ్యత్వ నమోదు ప్రారంభించింది. మార్చి చివరలోగా గ్రామ కమిటీలను ఏర్పాటు చేసి.. కేడర్‌ను సమీకరించుకునే ప్రయత్నంలో ఉంది. నర్సాపూర్, హుస్నాబాద్‌ తదితర ప్రాంతాల్లో గతంలో పార్టీలో చురుగ్గా పనిచేసి.. ప్రస్తుతం దూరంగా ఉంటున్న నేతలను తిరిగి పార్టీలోకి రప్పించేందుకు సంప్రదింపులు జరుగుతున్నాయి.

కోదండరాం కొత్త పార్టీపై ఆసక్తి..
టీజేఏసీని ఉద్యమ సంస్థగా కొనసాగిస్తూనే.. కొత్త రాజకీయ పార్టీని ప్రారంభిస్తామని ప్రొఫెసర్‌ కోదండరాం ఇదివరకే ప్రకటించారు. రాజకీయ పార్టీ పూర్తి స్వరూపం, విధి విధానాలపై మార్చిలో స్పష్టత ఇస్తారని జిల్లా టీజేఏసీ నేతలు అంచనా వేస్తున్నారు. టీజేఏసీలో భాగస్వాములగా ఉన్న సంస్థలు, సంఘాలకు చెందిన బాధ్యులు..కోదండరాం ఏర్పాటు చేయబోయే కొత్త పార్టీలోనూ చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. తెలంగాణ ఉద్యమం, టీఆర్‌ఎస్‌లో పనిచేసి విస్మరణకు గురైన వారు, అసంతృప్తివాదులు సైతం పార్టీలో చేరతారని టీజేఏసీ వర్గాలు వెల్లడించాయి.

రాజకీయాలపై ఆసక్తి ఉన్న తటస్తులు కోదండరాం పార్టీతో పాటు ఇతరక కూటముల బలాలు, ప్రజాదరణపై అంచనాలు వేసుకుంటున్నారు. ప్రజల్లో పలుకుబడి కలిగిన వారు, ఎన్‌ఆర్‌ఐలు, సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా ఉన్న వారిని అభ్యర్థులుగా ఎంపిక చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. టీఆర్‌ఎస్‌లో చురుగ్గా పనిచేసి.. ప్రస్తుతం స్తబ్దుగా ఉంటున్న నేతల జాబితాను నియోజకవర్గాల వారీగా టీజేఏసీ ఇప్పటికే ఖరారు చేసింది. పార్టీ విధి విధానాలను ప్రకటించే నాటికి వాటిని కొత్తగా ఏర్పాటయ్యే పార్టీలోకి తీసుకు రావడం ద్వారా కార్యకలాపాలకు ఊపు తేవాలనే వ్యూహంతో ఉన్నట్లు కనిపిస్తోంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top