చంద్రబాబు పచ్చి మోసగాడు: కేసీఆర్

చంద్రబాబు పచ్చి మోసగాడు: కేసీఆర్ - Sakshi

 • తెలంగాణకు దయ్యంలా దాపురించావు..  ఏపీ సీఎంపై కేసీఆర్ ఫైర్ 

 •   ఇక్కడి రైతులంటే నీకెందుకంత కక్ష?

 •   మాకు ముందుచూపు లేదంటావా?

 •   నీలా దొంగ చూపుల్లేవ్.. నీవన్నీ అసత్యాలే

 •   మా ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు యత్నిస్తున్నావ్

 •   తెలంగాణకు విద్యుత్ రాకుండా అడ్డుకుంటున్నావ్

 •   ఉల్లంఘనలపై సుప్రీంకోర్టుకు వెళతాం

 •   }Oశెలంలో విద్యుత్ ఉత్పత్తి ఆపే ప్రసక్తే లేదు

 •   కృష్ణపట్నంలో వాటాను ముక్కుపిండి వసూలు చేస్తాం

 •   {పకాశం బ్యారేజీ వద్ద చర్చకైనా సిద్ధం

 •   ఏపీ రైతులను, డ్వాక్రా మహిళలనూ మోసగిస్తున్నావ్

 •   బాబు మోసాలన్నీ బయటపెడతామన్న ముఖ్యమంత్రి

 •   విద్యుత్‌పై జోక్యం చేసుకోవాలని ప్రధానికి విజ్ఞప్తి

 •  

   సాక్షి, హైదరాబాద్:‘దేశంలో నీచాతి నీచమైన సీఎం నువ్వొక్కడివే. తెలంగాణ రాష్ట్రానికి దయ్యంలా దాపురించావు. ఇక్కడి రైతులంటే ఎందుకంత పగ. తెలంగాణ పంటలను ఎండబెట్టాలని కంకణం కట్టుకున్నావు. తెలంగాణ రైతుల ప్రాణాలు పట్టడం లేదు. విద్యుత్ విషయంలో నీ మాటలన్నీ అబద్ధాలు, అసత్యాలు. రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని పూర్తిస్థాయిలో ఉల్లంఘిస్తున్నావు. మాకు ముందు చూపులేదంటున్నావ్. నిజమే, మాకు నీలా దొంగచూపుల్లేవు. తెలంగాణ ప్రభుత్వాన్ని బద్‌నాం చేయడానికి అసత్యాలు ప్రచారం చేస్తున్నావ్. ఇదే అసత్యాలతో ఏపీలో రైతులను, డ్వాక్రా మహిళలను మోసం చేస్తున్నావ్. నీ బండారం బయట పెడతాం. నీవొక చీటర్‌వు’ అంటూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం నిర్వహించిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వివరించేందుకు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు తీరుపై విమర్శలు గుప్పిస్తూనే, విద్యుత్ విషయంలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వివరించారు. ‘జూన్ 8న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచే బాబు దొంగచూపు మొదలైంది. అన్యాయంగా, అప్రజాస్వామికంగా సీలేరు నుంచి విద్యుత్ రాకుండా అడ్డుకున్నాడు. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న ఈఆర్సీ(విద్యుత్ నియంత్రణ కమిటీ) చెంప మీద కొట్టి చెప్పడంతో ఆ కమిటీనే తొలగించావు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని సీఈఏ(కేంద్ర విద్యుత్ అథారిటీ) చెప్పినా ఉల్లంఘనలు మానుకోలేదు. ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టుకు వెళతాం’ అని సీఎం పేర్కొన్నారు. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపేసే ప్రసక్తే లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. 

   

    కృష్ణపట్నం నీ బాబు జాగీరు కాదు

   ఏపీలోని కేంద్రాల్లో ఉత్పత్తి అయ్యే థర్మల్, జల విద్యుత్‌లో రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన వాటాను చంద్రబాబు అడ్డుకున్నారని కేసీఆర్ మండిపడ్డారు. ‘కృష్ణపట్నంలో మాకు వాటా ఉంది. తెలంగాణకు పవర్ ఇవ్వొద్దంటూ హిందూజాలను బెదిరిస్తున్నావ్. ఆ హిందూజాలే నాకు ఈ విషయం చెప్పారు. కృష్ణపట్నంలో తెలంగాణ రాష్ట్రం నుంచి రూ. 1050 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. రూ. 550 కోట్లు టీఎస్ జెన్‌కో పెట్టగా, ఎన్‌పీడీసీఎల్ - 1453 కోట్లు, ఎస్‌పీడీసీఎల్ - 352కోట్లు పెట్టాయి. కృష్ణపట్నం నుంచి 220 మిలియన్ యూనిట్లకు గాను మొత్తం కొట్టేశారు. ఒక్క యూనిట్ కూడా రాష్ట్రానికి ఇవ్వలేదు. కృష్ణపట్నంలో వాటా ఎలా ఇయ్యవో.. సుప్రీం కోర్టుకు ఎక్కిస్తం. ముక్కుపిండి వసూలు చేస్తం’ అని కేసీఆర్ ఆగ్రహంగా వ్యాఖ్యానించారు. 

   

   జీవోలు ఇచ్చిందె వరు.. రాద్దాంతం చేసిందెవరు?

   చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే శ్రీశైలం రిజర్వాయర్ కనీస నీటి మట్టాలను 834 అడుగులుగా పేర్కొంటూ జీవో 69ని(15-06-1996) జారీ చేశారని, అవసరాన్ని బట్టి మరిన్ని అడుగులు నీటిని వినియోగించుకోవచ్చునని ఆ జీఓలో పేర్కొన్నారని కేసీఆర్ వివరించారు. అదే ఏడాది 779 అడుగుల వరకు నీటిని వినియోగించారని గుర్తు చేశారు. కానీ, 2004లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఇచ్చిన మరో జీవో 107 (28-09-2004) మేరకు రిజర్వాయర్ కనీస నీటిమట్టాన్ని 834 నుంచి 854 అడుగులకు పెంచినప్పుడు నానా యాగీ చేసి విజయవాడ ప్రకాశం బ్యారేజీలో షో చేసింది ఎవరని సీఎం ప్రశ్నించారు. చంద్రబాబు అండ్ కో దీనిపై కొట్లాడలేదా? జనం పిచ్చోళ్లు కాదు. నీది నాలుకా.. తాటి మాట్టా? నీ మోసం బయట పెడతాం అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రకాశం బ్యారేజీ వద్దనైనా సరే చంద్రబాబుతో చర్చకు సిద్ధమని కేసీఆర్ ప్రతిసవాల్ చేశారు. 

   

   ఏపీ రైతులనూ మోసగిస్తున్నావ్

   ‘‘నీవొక చీటర్‌వు. ఎన్నికల్లో ఏమేం హామీలు ఇచ్చావ్? ఏపీలో రైతులు, డ్వాక్రా మహిళలను మోసిగిస్తున్నావ్. ఎన్నికల్లో అన్ని రకాల పంట రుణాలు రూ. 95 వేల కోట్లు మాఫీ అన్నావ్. డ్వాక్రా మహిళలకు చెందిన రుణాలు రూ. 50 వేల కోట్లు మాఫీ అన్నావ్. ఇది సాద్యం కాదన్న పార్టీలను బచాగాళ్లు అన్నవ్. 9 ఏళ్లు సీఎంగా చేశా, అన్నీ తెలుసన్నావ్. కానీ, ఒక్క పైసా కూడా మాఫీ చేయలేదు. మెలికలు పెడుతున్నవ్. ఈ విషయాలపై ఆంధ్రా రైతులకు సమాధానం చెప్పాలి. నీ బండారం బయట పెడతాం’’ అంటూ చంద్రబాబుపై సీఎం కేసీఆర్ ద్వజమెత్తారు. ఎన్నికల సమయంలో బాబు చెప్పిన అంశాలకు సంబంధించిన క్లిప్పింగులను బయటపెట్టి ఆయన మోసాలను బయటపెడతానని హెచ్చరించారు.

   

   బాబు మోసంతో కరెంటుకు రూ. 608 కోట్లు

   చంద్రబాబు మోసం వల్ల రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకునేందుకు, వారి పంటలను కాపాడేందుకు ఇప్పటికే రూ. 608.79 కోట్లు ఖర్చు పెట్టినట్లు కేసీఆర్ తెలిపారు. ‘నీకు నిద్ర పట్టడం లేదు. ఉమాభారతితో సమావేశం పెట్టిస్తవ్, కృష్ణా వాటర్ బోర్డును పిలిపిస్తవ్, ఎందుకంత గాయి గాయి చేస్తున్నవ్’ అని ప్రశ్నించారు. ‘శ్రీశైలం రెండు రాష్ట్రాల ప్రాజెక్టు. శ్రీశైలం ఎగువలో కృష్ణా నదిలో 97 టీఎంసీల వాటా ఉంది. కానీ, ఇప్పటి దాకా మేము వాడుకుంది కేవలం 16 టీఎంసీలే. ఇంకా 81 టీఎంసీల వాటా ఉంది. ఎస్‌ఎల్‌బీసీని రెండు దశాబ్దాలు జాప్యం చేశారు. ఇపుడు టన్నెల్ అని మరికొన్ని దశాబ్దాలు పనులు సాగేలా చేశారు. పుట్టంగండి నుంచి 11.7 టీఎంసీలే వాడుకుంటున్నాం. అదీ ఎత్తిపోసి. ఉల్లంఘనలు నీవి, అన్యాయం నీది. నా మాటలు తప్పని రుజువు చే స్తే ముక్కు నేలకురాస్తా’ అని సీఎం వ్యాఖ్యానించారు.   

   

   మూడేళ్లలో మిగులు విద్యుత్

   హైదరాబాద్: ‘తెలంగాణ కరెంటు కష్టాలకు కారణం చంద్రబాబే. చంద్రబాబు హయాంలో కేవలం ఆర్టీపీపీ-3లో 210 మెగావాట్ల యూనిట్ మాత్రమే ప్రారంభమైంది. మిగతావన్నీ ఒప్పందాలే(పీపీఏలే). కానీ, మేం చాలా ముందుచూపుతో ఉన్నాం. కరెంటు కష్టాలుంటాయని ఎన్నికల్లోనే చెప్పా. ఏదీ దాయలేదు. రానున్న మూడేళ్లలో మిగులు విద్యుత్ సాధిస్తాం. వెయ్యి మెగావాట్లు ఇవ్వడానికి ఛత్తీస్‌గఢ్ సిద్ధంగా ఉంది. మరో వెయ్యి మెగావాట్లు అడుగుతున్నాం. ఒప్పందం కోసం త్వరలో నేనే ఆ రాష్ట్రానికి వెళతా. ఎన్టీపీసీలో 4 వేల మెగావాట్లు, బీహెచ్‌ఈఎల్‌తో 6 వేల మెగావాట్లు, సోలార్ బిడ్డింగ్ ద్వారా 2 వేల మెగావాట్ల విద్యుదుత్పికి ప్రణాళికలు ఉన్నాయి. 6 వేల మెగావాట్ల అణు విద్యుత్ కోసమూ ఆహ్వానించాం. ఇలా మూడేళ్లలో మిగులు విద్యుత్తును సాధిస్తాం. అప్పుడు రెప్పపాటు కూడా కరెంటు పోనీయం. ఈ వాస్తవాలన్నీ గమనించాలని రాష్ర్ట రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం’ అని సీఎం కేసీఅర్ పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఈటెల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top