‘ముందస్తు’ కసరత్తు..!

Adilabad Voter Notification - Sakshi

ఆదిలాబాద్‌అర్బన్‌: ముందస్తు ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఓటర్ల జాబితా తయారీ, సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు, ఈవీఎంల దిగుమతి వంటి వాటిపై ఎన్నికల సంఘం(ఈసీ) దృష్టి సారిస్తే.. శిక్షణలు, సమీక్షలు, సమావేశాలతో అధికారులు బీజీబీజీగా గడుపుతున్నారు. ఇటీవల జిల్లా కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌ ఓటరు నమోదు అంశంపై హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో పాల్గొని వచ్చారు. సోమవారం జిల్లా అధికారులతో కలిసి ఈవీఎంలు భద్రపర్చే గోదాములను పరిశీలించారు.

అసెంబ్లీ ఎన్నికలను వచ్చే నవంబర్‌లోనే నిర్వహించేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లను ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగానే సెప్టెంబర్‌ 1న ప్రకటించిన ఓటర్ల నమోదు షెడ్యూల్‌లో కేంద్ర ఎన్నికల సంఘం మార్పులు చేసింది. మార్పు చేసిన షెడ్యూల్‌ ప్రకారం 2018 జనవరి ఒకటో తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన యువతకే అవకాశం కల్పించింది. కాగా, జిల్లా ఎన్నికల సంఘం అధికారులు కావాల్సిన సామగ్రి, పోలింగ్‌ కేంద్రాలు, ఈవీఎంలను సిద్ధం చేస్తున్నారు. ఇది వరకే పంచాయతీల పోలింగ్‌ కేంద్రాల పెంపు పూర్తి కాగా, ఓటరు నమోదులో యంత్రాంగం బీజీగా ఉంది.

నమోదు షెడ్యూల్‌లో మార్పు.. 
అసెంబ్లీ ఎన్నికలను నవంబర్‌లోనే జరిపేలా ఓటర్ల జాబితా షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం సవరించింది. దీంతో జిల్లా ఎన్నికల అధికారులు సైతం ముందస్తుకు సిద్ధం అవుతున్నారు. ఈ నెల 1న ప్రకటించిన ఓటరు నమోదు షెడ్యూల్‌ ప్రకారం 2019 జనవరి ఒకటో తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన యువతకు ఓటు నమోదులో అవకాశం కల్పించారు. నవంబర్‌లోనే ఎన్నికలు జరుపనున్నందున వారు అర్హులు కారని ఈసీ భావించింది. 2018 జనవరి ఒకటో తేదికి 18 ఏళ్లు నిండిన యువతకే రా>నున్న ఎన్నికల్లో ఓటు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించింది. 18 ఏళ్లు నిండి ఇంత వరకు ఓటరు జాబితాలో పేర్లు లేనట్‌లైతే వారు నమోదు చేసుకునేందుకు ఈ నెల 25 వరకు అవకాశం కల్పించింది.

కొత్త ఓటరు నమోదుతోపాటు ఇంతకు ముందున్న ఓటరు కార్డుల్లో మార్పులు, చేర్పులు, చిరునామాలు, పోలింగ్‌ కేంద్రాల మార్చుకునేందుకు అవకాశం కల్పించింది. దరఖాస్తు ఫారాలను ఆయా మండలాల తహసీల్దార్లు, ఆర్డీవోల, బూత్‌ స్థాయి అధికారి(బీఎల్‌వో)ల వద్ద అందుబాటులో ఉంచారు. ఓటు నమోదుకు యువత ముందుకు రావాలని జిల్లా యంత్రాంగం, ఎన్నికల అధికారులు కోరుతున్నారు. ఇప్పుడు నమోదు చేసుకుంటే రానున్న ఎన్నికల్లో ఓటు వేయొచ్చని అధికారులు పేర్కొంటున్నారు. కాగా, 2019 జనవరి ఒకటో తేదీ నాటికి 18 ఏళ్లు నిండే యువత నుంచి కూడా దరఖాస్తులు స్వీకరించాలని సూచించింది. ఈ దరఖాస్తులను ప్రత్యేకంగా స్వీకరించి పరిశీలన అనంతరం 2019 జనవరిలో తుది జాబితా విడుదల చేయాలని పేర్కొంది.

పది రోజుల్లో వెయ్యి దరఖాస్తులు.. 
గత ఓటరు నమోదు షెడ్యూల్‌ ప్రకారం అధికారులు ఓటర్ల నమోదు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నెల 1 నుంచి 10 వరకు సుమారు వెయ్యి దరఖాస్తులు వచ్చాయి. ఆదిలాబాద్‌ 574 దరఖాస్తులు రాగా, బోథ్‌ నియోజకవర్గంలో 420 దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తుల్లో ఓటు తొలగింపులకు 160 రాగా, కొత్తగా ఓటు నమోదు చేసుకునేందుకు 817 దరఖాస్తులు వచ్చాయి. మార్పులు చేర్పులకు 13 దరఖాస్తులు రాగా, పోలింగ్‌ కేంద్రాల మార్పునకు 4 దరఖాస్తులు వచ్చినట్లు అధికారుల వద్ద సమాచారం ఉంది. ఓటరు నమోదు నిరంతర ప్రక్రియ అయినందున సెప్టెంబర్‌కు ముందు ఆదిలాబాద్‌లో 2,664 దరఖాస్తులు రాగా, బోథ్‌లో 228 దరఖాస్తులు వచ్చాయి.

అవగాహన అవసరం.. 
ఓటు హక్కుపై అవగాహన కల్పించేందుకు ఇదే సరైన సమయం. ఆ దిశగా ఎన్నికల సంఘం అధికారులు చర్యలు తీసుకోవాలని యువత కోరుతోంది. ఇప్పుడు బ్యానర్లు, కరపత్రాలు, అవగాహన కార్యక్రమాలు చేపడితే ఓటు నమోదుకు యువత ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. ఇలాంటి సమయాల్లో విద్యాసంస్థల్లో విద్యార్థులు, గ్రామాల్లో, పట్టణాల్లో ప్రజలకు ఓటు హక్కు నమోదుపై అవగాహ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టరేట్‌లో, బీఎల్‌వో వద్ద ఓటు నమోదు ఫారాలను అందుబాటులో ఉంచినా యువతకు అవగాహన లేకపోవడంతో ఎక్కడికక్కడే మూలుగుతున్నాయి. దీంతో ఆశించిన స్థాయిలో ఓటు నమోదు కావడం లేదు. క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పిస్తే కొంత వరకైనా లక్ష్యం సాధించవచ్చు.

ఈ నెల 25 వరకే నమోదు.. 
కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ప్రకటించిన ఓటరు నమోదు షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 25 వరకే జాబితాలో కొత్త ఓటరుగా తమ పేర్లను నమోదు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఇంతకు ముందున్న కార్డుల్లో తప్పులు, సవరణలు, పేర్లు, చిరునామాల్లో మార్పులు చేసుకోవచ్చు. తొలగింపు చేసుకునేందుకు సైతం దరఖాస్తు ఇవ్వవచ్చు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 518 పోలింగ్‌ కేంద్రాలతోపాటు అధికారుల వద్ద ఫారాలు అందుబాటులో ఉన్నాయి. బూత్‌ స్థాయి అధికారులు, తహసీల్దార్లు, ఆర్డీవోలు ఓటరు నమోదు కార్యక్రమాల్లో అందుబాటులో ఉండి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఇలా కాకుండా ఆన్‌లైన్‌ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ అవకాశం 18 ఏళ్లు నిండిన ప్రతి యువత సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top