గెలుపే లక్ష్యంగా.. ప్రచారం | All Parties Election Campaign In Khammam | Sakshi
Sakshi News home page

గెలుపే లక్ష్యంగా.. ప్రచారం

Apr 4 2019 6:24 PM | Updated on Apr 4 2019 6:26 PM

All Parties Election Campaign In Khammam - Sakshi

సాక్షి, వైరారూరల్‌: పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారం రోజు రోజుకు ఊపందుకుంటోంది. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. మరికొంత మంది నాయకులు తమదైన శైలిలో వారికి ఆకర్షించుకోవడానికి ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. ఫలానా వ్యక్తి ఎవరి తాలుకా.. ఎవరు చెబితే వింటారు.. అనే కోణంలో సదరు వ్యక్తిని మచ్చిక చేసుకోవడానికి సకల ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార పార్టీతోపాటు, కాంగ్రెస్, బీజేపీ నాయకులు నిత్యం మారుమూల గ్రామాల బాట పడుతున్నారు. మూకుమ్మడిగా ఆయా గ్రామాల్లోని వాడల్లో గడప గడపకు వెళ్లి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. పల్లెల్లోని ఏ వాడను వదిలిపెట్టకుండా ద్వితీయ శ్రేణి నాయకులు ప్రచారం చేస్తున్నారు.  


రోజుకు 2 నుంచి 4 ఊర్లు టార్గెట్‌.. 
బరిలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థుల తరుపున ద్వితీయ శ్రేణి నాయకులు తమ ప్రచారాన్ని ప్రణాళిక బద్ధంగా కొనసాగిస్తున్నారు.  రోజుకు కనీసం 2 నుంచి 4 ఊర్లలో ప్రచారం నిర్వహించే విధంగా ప్రణాళికలు రూపొందించుకొని ప్రచారం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో వీరి వెంట తిరుగుతున్న కార్యకర్తలకు సకల సదుపాయాలు కల్పిస్తున్నారు. 


గల్లీ లీడర్లకు పెరిగిన డిమాండ్‌..  
ఎన్నికల నేపథ్యంలో నిత్యం ప్రజల మధ్యే ఉండే గల్లీ లీడర్లకు డిమాండ్‌ పెరిగింది. ఫలానా ఊరిలో ఫలానా వ్యక్తి చెబితే ఆ గల్లీ మద్దతు లభిస్తుందని తెలిసిన వెంటనే.. బడా లీడర్లు ఆ గల్లీ లీడర్ల వద్ద వాలిపోతున్నారు. రాత్రిళ్లు సైతం ఆయా గల్లీ లీడర్లతో మంతనాలు జరుపుతున్నారు. వారు స్థానిక సమస్యల పరిష్కారంతోపాటు వారి స్వంత డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్‌ చేసే పరిస్థితులు కన్పిస్తున్నాయి.   
ప్రచార రథాల హోరు.. 
ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్, కాంగ్రెస్, సీపీఎంతోపాటు బీజేపీ ఏర్పాటు చేసిన ప్రచార రథాలు హోరెత్తిస్తున్నాయి. ఉదయం 8 గంటల నుంచే మండల కేంద్రంలోని ఆయా పార్టీల కార్యాలయాల నుంచి ప్రచార రథాలు పల్లెలకు బయలుదేరి వెళుతున్నాయి. గ్రామానికి చేరుకున్న ప్రచార రథాలు రికార్డింగ్‌ పాటలతో తమ తమ అభ్యర్థికే ఓటు వేసి గెలిపించాలని జోష్‌ పెంచుతున్నారు. 


ప్రచారాలకు ఎండ దెబ్బ.. 
రోజు రోజుకు ముదురుతున్న ఎండలతో నాయకులు బేజారుపడుతున్నారు. ఎండ ప్రతాపంతో వీరు ఉదయం పూటే ప్రచారం చేయాలని అనుకుంటున్నారు. ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే ప్రచారం నిర్వహించి ఆ తర్వాత మండల కేంద్రానికి చేరుకుని వారివారి పార్టీ కార్యాలయాల వద్ద సేదతీరుతున్నారు. ఎండ ప్రతాపం ఉండకపోతే ప్రచారం మరింత జోరందుకునేదని వారు సంభాషించుకుంటున్నారు.

 
కాదేది ప్రచారానికనర్హం.. 
కాదేది కవిత్వానికనర్హం అని ఓ కవి అన్నట్లుగానే ప్రచారానికి ఏ సందర్భాన్ని అయినా నాయకులు వాడుకుంటున్నారు. పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో.. పిలిచిన ప్రతి పెళ్లికి హాజరై ఓటర్లను తమ వైపు ఆకర్షించుకోడానికి యత్నిస్తున్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలతోపాటు పెద్దస్థాయి నాయకులు కూడా శుభకార్యాలకు హాజరై ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి సకల ప్రయత్నాలు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఓటరు మహాశయులను ప్రసన్నం చేసుకోవడం అంత సులువు కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement