ఆస్తులకూ ఆధార్‌

Aadhaar Is Mandatory For Municipal Property In Telangana - Sakshi

 ఇప్పటివరకు 9 వేల ఆస్తులకు అనుసంధానం పూర్తి

 మొత్తం 26 వేల ఆస్తులు

 బల్దియాలో కొనసాగుతున్న సర్వే

 వేగవంతం చేయాలని సీడీఎంఏ ఆదేశాలు

 అక్రమ ఆస్తులకు అడ్డుకట్ట పడే అవకాశం

సాక్షి,ఆదిలాబాద్‌: ప్రభుత్వం ఏ పథకం తీసుకొచ్చిన దానికి లబ్ధి పొందాలంటే ఆధార్‌ కార్డు ఉండాలి. ప్రతీ దానికి ఆధార్‌ను అనుసంధానం చేస్తున్న ప్రభుత్వం మున్సిపాలిటీల్లోని ఆస్తులకూ ఆధార్‌ తప్పనిసరి చేసింది. గతంలోనే ఈ ప్రక్రియ ప్రారంభించినా మధ్యలోనే నిలిచిపోయింది. దీంతో రెండు రోజుల క్రితం దీనిపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన సీడీఎంఏ శ్రీదేవి పన్ను చెల్లించే ప్రతీ ఆస్తికి ఆధార్‌ అనుసంధానం పూర్తి చేయాలని ఆదేశించారు. బల్దియాలో ఆస్తులకు ఆధార్‌ అనుసంధానం చేయాలని ఏడాది కిందటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలున్నాయి. ఇందులో భాగంగానే ఆదిలాబాద్‌ మున్సిపాలిటీలో గతేడాది జూన్‌లో ఈ ప్రక్రియ ప్రారంభించారు. మధ్యలోనే ఈ కార్యక్రమం ఆగిపోయింది. మొదట్లో ఇంటింటి సర్వే నిర్వహించిన అధికారులు ఇతర పన్నుల వసూళ్లకే ప్రాధాన్యత ఇవ్వడంతో ఈ లక్ష్యం నెరవేరలేదు.

బల్దియాలో 9 వేలు పూర్తి..
జిల్లాలో ఆదిలాబాద్‌ ఒక్కటే మున్సిపాలిటీ ఉంది. ఆదిలాబాద్‌ బల్దియాలో 36 వార్డులు ఉన్నాయి. 2011 జనాభాల లెక్కల ప్రకారం 1.17 లక్షల జనాభా ఉంది. 20.65 చదరపు కిలోమీటర్లు విస్తరించింది. మొత్తం 26 వేల ఆస్తులు ఉన్నాయి. గతేడాది ప్రారంభించిన ఆస్తులకు ఆధార్‌ అనుసంధానం ప్రక్రియలో ఇప్పటి వరకు 9 వేల ఆస్తులకు ఆధార్‌ పూర్తి చేశారు. సీడీఎంఏ ఆదేశాలతో ఈ ఆధార్‌ నమోదు కసరత్తు ప్రారంభించారు. యుద్ధ ప్రాతిపాదికన క్షేత్రస్థాయిలో ప్రత్యేకంగా 8 బృందాలతో ఇంటింటికీ సర్వే నిర్వహిస్తున్నారు. ఆస్తి పన్నుకు ఆధార్‌తో పాటు సెల్‌ఫోన్‌ నెంబర్లు తీసుకుంటున్నారు. దీని ద్వారా బల్దియా అధికారులకు పన్నుకు సంబంధించిన ఏదైనా సమాచారం అవసరం ఉంటే నేరుగా వారికే ఫోన్‌ చేసి తెలుసుకునే వెసులు బాటు ఉంటుంది.

అక్రమాలకు అడ్డుకట్ట..
బల్దియాలో ఆస్తిపన్నును ఆధార్‌ అనుసంధానం చేయడం ద్వారా అక్రమాలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంది. సెల్‌ఫోన్‌ నెంబర్లు సైతం తీసుకుంటుండడంతో ఏదైనా సమాచారాన్ని వెంటనే యజమానికి చేరవేసేలా వీలు కలుగుతుంది. పన్నుల మదింపు సమయంలో వ్యత్యాసాలను గుర్తించేందుకు ఉన్నత స్థాయిలో విచారణ చేపట్టవచ్చు. సదరు యజమానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. ఆధార్‌ అనుసంధానం పూర్తి అయిన తర్వాత ఎవరి పేరు మీద ఎన్ని ఆస్తులు ఉన్నాయి అనేది తెలుస్తుంది. దీని ద్వారా అక్రమంగా సంపాధించిన ఆస్తులు బయట పడే అవకాశం ఉంటుంది.

అనుంధానం కొనసాగుతోంది..
ఆదిలాబాద్‌లో ఆస్తులకు ఆధార్‌ అనుసంధానం ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 9 వేలు పూర్తిచేయడం జరిగింది. ఈ నెలాఖరులో మొత్తం ఆస్తులకు అనుసంధానం చేస్తాం. ప్రత్యేక బృందాలు ఇంటింటి సర్వే చేపడుతున్నారు. ఆధార్‌తోపాటు సెల్‌ఫోన్‌ నెంబర్లు అనుసంధానించాలని మున్సిపల్‌ శాఖ నిర్ణయించింది. ఇది పారదర్శకంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది.  
– మారుతి ప్రసాద్, మున్సిపల్‌ కమిషనర్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top