‘నామినేట్‌’ నాకే..!

Agricultural Marketing Committees Khammam - Sakshi

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్రంలో పగ్గాలు చేపట్టింది. ఇక నామినేటెడ్‌ పదవుల పందేరం మొదలైంది. ఉమ్మడి జిల్లాలో ఖాళీగా ఉన్న వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు, దేవాలయాల పాలక మండళ్లు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులను దక్కించుకునేందుకు పోటీ పెరిగింది. నామినేటెడ్‌ పదవుల భర్తీ అంశం మళ్లీ తెరపైకి రావడంతో అవకాశం ఎవరికి లభిస్తుందోననేది పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ రేపుతోంది. గత ప్రభుత్వ హయాంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నలుగురు కార్పొరేషన్‌ చైర్మన్లు పనిచేయగా.. ఈసారి అటువంటి పదవులు ఎంత మందికి వరిస్తాయి.. పార్టీ ఏ రూపంలో అవకాశం కల్పిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది.  
సాక్షిప్రతినిధి, ఖమ్మం: రాష్ట్రంలో నామినేటెడ్‌ పదవులను దక్కించుకునేందుకు టీఆర్‌ఎస్‌ నాయకులు ఎవరి ప్రయత్నాల్లో వారు నిమగ్నమయ్యారు. తమకు పార్టీలో పరిచయం ఉన్న రాష్ట్రస్థాయి నేతలను కలుస్తూ తమ పేరును పరిశీలించాలని కోరుతున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీలో విద్యార్థి ఉద్యమ నేతగా ఉన్న పిడమర్తి రవిని టీఆర్‌ఎస్‌ తొలిసారిగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమించింది. తర్వాత ఆయన పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగించింది. ఇటీవల సత్తుపల్లి నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసే సమయంలో చైర్మన్‌ పదవికి ఆయన రాజీనామా చేశారు.

ఆయన ఓడిపోవడంతో పార్టీ ఏ రూపంలో ఆయనకు అవకాశం కల్పిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర గిరిజనాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా పనిచేసి.. ఇటీవల అశ్వారావుపేట టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీచేసే సమయంలో తన పదవికి రాజీనామా చేసిన తాటి వెంకటేశ్వర్లు సైతం అశ్వారావుపేట నుంచి ఓటమి చెందారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా గత ప్రభుత్వం కొండబాల కోటేశ్వరరావును నియమించగా.. రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా అప్పటి పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న బుడాన్‌ బేగ్‌ను నియమించింది. అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు బేగ్‌ టీడీపీ తీర్థం పుచ్చుకోవడంతో జిల్లాకు చెందిన మైనార్టీలకు కార్పొరేషన్‌ పదవుల్లో అవకాశం లభిస్తుందనే ప్రచారం జరుగుతోంది.

రాష్ట్రస్థాయి కార్పొరేషన్‌ చైర్మన్‌గా పనిచేసి.. ప్రస్తుతం పార్టీలో ఉన్న ముగ్గురిలో ఎంత మందికి మళ్లీ అవకాశం దక్కుతుందనే అంశం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. వీటితోపాటు కొద్దికాలంగా ద్వితీయ శ్రేణి నేతలను ఊరిస్తున్న నామినేటెడ్‌ పదవులపై నియోజకవర్గాల ద్వితీయ శ్రేణి నేతలు దృష్టి సారించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పార్టీ జెండా మోసిన నాయకులకు ఈసారైనా గుర్తింపు ఇవ్వాలనే డిమాండ్‌తో తెలంగాణ ఉద్యమకారులు నామినేటెడ్‌ పదవులపై దృష్టి పెట్టి పార్టీలో.. ప్రభుత్వంలో తమకున్న పరిచయాల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు.
 
మార్కెట్‌ కమిటీలు.. 

ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అనేక వ్యవసాయ మార్కెట్‌ కమిటీల పదవీ కాలం ఇప్పటికే ముగిసింది. మరికొన్నింటి పదవీ కాలం 2019 ఫిబ్రవరిలో ముగియనుంది. గత ఏడాది అక్టోబర్‌లో ఉమ్మడి జిల్లాలో అత్యంత పెద్ద మార్కెట్‌గా ఉన్న ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ పదవీ కాలం పూర్తయింది. చైర్మన్‌గా ఆర్జేసీ కృష్ణ వ్యవహరించారు. ఆ తర్వాత మార్కెట్‌ కమిటీ పాలక వర్గాన్ని ప్రభుత్వం భర్తీ చేయలేదు. ఈలోపు ఎన్నికలు రావడం.. ఖమ్మంలో టీఆర్‌ఎస్‌ విజయం సాధించడంతో ఈ పదవిపై ద్వితీయ శ్రేణి నేతల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. మార్కెట్‌ చైర్మన్‌ పదవి కోసం అనేక మంది తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌ ఆశీస్సులున్న వారికి ఈ పదవి లభిస్తుందనే ప్రచారం జరుగుతుండడంతో తాము పార్టీకి చేసిన సేవలను వివరించడంతోపాటు ఉద్యమ సమయంలో పార్టీకి అండగా ఉన్న తీరు ను వివరించడం ద్వారా నామినేటెడ్‌ పదవుల్లో అవకాశం కల్పించాలని కోరుతున్నారు. అలాగే ఉమ్మడి జిల్లాలోని ఇల్లెందు, కొత్తగూడెం, బూర్గంపాడు, దమ్మపేట వ్యవసాయ మార్కెట్‌ కమిటీల పదవీ కాలం ఇప్పటికే పూర్తయింది. వీటికి కొత్త పాలక వర్గాలను ప్రభుత్వం నియమించాల్సి ఉండడంతో.. ఆయా మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవులను ఆశిస్తున్న నేతలు తమవంతు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. భద్రాచలం, చర్ల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ పాలక వర్గాల పదవీ కాలం మాత్రం వచ్చే ఫిబ్రవరి వరకు ఉంది.
 
భద్రాచలం ట్రస్ట్‌ బోర్డు పదవికి ప్రయత్నాలు.. 
ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అత్యంత కీలకంగా భావించే.. దక్షిణ అయోధ్యగా పేరున్న భద్రాచలం ట్రస్ట్‌ బోర్డును ప్రభుత్వం సుదీర్ఘకాలంగా నియమించకపోవడం.. మరో నాలుగు నెలల్లో శ్రీరామనవమి ఉండడంతో తక్షణమే ప్రభుత్వం బోర్డును ఏర్పాటు చేస్తుందనే ఆశాభావంతో పలువురు కీలక నేతలు ఆ పదవి కోసం తమవంతు ప్రయత్నాలను ప్రారంభించారు. 2014లో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇప్పటివరకు భద్రాచలం ట్రస్ట్‌ బోర్డును నియమించలేదు. ఈ పదవి కోసం పలువురు రాష్ట్రస్థాయి నేతలు సైతం ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక పలు దేవాలయాల పాలక మండళ్ల పదవీ కాలం పూర్తి కావడంతో ఈ ఏడాది సెప్టెంబర్‌లో కొన్ని పాలక మండళ్లను పొడిగించారు. మరికొన్ని ఆలయాలకు కొత్త పాలక మండళ్లను నియమించారు. ఇంకా జిల్లాలో పలు దేవస్థానాల పాలక మండళ్లను నియమించాల్సి ఉండడంతో వీటిపై పార్టీ నేతలు దృష్టి సారించారు.

ఇవి కాకుండా.. డీఆర్‌డీఏ, ఆర్టీఏ, సివిల్‌ సప్లై వంటి సంస్థల్లో పలువురు పార్టీ నేతలను సభ్యులుగా ప్రభుత్వం గతంలో నియమించింది. అయితే వారి పదవీ కాలం పూర్తయ్యేంత వరకు కొనసాగిస్తారా? మళ్లీ కొత్త సభ్యులను నియమిస్తారా? అనేది తేలాల్సి ఉంది. వీటితోపాటు గత ప్రభుత్వ హయాంలో నాలుగు కార్పొరేషన్‌ పదవులు ఉమ్మడి ఖమ్మం జిల్లాను వరించినా.. రాష్ట్రస్థాయి డైరెక్టర్‌ పదవులు మాత్రం జిల్లావాసులకు పెద్దగా దక్కలేదు. ఈసారి పలువురు నేతలు రాష్ట్రస్థాయి డైరెక్టర్లుగా అవకాశం కల్పించాలని కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఖమ్మం నగర పాలక అభివృద్ధి సంస్థ(స్తంభాద్రి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ) సుడాను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఏడాది క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి కమిటీని నియమించాల్సి ఉంది. సుడా చైర్మన్‌ పదవి కోసం పలువురు నేతలు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తుండడంతో ఈ పదవి ఎవరిని వరిస్తుందనే అంశం చర్చనీయాంశంగా మారింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top