అధికారం దక్కలేదనే దిగ్విజయ్ అక్కసు | asaduddin owaisi takes on digvijay sing | Sakshi
Sakshi News home page

అధికారం దక్కలేదనే దిగ్విజయ్ అక్కసు

Dec 2 2014 11:40 PM | Updated on Mar 18 2019 7:55 PM

కేంద్రంతోపాటు పలు రాష్ట్రాల్లో అధికారం దక్కలేదన్న అక్కసుతోనే ముస్లింలపై కాంగ్రెస్ అగ్రనేత దిగ్విజయ్‌సింగ్ విషం గక్కుతున్నాడని మజ్లిస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ దుయ్యబట్టారు.

సాక్షి, హైదరాబాద్: కేంద్రంతోపాటు పలు రాష్ట్రాల్లో అధికారం దక్కలేదన్న అక్కసుతోనే ముస్లింలపై కాంగ్రెస్ అగ్రనేత దిగ్విజయ్‌సింగ్ విషం గక్కుతున్నాడని మజ్లిస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ దుయ్యబట్టారు. సోమవారం రాత్రి బాబ్రీ మసీదు విధ్వంస దినం పురస్కరించుకొని ముస్లిం ఐక్య ఫోరం ఆధ్వర్యంలో దారుస్సలాం మైదానంలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ 65 ఏళ్లుగా ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడుకుంటూనే ఉందన్నారు. ఏకంగా ఆ పార్టీ అగ్రనేత దిగ్విజయ్‌సింగ్ ఇటీవల ముస్లింల పక్షాన గళం విప్పుతున్న అసద్, అక్బర్లు విషపు నాగులని వ్యాఖ్యానించడం విచారకరమన్నారు.

తాము విషపు నాగులమైతే.. మీరు రామచిలుకలా అని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేయడం, మహారాష్ట్ర అసెంబ్లీలో రెండు స్థానాలను కైవసం చేసుకోవడం మింగుడుపడక..దిగ్విజయ్ అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నారన్నారు. మధ్యప్రదేశ్‌లో మూడు పర్యాయాలు కాంగ్రెస్ ఎందుకు అపజయం పాలైందని, అక్కడ ఒక్క ముస్లిం ఎమ్మెల్యేనైనా గెలిపించారా అని ఆయన ప్రశ్నించారు. మధ్యప్రదేశ్‌లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బరిలో దిగితీరుతామని ఆయన ప్రకటించారు.

బీహార్ మాజీ సీఎం లాలూప్రసాద్‌యాదవ్ కూడా తమను వివాదాస్పద ప్రసంగాల నేతలంటూ రెచ్చగొడుతున్నారని, బీహార్‌లోని సీమాంచల్‌లో అడుగిడి తీరుతామని వెల్లడించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో తమను రాకుండా అడ్డుకోలేరని, ఇప్పటికే 15 జిల్లాల్లో పార్టీ శాఖలున్నాయని చెప్పారు. ముస్లిం ఐక్య ఫోరం కన్వీనర్ మౌలానా అబ్ధూల్  రహీమ్ ఖురేషీ అధ్యక్షతన జరిగిన సభలో ఆలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం ప్రోఫెసర్ డాక్టర్ ఎస్.ఆలమ్ ఖాస్మీ, మతపెద్దలు, మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యేలు, తదితరులు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement