విద్యార్థినిపై హత్యాయత్నం

Assassination Attempt On Student By Her Friends In Chennur Kasturbha-Gandhi School - Sakshi

సాక్షి, చెన్నూర్‌ : కలిసి చదువుకునే విద్యార్థినులే తోటి విద్యార్థినిపై హత్యాయత్నానికి పాల్పడిన ఘటన చెన్నూర్‌ కస్తూర్బా పాఠశాలలో ఆలస్యంగా వెలుగుచూసింది. బాధిత విద్యార్థిని కథనం ప్రకారం.. చెన్నూర్‌ మండలం లంబాడిపల్లి గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని కస్తూరిబా గాంధీ విద్యాలయంలో ఏడో తరగతి చదువుతోంది. శనివారం తోటి విద్యార్థినులందరితో కలిసి వారికి కేటాయించిన గదిలో పడుకుంది.

రాత్రి ఒంటిగంట ప్రాంతంలో అదే గదిలో నిద్రిస్తున్న ముగ్గురు విద్యార్థినులు తనపై హత్యాయత్నం చేశారని, ఇద్దరు కాళ్లు, చేతులు పట్టుకోగా.. మరో విద్యార్థిని గొంతుకు గుడ్డచుట్టి నులిమినట్లు పేర్కొంది. ఊపిరి ఆడక పోవడం.. కాళ్లు కొట్టుకోవడంతో పక్కనే ఉన్న విద్యార్థినులు లేచారు. ఉపాధ్యాయురాలు కూడా గదికి వచ్చారు. జరిగిన విషయాన్ని ఆమెకు తెలపడంతో ముగ్గురు విద్యార్థినులను చితకబాదింది. అయితే ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా ఉండేందుకు ముగ్గురు విద్యార్థినులను వారివారి స్వగ్రామాలకు పంపించారని బాధిత విద్యార్థిని తెలిపారు. 

ఇంత జరిగినా గోప్యమెందుకో.. ?
పాఠశాలలో ముగ్గురు విద్యార్థినులు తోటి విద్యార్థినిపై హత్యాయత్నానికి పాల్పడినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మంగళవారం బాధిత విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. విద్యార్థిని తల్లిదండ్రులతో పాఠశాలకు వచ్చి ఘటన విషయాన్ని సిబ్బందిని అడిగేవరకూ  పాఠశాల ప్రత్యేకాధికారి, సిబ్బంది ఎందుకు గోప్యంగా ఉంచారనే విషయం చర్చనీయాంశంగా మారింది.

శనివారం రాత్రి విద్యార్థిని కేకలు వేయడంతో ఉపాధ్యాయురాలు వచ్చి సదరు ముగ్గురు విద్యార్థిను చితకబాదిందని బాధిత విద్యార్థిని చెబుతుంటే.. ఆ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు కూడా చెప్పక పోవడంలోని ఆంతర్యం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ విషయం వెలుగులోకి వస్తే పాఠశాలలో విద్యాభ్యాసం చేసే ఇతర విద్యార్థులు భయాందోళనలకు గురవుతారని, విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందనా..? లేక విధుల్లో ఉన్న సిబ్బందికి ఇబ్బంది కలుగుతుందనా..? అని తల్లిదండ్రులు ప్రశ్నల వర్షం కురిపించారు. 

బిడ్డ చనిపోతే బాధ్యులు ఎవరు..?
‘గదిలో పడుకున్న నా బిడ్డ అరవకుంటే చనిపోయేది. నా బిడ్డా చనిపోతే ఎవరు బాధ్యత వహించేవారు..’ అని బాధిత విద్యార్థిని తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. శనివారం తన బిడ్డను చంపే ప్రయత్నం చేసినా.. ఉపాధ్యాయురాళ్లు తమకు సమాచారం ఇవ్వలేదన్నారు. ఆదివారం పాఠశాలకు వచ్చిన లంబాడిపల్లి గ్రామానికి చెందిన కొందరు తన బిడ్డ ఆరోగ్యం బాగాలేదని చెప్పడంతో అదే రాత్రి వచ్చి ఇంటికి తీసుకెళ్లానని, అక్కడ తనను చంపే ప్రయత్నం చేశారని చెప్పే వరకూ తమకు తెలియదని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని అడిగేందుకు వస్తే ప్రిన్సిపాల్‌ లేదంటున్నారని పేర్కొన్నారు. ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపితే నిజాలు వెలుగులోకి వస్తాయని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటుందని బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు జిల్లా అధికారులను కోరారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top