మనమంతా ఒక్కటే  | Sakshi
Sakshi News home page

మనమంతా ఒక్కటే 

Published Sat, Jan 11 2020 1:43 AM

Asaduddin Owaisi Speech In Grand Muslim Public Rally In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నార్సీ, పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా శుక్రవారం ముస్లింలు కదం తొక్కారు. శుక్రవారం యునైటెడ్‌ ముస్లిం యాక్షన్‌ కమిటీ, ఎంఐఎం పార్టీ సంయుక్తంగా ఇచ్చిన పిలుపు మేరకు పెద్ద ఎత్తున కదలి వచ్చారు. మీర్‌ ఆలం ఈద్గా నుంచి శాస్త్రిపురం వరకు తిరంగా మహా ర్యాలీ దాదాపు గంట పాటు నిర్వహించారు. మీర్‌ ఆలం ఈద్గాలో జరిగిన నమాజ్‌లో పాల్గొన్న అనంతరం ముస్లిం సోద రులు చేతుల్లో ప్లకార్డులు, జాతీయ జెండాలను పట్టుకొని ర్యాలీలో పాల్గొన్నారు. ‘భారతదేశం  మనందరిది.. పౌరసత్వం ఎవరు ఎవరికి ఇవ్వాలి.. మనమంతా ఒక్కటే’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. మోదీ, అమిత్‌ షాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఏఏ, ఎన్నార్సీ వద్దంటూ అజాదీ కావాలంటూ నినాదాలు చేశారు.

ఎన్నార్సీ, పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా నగరంలోశుక్రవారం తిరంగా మహా ర్యాలీ నిర్వహిస్తున్న ముస్లింలు..  

దేశాన్ని లౌకికంగా ఉంచుదాం: అసదుద్దీన్‌ 
‘మత ప్రాతిపదికన కాకుండా భారత దేశాన్ని లౌకి కంగా ఉంచుదాం. అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగాన్ని రక్షించుకుందాం’అని ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ పిలుపునిచ్చారు. శుక్రవారం తిరంగా మహార్యాలీ అనంతరం శాస్త్రిపురంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. మోదీ ప్రభుత్వం అమలుచేయనున్న నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. హిందు, ముస్లిం, సిక్కు, ఇసాయిలను విభజించే పనిలో కేంద్రం ఉందని, దానికి స్వస్తి పలకాలని హితవు పలికారు. ఎవరైనా ఇళ్ల వద్దకు వచ్చి ఆధార్‌ కార్డు, ఇతర వివరాలు అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ అందజేయొద్దని, ‘నేను భారతీయుడిని’అంటూ గర్వంగా చెప్పాలని ప్రజలకు చెప్పారు. 
కలసికట్టుగా పోరాడుదాం.. 
ఎన్నార్సీ, సీఏఏలకు వ్యతిరేకంగా హిందు, ముస్లిం, సిక్కు, ఇసాయిలు ఐక్యంగా పోరాడాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. భారత రాజ్యాం గానికి తూట్లు పొడిచేలా ఆర్‌ఎస్‌ఎస్‌ ఏజెండాను అమలు చేస్తూ దేశాన్ని ముక్కలు చేసేందుకు మోదీ, అమిత్‌షాలు చూస్తున్నారని ఆరోపించారు. దేశం ముక్కలు కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఐకమత్యంగా పోరాడాలని సూచించారు. ఆర్‌ఎస్‌ఎస్, విశ్వ హిందూ పరిషత్‌ల కుట్రను భారతదేశంలోని ప్రతి ఒక్కరూ ప్రతిఘటించాలని కోరారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు సీఏఏ, ఎన్నార్సీపై వ్యతిరేకత ఉందని పేర్కొ న్నారు. ప్రజలకు రోటీ, మకాన్, ఉద్యోగాలు కల్పించకుండా దేశాన్ని హిందూ రాజ్యాంగం చేసే యత్నాలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ మహ్మద్‌ సలీం, హజ్‌ కమిటీ చైర్మన్‌ ముసియుల్లా, ప్రజా సంఘాల ప్రతినిధులు సంధ్య, విమలా, ఖలేదా ఫర్వీన్, హర్భజన్‌ సింగ్, సంజయ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement