సౌదీ నుంచి స్వదేశానికి.. | 39 workers expected to arrive to the state today from Saudi | Sakshi
Sakshi News home page

సౌదీ నుంచి స్వదేశానికి..

Jun 17 2019 3:17 AM | Updated on Jun 17 2019 3:17 AM

39 workers expected to arrive to the state today from Saudi - Sakshi

మోర్తాడ్‌: సౌదీ అరేబియాలోని జేఅండ్‌పీ కంపెనీ క్యాంపులో దాదాపు ఏడాదిన్నర కాలంగా పనిలేక మగ్గిపోయిన తెలంగాణకు చెందిన 39 మంది కార్మికులు సోమవారం స్వదేశానికి రానున్నారు. విదేశాంగ శాఖ చొరవతో హైదరాబాద్‌ చేరుకోనున్నారు. జేఅండ్‌పీ కంపెనీ సౌదీ అరేబియాలో నిర్మాణరంగంలో పనులు నిర్వహిస్తోంది. ఈ పనుల కోసం వివిధ దేశాల నుంచి కార్మికులను రప్పించుకుంది. ఇందులో భాగంగా తెలంగాణకు చెందిన ఎంతో మంది కార్మికులు జేఅండ్‌పీ కంపెనీలో పని చేయడానికి వెళ్లారు. 2018 ఏప్రిల్‌ వరకు కంపెనీ కార్యకలాపాలు బాగానే నడిచాయి. ఆ తర్వాత కంపెనీ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవడంతో కార్మికులకు పని కల్పించలేదు. అంతేకాకుండా నెలల తరబడి వేతనాలు కూడా ఇవ్వలేదు.

కార్మికుల అకామాలను రెన్యూవల్‌ చేయకపోవడంతో వారు బయట తిరగలేక పోయారు. కంపెనీ యాజమాన్యం క్యాంపుల్లో ఉన్న కార్మికులకు భోజన సదుపాయాన్ని కల్పించినా నాసిరకం భోజనాలను అందించిందని కార్మికులు పేర్కొంటున్నారు. కనీసం ఇళ్లకు పంపించడానికి కూడా జేఅండ్‌పీ కంపెనీ యాజమాన్యం చొరవ తీసుకోలేదని ఆరోపించారు. కంపెనీ తీరుతో కార్మికులు విదేశాంగ శాఖ అధికారుల సహకారంతో సౌదీ లేబర్‌ కోర్టులో ఫిర్యాదు చేశారు. కార్మికుల వేతన బకాయిలు చెల్లించడానికి కొంత సమయం ఇచ్చిన లేబర్‌ కోర్టు.. కార్మికులను ఇళ్లకు పంపించడానికి ఎగ్జిట్‌ వీసా ఇవ్వాలని కంపెనీ యాజమాన్యాన్ని ఆదేశించింది. దీంతో విదేశాంగ శాఖ కార్మికులకు టికెట్లు సమకూర్చడంతో సోమవారం 39 మంది కార్మికులు సౌదీ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు రానున్నారు.  

ఒక్కో కార్మికుడికి రూ.వెయ్యి సహాయం 
విదేశాంగ శాఖ చొరవతో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న కార్మికులు ఎయిర్‌పోర్టు నుంచి వారి సొంత గ్రామాలకు చేరుకోవడానికి తెలంగాణ ఎన్‌ఆర్‌ఐ సెల్‌ ఒక్కో కార్మికుడికి రూ.వెయ్యి ఆర్థిక సహాయం అందించనుంది. గతంలో కార్మికులకు రవాణా చార్జీల కోసం రూ. 500 చొప్పున చెల్లించేవారు. ఆ మొత్తాన్ని ప్రస్తుతం రెట్టింపు చేశారు. ఎయిర్‌పోర్టులో కార్మికులు అడుగిడిన వెంటనే వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎన్‌ఆర్‌ఐ సెల్‌ ప్రతినిధులు ఆర్థిక సహాయం అందిస్తారు.

కేరళ తరహాలో పునరావాసం కల్పించాలి
బతుకుదెరువు కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్లి అక్కడ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఇంటి దారి పడుతున్న కార్మికుల సంక్షేమానికి కేరళ తరహాలో తెలంగాణ ప్రభుత్వం పునరావాస చర్యలు తీసుకోవాలి. పునరావాసానికి శాశ్వత ప్రాతిపదికన సంస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. స్వగ్రామాలకు కార్మికులు వచ్చిన తరువాత తగిన ఉపాధి లేకపోవడంతో దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఆర్థికంగా చితికిపోయి.. కుటుంబ పోషణ భారంకావడంతో కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలూ చోటు చేసుకుంటున్నాయి. అలాగే గల్ఫ్‌ దేశాల్లో కార్మికులు సంపాదించుకున్న నైపుణ్యాన్ని రాష్ట్రాభివృద్ధి కోసం వినియోగించుకోవాలి. ఈ దిశగా ప్రభుత్వం చొరవ చూపాలి.
– మంద భీంరెడ్డి, ఇమిగ్రెంట్స్‌ వెల్ఫేర్‌ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement