బీజేపీలో జోష్‌        

BJP leaders Happy With Amith Shah Meeting In Shamshabad - Sakshi

అమిత్‌ షా పర్యటనతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం 

శంషాబాద్‌లో సభ్యత్వ నమోదును ప్రారంభించిన పార్టీ అధినేత  

సాక్షి, శంషాబాద్‌: బీజేపీ అధినేత అమిత్‌ షా పర్యటనతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. శనివారం శంషాబాద్‌ పట్టణంలో బీజేపీ నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పాల్గొన్నారు. సాయంత్రం 4.25 గంటలకు అమిత్‌షా శంషాబాద్‌లోని కెఎల్‌సీసీ కన్వెన్షన్‌కు చేరుకున్నారు. జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పలువురు నాయకులు ప్రసంగించారు. గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో యువత చూపంతా బీజేపీ వైపే ఉందన్నారు.

రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారుతున్నాయనడానికి బీజేపీకి చెందిన నలుగు ఎంపీల  విజయమే నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి  కేసీఆర్‌ పనితీరుపై ప్రజలు అసహ్యించుకుంటున్నారని, ఆయన చెస్తానని చెప్పిన ఒక్క పని కూడా పూర్తి చేయలేదన్నారు. ఎమ్మెల్సీ రాచందర్‌రావు మాట్లాడుతూ.. ఉద్యోగాలు, ఉపాది పేరిట ఉద్యమాలు చేయించిన టీఆర్‌ఎస్‌ పార్టీ.. ఆ దిశగా  మాట నిలపుకోలేదన్నారు. ఉద్యోగాల నియామకాల్లో రాష్ట్ర ప్రభుత్వం యువతను దగా చేసిందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా రానున్నది బీజేపీ ప్రభుత్వమేనని, ప్రధాని నరేంద్రమోదీ సుపరిపాలనను ప్రజలంతా కోరుకుంటున్నారని అన్నారు.

మాజీ మంత్రి విజయరామారావు మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోదీ, జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఆధ్వర్యంలో బీజేపీ దేశంలోనే పటిష్టమైన పార్టీగా మారిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ పాలనను ప్రజలు కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. మాజీ మంత్రి డీకే అరుణ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రజా ఆమోదయోగ్యమైన బడ్జెట్‌ను అందిందని,  అందుకు ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర ఆర్థిక శాఖమంత్రికి ధన్యవాదాలన్నారు. ఈ బడ్జెట్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వం రైతులు, పేద ప్రజల పక్షపాతిగా నిరూపించుకుందన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రాష్ట్రంలో పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించడం శుభపరిణామమని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పాలన కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని ఆమె చెప్పారు.   

బీజేపీలో చేరిన టీడీపీ నేత 
 టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బుక్క వేణుగోపాల్‌ అమిత్‌ షా సమక్షంలో బీజేపీలో చేరారు. ఆయనకు అమిత్‌షా కాషాయం కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. శంషాబాద్‌ మండలానికి చెందిన బుక్క వేణుగోపాల్‌ గతంలో ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున రాజేంద్రనగర్‌ టికెట్‌ ఆశించారు. కానీ, ఆయనకు టికెట్‌ దక్కలేదు. వేణుగోపాల్‌ చేరికతో శంషాబాద్‌తో పాటు జిల్లా పార్టీలో బీజేపీకి బలం చేకూరిందని ఆ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ ప్రేమ్‌రాజ్, జిల్లా కార్యదర్శి చింతల నందకిశోర్, రాష్ట్ర నాయకులు రాజ్‌భూపాల్‌గౌడ్, కొండ శేఖర్‌గౌడ్, మండల అధ్యక్షుడు చిటికెల వెంకటయ్య, కె.ప్రశాంత్‌ తదితరులు పాల్గొన్నారు.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top