
సాక్షి, హైదరాబాద్: ‘చార్మినార్ అద్భుత కట్టడం. దాని వెనక దాగిన చరిత్ర చార్మినార్ గొప్పదనాన్ని చరిత్రపుటల్లో నిక్షిప్తం చేస్తే, ఆ నిర్మాణానికి గొప్ప సొబగులద్దిన కళానైపుణ్యం దాన్ని విశిష్ట కట్టడంగా నిలిపింది. చార్మినార్ వరకు వచ్చే రహదారిలో పురాతన సౌందర్యాన్ని చూస్తే పురాతన భారతీయత కళ్లముందు కదలాడింది’ అని కెనడా అంతర్జాతీయ వాణిజ్య శాఖ మంత్రి ఫిలిప్ చాంపేన్ అభివర్ణించారు. శుక్రవారం ఆయన తన భార్యతో కలిసి చార్మినార్‌ను సందర్శించారు. అంతకుముందు మంత్రి కేటీఆర్‌తో భేటీ ఆయన ఆయన సాయంత్రం చార్మినార్‌ను సందర్శించి అబ్బురపడ్డారు. కెనడాలో ఎక్కువగా ఆధునిక నిర్మాణాలే కనిపిస్తాయని, ఇలాంటి చారిత్రక ప్రాధాన్యం ఉన్న పురాతన కట్టడాల భాగ్యం కలగదన్నారు.
వందల ఏళ్లనాటి ఈ కట్టడాన్ని పదిలపరుచుకుని భావితరాలకు అందించేందుకు చేస్తున్న కృషి కళ్లకు కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. దాని పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను కేంద్రపురావస్తుశాఖ అధికారి గోపాలరావును అడిగి తెలుసుకున్నారు. మరికొద్ది రోజుల్లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గారాలపట్టి ఇవాంకా చార్మినార్ రాజఠీవీని సందర్శించనున్నారు. అంతర్జాతీయ సదస్సులో భాగంగా నగరానికి వస్తున్న ఆమె చార్మినార్ పక్కనే ఉన్న లాడ్‌బజార్‌లో షాపింగ్ చేయనున్నారు. ఆమె రాకకోసం అక్కడ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఈలోపు అనుకోని అతిథిగా కెనడా మంత్రి రావటం ప్రత్యేకతను సంతరించుకుంది. మరోసారి హైదరాబాద్‌కు వస్తే చార్మినార్‌ను మళ్లీ చూస్తానని ఆయన పేర్కొనటం విశేషం. ప్రస్తుతం సందర్శకులను చార్మినార్ మొదటి అంతస్తువరకే అనుమతిస్తున్నారు. కానీ కెనడా మంత్రి దంపతులు చార్మినార్ పైభాగంలోని మసీదు వరకు వెళ్లి పరిశీలించారు.