ఓనం మాదిరిగా బతుకమ్మ | Bathukamma as Onam | Sakshi
Sakshi News home page

ఓనం మాదిరిగా బతుకమ్మ

Sep 23 2016 1:12 AM | Updated on Aug 14 2018 10:59 AM

ఓనం మాదిరిగా బతుకమ్మ - Sakshi

ఓనం మాదిరిగా బతుకమ్మ

పూలపండుగను వినూత్నంగా నిర్వహించేందుకు సర్కార్ సమాయత్తమవుతోంది.

- 15 వేల మంది మహిళలకు ప్రత్యేక రంగు చీరలు
- ఎల్‌బీ స్టేడియంలో మెగా ఫెస్టివల్
 
 సాక్షి, హైదరాబాద్: పూలపండుగను వినూత్నంగా నిర్వహించేందుకు సర్కార్ సమాయత్తమవుతోంది. కేరళ మహిళల మాదిరిగా ఈసారి బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనే తెలంగాణ ఆడబిడ్డలు ప్రత్యేక రంగు చీరలతో ఆకట్టుకోనున్నారు. బతుకమ్మ ఉత్సవాల నిర్వహణకుగాను గతేడాది కేటాయించిన రూ.10 కోట్ల బడ్జెట్‌ను సీఎం కేసీఆర్ ఈసారి రూ.15 కోట్లకు పెంచారు. ప్రతి జిల్లాకు రూ.10 లక్షలు కేటాయించారు. తెలంగాణలోని ప్రతి గ్రామంలో బతుకమ్మ పండుగ కళ కనబడాలని, అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 30 నుంచి తొమ్మిది రోజులపాటు ప్రభుత్వ ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు జరగనున్నాయి. కేరళీయుల గ్రామీణ పండుగ ఓనంను అక్కడి ప్రజలు పదిరోజులపాటు చూడముచ్చటగా జరుపుకుంటారు.

ఈ పండుగను నేరుగా తిలకించేందుకు విదేశీయులు సైతం హాజరవుతారు. తిరువనంతపురంలో ఓనం పండుగను నిర్వహిస్తున్నట్లుగానే వినూత్నంగా హైదరాబాద్‌లో బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించాలని ప్రభుత్వం సంకల్పించింది. కేరళ మహిళలు ‘కసవు చీరలు’ ధరించి ఓనం ఉత్సవాల్లో భాగస్వాము లు అవుతారు. అదే తరహాలో ఇక్కడ కూడా బతుకమ్మ పండుగలో పాల్గొనే మహిళలు తెలంగాణ విశిష్టతను చాటేవిధంగా ప్రత్యేక రంగుతో కూడిన చీరలను ధరించనున్నారు. వచ్చే నెల 6న 15 వేల మంది మహిళలతో ఒకే రంగు చీర ధరింప చేసి ఎల్‌బీ స్టేడియంలో ఉండచుట్టిన తాడు ఆకారంలో నిలబెట్టి గ్రాండ్ బతుకమ్మ పేరుతో సరికొత్త సాంస్కృతిక అంశాలు మేళవించి బతుకమ్మ ఉత్సవం నిర్వహించనున్నారు.  కొందరు అధికారుల ఆలోచనలకు సీఎం కార్యాలయ అధికారులు ఆమోదం తెలినట్లు తెలిసిం ది. ఇందుకు సంబంధించిన వివరాలను అధికారులు ఒకట్రెండు రోజుల్లో వెల్లడించనున్నారు. వచ్చే నెల 9న మాత్రం ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మ ఉత్సవాలు యథావిధిగా నిర్వహించనున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement