టోల్‌ కష్టాలు ఇక తీవ్రం

Cash Lane At Toll Plaza From 15th January Says NHAI Chairman - Sakshi

15 నుంచి ఒక్కటే నగదు లైన్‌

ఫాస్టాగ్‌ లేకుంటే ఇబ్బందులే

రాష్ట్రంలో 52 శాతం వాహనాలకే ఫాస్టాగ్‌లు

గడువు పొడిగింపుపై స్పష్టత ఇవ్వని కేంద్రం

సంక్రాంతి సమయం కావడంతో అధికారుల్లో ఆందోళన 

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ రహదారులపై టోల్‌ కష్టాలు మరింత తీవ్రం కానున్నాయి. ఈ నెల 15 నుంచి టోల్‌ప్లాజాల్లో ఒకటి మినహా మిగిలినవన్నీ ఫాస్టాగ్‌ లైన్లే ఉండనున్నాయి. నగదురూపంలో టోల్‌ చెల్లించేందుకు కేవలం ఒక లైన్‌ మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఫలితంగా ఫాస్టాగ్‌ లేని వాహనదారులకు ఇబ్బందులు తప్పవు. ప్రస్తుతం టోల్‌ప్లాజాల్లో 25 శాతం గేట్లను హైబ్రిడ్‌ మార్గాలుగా కొనసాగిస్తున్నారు. వీటిలో ఫాస్టాగ్‌ ఉన్న వాహనాలతోపాటు సాధారణ నగదు చెల్లింపు వాహనాలు కూడా వెళ్లొచ్చు. ఈ నెల 14 వరకు ఈ వెసులుబాటు ఉంది. దీన్ని ఈ నెలాఖరు వరకు పొడి గించాలన్న డిమాండ్‌ ఉన్నప్పటికీ, కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఇంకా స్పష్టత ఇవ్వలేదు.

ఈ నేపథ్యంలో ముందుగా ప్రతిపాదించినట్టుగా జనవరి 15 నుంచి ప్రతి టోల్‌ప్లాజా వద్ద ఒక్కో వైపు ఒక్క లేన్‌ మాత్రమే నగదు చెల్లింపునకు పరిమితం చేస్తామని ఎన్‌హెచ్‌ఏఐ చైర్మన్‌ స్పష్టంచేశారు. దీంతో జనవరి 15వ తేదీ తెల్లవారుజాము నుంచి ఒక్కో గేట్‌ మాత్రమే నగదు చెల్లింపునకు ఉండనుంది. అసలే సంక్రాంతి సమయం కావడంతో విపరీతంగా రద్దీ ఏర్పడి ఇబ్బందులు తలెత్తుతా యని అధికారులు ఆందోళన చెందుతున్నారు. దీంతో గడువును పొడిగించాలని వాహనదారులతోపాటు అధికారులు కోరుతున్నారు. మ రోవైపు రాష్ట్రంలో మంగళవారం నాటికి దాదా పు 94వేల ఫాస్టాగ్స్‌ అమ్ముడయ్యాయి. దీంతో టోల్‌ప్లాజాల్లో ఫాస్టాగ్‌ లేన్ల నుంచి వెళుతున్న వాహనాల సంఖ్య 52 శాతానికి చేరింది.

స్పీడ్‌ బ్రేకర్ల తొలగింపు.. 
ఫాస్టాగ్‌ తీసుకున్న వాహనాలు టోల్‌ప్లాజాల నుంచి వేగంగా ముందుకు వెళ్లే అవకాశం ఉన్నందున అక్కడ ఏర్పాటు చేసిన స్పీడ్‌ బ్రేకర్లను తొలగించాలని ఎన్‌ హెచ్‌ఏఐ నిర్ణయించింది. ఇప్పటివరకు వాహనదారులు టోల్‌ప్లాజాల వద్ద ఆగి టోల్‌ చెల్లించి వెళ్లేవారు. దీంతో వెనుక వచ్చే వాహనాలు ముందున్న వాహనాలను ఢీకొట్టకుండా చూసేందుకు ఈ స్పీడ్‌ బ్రేకర్లను ఏర్పాటు చేశారు. ఫాస్టాగ్‌ విధానం వల్ల వాహనం ఆగాల్సిన అవసరం లేకపోవడంతో ఈ స్పీడ్‌ బ్రేకర్లను తొలగిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top