436 మండల పీఠాలపై గులాబీ జెండా

436 TRS Candidates Elected As MPPs In Telangana - Sakshi

ఎంపీపీ ఎన్నికల్లో ఆరు జిల్లాల్లో టీఆర్‌ఎస్‌ క్లీన్‌ స్వీప్‌

53 స్థానాలకే కాంగ్రెస్‌ పరిమితం

12 జిల్లాల్లో ఖాతా తెరవని వైనం

అక్కడక్కడా స్వల్ప ఘర్షణలు

సాక్షి, హైదరాబాద్‌: మండల ప్రజా పరిషత్‌ (ఎంపీపీ) అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. 436 మండల పీఠాలను గెలుచుకుని సత్తా చాటింది. 6 జిల్లాల్లో ఎంపీపీలన్నిం టినీ కైవసం చేసుకుని క్లీన్‌ స్వీప్‌ చేసింది. కాంగ్రెస్‌ పార్టీ 12 జిల్లాల్లో ఖాతాయే తెరవలేదు. రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాల పరిధిలో 538 ఎంపీపీలు ఉండగా.. 537 చోట్ల ఎన్నికలు జరిగాయి. భద్రాద్రి జిల్లాలోని ఒక మండలంలో ఎన్నిక జరగలేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం 537 ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికలు నిర్వహించారు. వీటిలో 436 ఎంపీపీలను టీఆర్‌ఎస్‌ గెలుచుకోగా.. కాంగ్రెస్‌ పార్టీ 53 చోట్ల విజయం సాధించింది. ఇక బీజేపీ కేవలం 8 ఎంపీపీలతో సరిపెట్టు కోగా.. ఇతరులు (స్వతంత్రులు) 7 ఎంపీపీల్లో గెలుపొందారు. సీపీఐ, సీపీఎం ఒక్క ఎంపీపీనీ గెలుచుకోలేకపోయాయి. 33 ఎంపీపీల్లో కోరం లేకపోవడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి.

కొన్నిచోట్ల స్వతంత్రంగా గెలిచిన ఎంపీటీసీలు మద్దతు తెలపడంతో ఆయా ఎంపీపీలు అధికార పార్టీ వశమయ్యా యి. ఈ సందర్భంగా పలువురు ఇండిపెండెంట్లు టీఆర్‌ఎస్‌లో చేరినట్టు సమాచారం. ఉమ్మడి మెదక్, మహబూబ్‌నగర్‌లోని ఒకట్రెండు మండలాలు, ఇతర జిల్లాలోని మరికొన్ని చోట్ల మండల అధ్యక్ష పదవుల కోసం టీఆర్‌ఎస్‌లోని గ్రూపుల మధ్య పోటీ నెలకొనడంతో అక్కడక్కడా ఘర్షణపూర్వక వాతావరణం ఏర్పడింది. కొన్నిచోట్ల ఈ పరిణామాలు స్వల్ప ఉద్రిక్తతలకు దారితీశాయి. తొలుత కోఆప్టెడ్‌ సభ్యుల ఎన్నిక నిర్వహించి, తర్వాత ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల ప్రక్రియను కొనసాగించారు. అధిక మండలాల్లో టీఆర్‌ఎస్‌కి మెజార్టీ ఉండటంతో ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి సమస్యలు ఎదురుకాలేదు. ఎంపీపీ పదవులు చేజిక్కించుకున్న చోట్ల అధికార పార్టీ శ్రేణులు బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకొన్నాయి.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top