తెలంగాణలో ఒక్క రోజే 75 కేసులు

75 Corona Positive Cases Registered In Telangana - Sakshi

తెలంగాణలో కరోనాతో మరో ఇద్దరు మృతి

మృతుల్లో ఒకరు మహిళ 

మరణానంతరం ఆమెకు పాజిటివ్‌ అని నిర్ధారణ 

229కి చేరిన కేసులు, 11కి చేరిన మరణాలు 

15 మంది డిశ్చార్జి.. 

161 కేసులు ‘మర్కజ్‌’నుంచి  వచ్చిన వారివే..

మరో 600 మందికి పరీక్షలు 

నేడు ఫలితాలు వచ్చే అవకాశం

సాక్షి, హైదరాబాద్‌/రంగారెడ్డి జిల్లా: కరోనా వైరస్‌ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. శుక్రవారం ఏకంగా 75 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇద్దరు మరణించారు. వీరిలో ఒకరు రంగారెడ్డి జిల్లాకు చెందిన మహిళ కాగా, మరొకరు సికింద్రాబాద్‌కు చెందిన వ్యక్తి అని మంత్రి ఈటల రాజేందర్‌ ప్రకటించారు. కాగా, సదరు మహిళ ఈనెల 1వ తేదీన మరణించగా.. ఆమెకు కరోనా పాజిటివ్‌ అనే విషయం శుక్రవారం నిర్ధారణ అయింది. మొత్తమ్మీద రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 229కి చేరగా.. 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒకరిద్దరు మినహా అందరూ మర్కజ్‌కు వొళ్లొచ్చిన వారే కావడం గమనార్హం. కాగా, శుక్రవారం 15 మంది డిశ్చార్జి కాగా, మొత్తం 32 మంది కోలుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. శుక్రవారం 400 మంది మర్కజ్‌కు వెళ్లొచ్చినవారు, వారి బంధువులకు పరీక్షలు నిర్వహించగా, 75 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇంకా 600 మంది మర్కజ్‌కు వెళ్లొచ్చినవారు, వారి బంధువుల నమూనాలను వైద్యాధికారులు కరోనా వైద్య పరీక్షలకు పంపించారు. వారి వివరాలు శనివారం వెల్లడయ్యే అవకాశముంది.

161 కేసులు మర్కజ్‌కు సంబంధించినవే 
రాష్ట్రంలో ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారు 1,030 మంది ఉన్నారని వైద్య ఆరోగ్యశాఖ ఇంతకుముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. వారిలో దాదాపు 900 మందిని ఇప్పటివరకు గుర్తించి తమ అధీనంలోకి తీసుకున్నారు. వారి కుటుంబసభ్యులను, వారితో కాంటాక్ట్‌ అయినవారిని కూడా కొందరిని గుర్తించారు. బుధవారం 300 మందికి పరీక్షలు నిర్వహించగా, 30 మందికి పాజిటివ్‌గా తేలింది. గురువారం దాదాపు 350 మందిని పరీక్షించగా, 27 మందికి పాజిటివ్‌గా నిర్ధారించారు. శుక్రవారం 400 మందిని పరీక్షించగా, ఏకంగా 75 మందికి పాజిటివ్‌గా తేలింది. మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల్లో మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారు, వారి ద్వారా కుటుంబసభ్యులకు, సమీప బంధువులకు ఏకంగా 161 మందికి కరోనా సోకినట్లు వైద్య  ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి.

అన్ని జిల్లాలకూ పాకిన వైరస్‌.. 
దాదాపు అన్ని జిల్లాలకూ కరోనా వైరస్‌ సోకింది. కొన్ని జిల్లాల్లో పాజిటివ్‌ కేసులు నమోదు కాకపోయినా,అక్కడి నుంచి శాంపిళ్లు హైదరాబాద్‌కు చేరుకున్నాయి. ఖమ్మం జిల్లా నుంచి 116 శాంపిళ్లను పంపించగా, 111 మందికి నెగెటివ్‌ వచ్చాయి. ములుగులో నమోదైన రెండు కేసులకు చెందిన వ్యక్తులకు లక్షణాలు లేకపోయినా మర్కజ్‌కు వెళ్లారన్న కారణంతో వారిని పరీక్షించగా ఇద్దరికీ పాజిటివ్‌ రావడం ఆందోళన కలిగిస్తోంది. భూపాలపల్లి జిల్లాకు చెందిన వ్యక్తి మర్కజ్‌కు వెళ్లొచ్చారు. అతనికి లక్షణాలు లేకపోయినా పరీక్షించడంతో పాజిటివ్‌ వచ్చినట్లు నిర్ధారణైంది. మర్కజ్‌కు వెళ్లొచ్చి న వారు వారి కుటుంబసభ్యులకు, స్నేహితులకు అంటించారు. గొలుసుకట్టుగా ఇంకెంతమందికి వైరస్‌ వ్యాపిస్తుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది. వెయ్యి మంది ఒక్కొక్కరు సరాసరి పదిమంది చొప్పున 10 వేల మందిని కలిశారని, వారు ఇంకెందరిని కలిశారన్నదే ఇప్పడు ఆందోళన కలి గించే విషయమని వైద్యాధికారులు అంటున్నారు. 

అత్యధికంగా హైదరాబాద్‌ నుంచే 75 కేసులు 
హైదరాబాద్‌ నగరం ఇప్పుడు కరోనాకు కేంద్రంగా మారింది. నగరంలో ఏకంగా 75 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని స్థానిక వైద్యాధికారులు ప్రకటించారు. వివిధ జిల్లాల అధికారులు ప్రకటించిన వివరాల ప్రకారం వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 20 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వారంతా మర్కజ్‌కు  వెళ్లొచ్చిన వారే. ఆ తర్వాత కరీంనగర్‌ జిల్లాలో 17 కేసులు నమోదు కాగా, వారిలో ఇండోనేషియా నుంచి వచ్చినవారు, వారితో ఉన్నవారితో కలిపి 14 మందికి సోకగా, మరో ముగ్గురు మర్కజ్‌కు వెళ్లొచ్చినవారు కావడం గమనార్హం. రంగారెడ్డి జిల్లాలో 16, నిజామాబాద్‌ జిల్లాలో 18 మందికి పాజిటివ్‌ నమోదైంది. మేడ్చల్‌ జిల్లాలో 15 మందికి పాజిటివ్‌ వచ్చింది. మృతుల్లో అత్యధికంగా హైదరాబాద్‌లో ఏడుగురు ఉన్నారు. రంగారెడ్డి, గద్వాల, నిజామాబాద్, నిర్మల్‌ జిల్లాలకు చెందిన వారు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. కాగా, అత్యధిక కేసులు నమోదవుతున్న జిల్లాల్లో అత్యంత అప్రమత్తత ప్రకటిస్తున్నారు. ఇళ్ల నుంచి ఎవరూ బయటికి రావద్దని, అవసరమైన నిత్యావసరాలు తామే ఇంటికి నేరుగా సరఫరా చేస్తామని, ఎట్టి పరిస్థితుల్లో కాలు బయటపెట్టరాదని ఆయా జిల్లాల కలెక్టర్లు హెచ్చరిస్తున్నారు.

మహిళ మరణంతో కలకలం... 
రంగారెడ్డి జిల్లాలో కరోనా మరణం సంభవించడంతో స్థానికంగా కలకలం రేగింది. నందిగామ మండలం చేగూరు గ్రామానికి చెందిన మహిళ (55) కొన్నిరోజులుగా గొంతునొప్పి, శ్వాసకోస సమస్యతో బాధపడుతూ గత నెల 30న ఆర్‌ఎంపీకి చూపించుకున్నారు. మర్నాడు షాద్‌నగర్‌లో మరో ఆర్‌ఎంపీ వద్ద చికిత్స పొందారు. నయం కాకపోవడంతో 31న మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఎండోస్కోపీ చేయించుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులు ఆమెను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అక్కడి డాక్టర్ల సూచన మేరకు ఈనెల 1న సాయంత్రం 5 గంటల సమయంలో ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. సాయంత్రం 6.48 సమయంలో మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అను మానంతో ఈమె నుంచి గొంతులోని స్వాబ్‌ నమూనాలను సేకరించి పరీక్షలకు పంపగా, శుక్రవారం వచ్చిన ఫలితాల్లో కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఆమె అంత్యక్రియలు గురువారం స్వగ్రామంలో జరిగాయి. ఆమెకు భర్త, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

అంతిమ కార్యక్రమంలో దగ్గరి నుంచి పాల్గొన్న 15 మంది ఇరుగుపొరుగు వారు, బంధువులను అధికారులు గుర్తించారు. వీరిలో 55 ఏళ్లు పైబడిన వారిని గాంధీ ఆస్పత్రికి, మిగతా వారిని రాజేంద్రనగర్‌లోని క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు. మృతురాలు చేగూరులో కిరాణా షాపు నిర్వహిస్తున్నారు. నెల నుంచి అస్వస్థతగా ఉండటంతో అప్పుడప్పుడు షాపు తెరుస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఆమెకు థైరాయిడ్‌తోపాటు బీపీ, షుగర్‌ ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. కాగా, ఇక్కడి కన్హా శాంతివనంలో కూలి పనులు చేస్తున్న బిహార్‌కు చెందిన నలుగురు వ్యక్తులు ఈమె ఇంట్లోనే అద్దెకు ఉంటున్నారు. వీరు కొద్దిరోజుల క్రితం మర్కజ్‌ ప్రార్థనల్లో పాల్గొన్న వారు ప్రయాణించిన రైల్లోనే ఇక్కడికి వచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు.

ఎలా వ్యాప్తి చెందింది...
మహిళకు కరోనా ఎలా సోకిందనే కోణంలో అధికారులు ఆరాతీస్తున్నారు. ఆమె ఇంట్లో అద్దెకున్న వారితోపాటు ఆమె కుమారుడు పొరుగున ఉన్న కన్హా శాంతివనంలో పనిచేస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా శాంతివనంలో అడపాదడపా తప్ప రోజువారీ కార్యక్రమాలు పెద్దగా జరగడం లేదు. దీంతో వీళ్లు అక్కడకు వెళ్లారా?, వీరిలో ఎవరికైనా కరోనా లక్షణాలు ఉన్నాయా? వీరు ఎవరెవరితో స న్నిహితంగా ఉన్నారు? శాంతివనంలో ఎంతమంది ఉన్నా రు? ఎక్కడి నుంచి వచ్చారు? అనే దిశగా దృష్టిపెట్టడంతో పాటు ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లపై అధికారులు ఆరా తీస్తున్నారు. కలెక్టర్‌ అమయ్‌కుమార్, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్, అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ చేగూరు గ్రామాన్ని సందర్శించారు. మృ తురాలి నివాసానికి కిలోమీటర్‌ రేడియస్‌ పరిధిలో సర్వే నిర్వహించాలని రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top