విద్యుత్‌ బకాయిలు రద్దు

Canceled the electricity arrears to STs says kcr - Sakshi - Sakshi

     విజిలెన్స్‌ కేసులు కూడా.. 

     ఎస్టీలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరాలజల్లు 

     ప్రతి ఎస్టీ ఇంటికీ రూ.125కే విద్యుత్‌ కనెక్షన్‌ 

     ఎస్టీ వ్యవసాయదారులందరికీ ఉచిత విద్యుత్‌ 

     ఎస్టీ ఆవాస ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం 

     ఇందుకోసం వచ్చే బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు 

     ఎస్టీ ప్రజాప్రతినిధుల సమావేశంలో సీఎం ప్రకటన 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని షెడ్యూల్‌ తెగల(ఎస్టీలు)పై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వరాలజల్లు కురిపించారు. ఎస్టీల విద్యుత్‌ బిల్లుల బకాయిలతో పాటు వారిపై ఉన్న విద్యుత్‌ కేసులన్నీ రద్దు చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. డొమెస్టిక్‌ కేటగిరీలో ఎస్టీల విద్యుత్‌ బిల్లుల బకాయిలపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సీఎం కూలంకషంగా చర్చించి, బకాయిలన్నీ రద్దు చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీల అభివృద్ధికి కట్టుబడి ఉందని, ఎస్టీల్లోని అన్ని తెగలు, జాతులు సమైక్యంగా ఉండి ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, ఎస్టీ ప్రజాప్రతినిధులే పూర్తి సమన్వయంతో ఎస్టీ తెగలు, జాతుల మధ్య ఐక్యత సాధించాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. ఎస్టీ ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్‌ శనివారం ప్రగతిభవన్‌లో నిర్వహించిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 

రూ.125కే విద్యుత్‌ కనెక్షన్‌.. 
రూ.70 కోట్లకు పైగా ఉన్న విద్యుత్‌ బిల్లు బకాయిలను రద్దు చేయాలని, ఇందులో రూ.40 కోట్లను ప్రభుత్వం తరఫున విద్యుత్‌ సంస్థలకు చెల్లించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మిగతా రూ.30 కోట్లను తాము మాఫీ చేస్తామని ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు వెల్లడించారు. ఎస్టీలపై పెట్టిన విజిలెన్స్‌ కేసులు కూడా ఎత్తేయాలని సీఎం ఆదేశించారు. ప్రతి ఎస్టీ ఇంటికి రూ.125 మాత్రమే ఫీజు తీసుకుని విద్యుత్‌ సౌకర్యం కల్పించాలని విద్యుత్‌ అధికారులను ఆదేశించారు. ఒక్కో కనెక్షన్‌కు రూ.125 మాత్రమే దరఖాస్తు ఫీజు తీసుకుని కనెక్షన్‌ ఇస్తామని, ప్రతి ఇంటికి సర్వీస్‌ వైరు, ఇంటిలోపల వైరింగ్, రెండు లైట్లు ఏర్పాటు చేస్తామని, 50 యూనిట్ల లోపు వినియోగించే వారి నుంచి ఎలాంటి చార్జీ తీసుకోబోమని అధికారులు స్పష్టం చేశారు.  

ఎస్టీ వ్యవసాయదారులకు ఉచిత విద్యుత్‌ 
ఎస్టీ ఆవాస ప్రాంతాలన్నింటికీ త్రీఫేజ్‌ విద్యుత్‌ సరఫరా చేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 9,737 ఎస్టీ ఆవాస ప్రాంతాలుండగా, 8,734 గ్రామాల్లో త్రీఫేజ్‌ కరెంటు లేదని, సమైక్య రాష్ట్రంలో జరిగిన నిర్లక్ష్యానికి ఇదో ఉదాహరణ అని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టా ఉన్న వారితో పాటు ఎస్టీ వ్యవసాయదారులందరికీ విద్యుత్‌ సౌకర్యం కల్పించి, ఉచిత విద్యుత్‌ అందిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరారు. అటవీ ప్రాంతాల్లో విద్యుత్‌ లైన్ల నిర్మాణానికి అవసరమైన వ్యూహం రూపొందించాలని పీసీసీఎఫ్‌ ఝాను ఆదేశించారు. 

ఎస్టీ ఆవాస ప్రాంతాలకు రోడ్లు.. 
ఎస్టీ ఆవాస ప్రాంతాలన్నింటికీ రహదారి సౌకర్యం కల్పించాలని, దీనికోసం వచ్చే బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని ఆర్థిక మంత్రిని సీఎం కేసీఆర్‌ కోరారు. రెసిడెన్షియల్‌ పాఠశాలల వల్ల ఎస్టీల పిల్లలకు ఎంతో మేలు కలుగుతోందని, ఈ పాఠశాలల్లో ప్రవేశానికి విపరీతమైన డిమాండ్‌ ఉన్నందున, మరికొన్ని పాఠశాలలు ప్రారంభిస్తామన్నారు. ఆదివాసీలకు ఎక్కువ అవకాశాలు రావడానికి వీలుగా ఆదివాసీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కొత్త రెసిడెన్షియల్‌ పాఠశాలలు ప్రారంభించి స్థానికులకే అవకాశం దక్కే విధానం తీసుకొస్తామన్నారు. బ్యాంకులతో సంబంధం లేకుండా ఎస్టీల స్వయం ఉపాధి కోసం ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. గొర్రెల పెంపకం లాంటి స్వయం ఉపాధి పథకాలను ఎస్టీలకు కూడా వర్తింపచేస్తామని చెప్పారు. ఇందుకోసం పథకాలు రూపకల్పన చేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్, జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, జెన్‌కో–ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు, డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీఆర్‌ మీనా, ముఖ్య కార్యదర్శులు ఎస్‌.నర్సింగ్‌రావు, మహేశ్‌దత్‌ ఎక్కా, ఎస్టీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రజత్‌కుమార్, కమిషనర్‌ లక్ష్మణ్, ఎంపీలు సీతారాంనాయక్, నగేశ్, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. 

ఎస్టీ ప్రజాప్రతినిధులతో కమిటీలు 
- అన్ని ఎస్టీ ఆవాస ప్రాంతాలకు కచ్చితంగా రహదారి సౌకర్యం కల్పించే విషయంలో అధికారులతో సమన్వయం చేసుకోవడానికి సీనియర్‌ ఎమ్మెల్యే డీఎస్‌ రెడ్యానాయక్‌ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. 
విద్య, స్వయంఉపాధి విషయాల్లో సమన్వయానికి ఎంపీ సీతారాంనాయక్‌ నేతృత్వంలో కమిటీని నియమించారు. 
విద్యుత్‌కు సంబంధించిన అంశాలను సమన్వయం చేయడానికి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top