మాతృభాషలోనే ప్రాథమిక విద్య సాగాలి

Basic education in native tongue - Sakshi

ఆ దిశగా ప్రభుత్వాలు దృష్టి సారించాలి 

ఏవీ ఎడ్యుకేషనల్‌ సొసైటీ ప్లాటినం జూబ్లీవేడుకల్లో ఉపరాష్ట్రపతి 

సాక్షి, హైదరాబాద్‌: ప్రాథమికవిద్య మాతృభాషలోనే జరగాలని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు ఉద్ఘాటించారు. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సూచించారు. శుక్రవారం ఇక్కడ జరిగిన ఏవీ ఎడ్యుకేషనల్‌ సొసైటీ ప్లాటినం జూబ్లీ ప్రారంభ వేడుకలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డితో కలసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏవీ డిజిటల్‌ లైబ్రరీ, ఏవీ యూట్యూబ్‌ చానల్‌ను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులనుద్దేశించి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ‘మన విద్యావ్యవస్థ ఇంకా పరాయిపాలన నుంచి పూర్తిగా బయటపడలేదు. చిన్నప్పటి నుంచే ఆంగ్ల మాధ్యమం మోజులో పడి అమ్మభాషను మర్చిపోతున్నారు.

ఈ ధోరణి పూర్తిగా మారాల్సిన అవసరం ఉంది. అందుకు సరైన మందు ప్రాథమిక విద్యను మాతృభాషలో అమలు చేయడమే. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నిబంధనలు అమలు చేయాలి. భావవ్యక్తీకరణ, విషయ పరిజ్ఞానం పెరగడం, సామాజిక స్థితిగతులను తెలుసుకోవడంలో మాతృభాష దోహదపడుతుంది’అని అన్నారు. మాతృభాష కంటిచూపు వంటిదని, పరాయి భాష కళ్లద్దాల వంటిదని, కంటిచూపు లేకుంటే కళ్లద్దాలు ఉన్నా లాభం లేదని చమత్కరించారు. విద్య కేవలం ఉద్యోగం కోసం మాత్రమే కాకుం డా విజ్ఞానం సంపాదించుకోవడం, దేశానికి సేవను అందించడం కోసం ఉండాలన్నారు. 

విద్యాబోధన ఒక మిషన్‌లా ఉండాలి... 
సమాజం అభివృద్ధి చెందాలంటే సరైన విద్య అందించాలని గుర్తించిన పలువురు మేధావులు విద్యాసంస్థలను స్థాపించారని, అందులో భాగంగా ఏవీ ఎడ్యుకేషనల్‌ సొసైటీ తనవంతు పాత్ర నిర్వర్తిస్తోందని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. విద్యాబోధన ఒక మిషన్‌లా సాగాలే కానీ, అది కమీషన్‌ కోసం సాగితే పలు అనర్థాలకు దారితీస్తుందని హెచ్చరించారు. ప్రస్తుతం విద్యాసంస్థల్లో ఎక్కడా సరైన మైదానాలు ఉండడంలేదన్నారు. ఆరోగ్యవంతమైన సమాజం కోసం యువత వ్యాయామం, యోగాకు సమయం కేటాయించాలన్నారు. తల్లి దండ్రులు, జన్మభూమి, మాతృభాష, గురువు కు గౌరవమివ్వాలని యువతకు సూచించారు. 

విద్యావిధానంలో మార్పులు అవసరం...
మన విద్యావిధానంలో మరిన్ని సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని విద్యాశాఖ మం త్రి జి.జగదీశ్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతమున్న విద్యావిధానం పాత పద్ధతిలో ఉందని, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఆధునీకరించాలన్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు స్థానం ఉండేది కాదని, కొత్త రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆధ్వర్యంలో సంస్కరణలు జరిగాయన్నారు. సమాజ అవసరాలకు అనుగుణంగా విద్యావిధానాన్ని ప్రవేశపెట్టాలని, జీవనం, ఉపాధికి సంబంధించిన అంశాలను జోడించి మార్పులు చేపట్టాలని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ఏవీ ఎడ్యుకేషనల్‌ సొసైటీ అధ్యక్షుడు కె. ప్రతాప్‌రెడ్డి, సెక్రటరీ కొండా రామచంద్రారెడ్డి, కమిటీ సభ్యులు రామకృష్ణారెడ్డి, రఘువీర్‌ రెడ్డి, గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top