కొత్త సచివాలయానికి 8 నమూనాలు

8 Samples for the new Secretariat - Sakshi

డిజైన్లను పరిశీలిస్తున్న టెక్నికల్‌ కమిటీ

ఉత్తమమైనవి గుర్తించి మంత్రివర్గ ఉపసంఘానికి నివేదన

సాక్షి, హైదరాబాద్‌: కొత్త సచివాలయ భవనం కోసం అధికారులు ఎనిమిది నమూనాలతో కుస్తీ పడుతున్నారు. తెలంగాణ సంప్రదాయం ఉట్టిపడేలా డిజైన్లు కావాలంటూ రోడ్లు భవనాలశాఖ ఇటీవలే దేశవ్యాప్తంగా పేరున్న 20 మంది ఆర్కిటెక్ట్‌లకు లేఖలు రాయడం తెలిసిందే. వారి నుంచి వచ్చిన నమూనాలను సచివాలయం, అసెంబ్లీ భవన నిర్మాణాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన టెక్నికల్‌ కమిటీ పరిశీలిస్తోంది. గతంలో తమిళనాడుకు చెందిన ఓ ఆర్కిటెక్ట్‌ స్వచ్ఛందంగా పంపిన నమూనా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆకట్టుకుంది. గుమ్మటాలతో ఉన్న ఆ నమూనాకు దగ్గరగా ఉండే డిజైన్‌ను సిద్ధం చేయాలని అప్పట్లోనే ఆయన అధికారులను ఆదేశించారు.

ఆ నమూనాను జతచేస్తూ ఆ తరహాలో నూతన సచివాలయ డిజైన్‌ ఉండాలని అధికారులు అర్కిటెక్ట్‌లకు లేఖలు పంపారు. గతంలో ప్రముఖ ఆర్కిటెక్ట్‌ హఫీజ్‌ కాంట్రాక్టర్‌ సచివాలయానికి సంబంధించి మూడు నమూనాలు పంపారు. అందులో రెండు ప్రస్తుతం సచివాలయం ఉన్న చోటే నిర్మించాలని భావించినప్పుడు వేసినవి కాగా, మరొకటి సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌ పక్కనున్న బైసన్‌ పోలో గ్రౌండ్‌లో నిర్మించాలని యోచించినప్పుడు వేసింది. ఈ మూడు కూడా బాగానే ఉన్నాయని ముఖ్యమంత్రి అప్పట్లో పేర్కొన్నారు. ఇప్పుడు వీటికి కొన్ని మార్పుచేర్పులు సూచిస్తూ ఆయన మరో డిజైన్‌ను సిద్ధం చేస్తున్నారు. ఈ నమూనాల్లో మెరుగ్గా ఉన్న కొన్నింటిని ఎంపిక చేసి టెక్నికల్‌ కమిటీ మంత్రివర్గ ఉపసంఘానికి నివేదించనుంది. వాటిని మంత్రులు పరిశీలించి మళ్లీ మార్పుచేర్పులు అవసరమైతే చేసి ముఖ్యమంత్రికి అందివ్వనున్నారు.

ఆయన చెప్పే సలహాల ఆధారంగా మార్పులు అవసరమనుకుంటే చేసి తుది నమూనా ప్రకారం టెండర్లు పిలవనున్నారు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి సమయం పట్టే అవకాశం ఉంది. మరోవైపు ప్రస్తుత సచివాలయ భవనాల పటుత్వం ఎలా ఉందన్న అంశాన్ని టెక్నికల్‌ కమిటీ ఇటీవలే పరిశీలించింది. ఆ భవనాలు పరిశీలించిన నిట్‌ డైరక్టర్‌ వాటి పటుత్వంపై ‘అంచనా’వేశారు. అగ్నిప్రమాదాల సమయంలో ఆ భవనాలు ప్రమాదకరంగా ఉండే అవకాశం ఉందని ఇప్పటికే అధికారులు పేర్కొనగా తాజా పరిశీలనలో అధికారులు గుర్తించిన వివరాలతో నివేదిక రూపొందించి మంత్రివర్గ ఉపసంఘానికి అందివ్వనున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top