‘స్పీడ్‌’ పెరిగింది

30Lakhs People Village Tour For Sankranthi Festival - Sakshi

సంక్రాంతికి సిటీజనుల పల్లెబాట  

దాదాపు 30 లక్షల మంది వెళ్లినట్లు అంచనా

బోసిపోయిన ప్రధాన

రహదారులు, ముఖ్య కూడళ్లు

నగరంలో పెరిగిన సగటు వాహన వేగం

18 నుంచి 40 కేఎంపీహెచ్‌కు పెరిగిన స్పీడ్‌

గత నాలుగు రోజులుగా పల్లెబాట పట్టిన వారి సంఖ్య ఇలా..

ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు: సుమారు 10 లక్షలు

రైళ్లలో తరలివెళ్లినవారు: 15 లక్షలమంది

వ్యక్తిగత వాహనాల్లో వెళ్లినవారు: 5 లక్షలమంది

సాక్షి, సిటీబ్యూరో: సంక్రాంతి పండగను పల్లెల్లో జరుపుకొనేందుకు నగరవాసులు సొంతూళ్లకు భారీగానే తరలివెళ్లారు. వీరి సంఖ్య దాదాపు 30 లక్షల వరకు ఉండొచ్చని అంచనా. దీంతో నగరం సగం ఖాళీ అయ్యింది. జనసంచారం గణనీయంగా తగ్గడంతో ముఖ్య రహదారులు, కూడళ్లు బోసిపోయి కనిపించాయి. గత నాలుగు రోజులుగా ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు సహా రైళ్లు, వ్యక్తిగత వాహనాల్లో సుమారు 30 లక్షలమంది పల్లెబాట పట్టినట్లు అంచనా వేస్తున్నారు.

నిత్యం ట్రాఫిక్‌ రద్దీతో కిటకిటలాడే ప్రధాన రహదారులు ఖాళీ అవడంతో ద్విచక్రవాహనాలు, కార్లు సాధారణం కంటే రెట్టింపు వేగంతో దూసుకెళ్లాయి. నగరంలో సాధారణంగా గంటకు 18 కేఎంపీహెచ్‌గా ఉన్న సగటు వాహన వేగం 40 కేఎంపీహెచ్‌కు పెరిగినట్లు సిటీజన్లు ఆసక్తిగా చర్చించుకోవడం విశేషం. తెలంగాణా జిల్లాల్లో పంచాయతీ ఎన్నికల కోలాహలం నెలకొనడంతో నగరంనుంచి లక్షలాదిమంది సొంత గ్రామాలకు తరలివెళ్లారు. ఇక ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ ఊరూవాడా సంక్రాంతి పండగను అంగరంగ వైభవంగా జరుపుకోనున్న నేపథ్యంలో మెజార్టీ సిటీజనులు పల్లెలకు తరలివెళ్లారు. నగరంలో నివసిస్తున్న కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడులోని పలు ప్రాంతాలకు ఆర్టీసీ,ప్రైవేటు బస్సులను నడపడంతో ఆయా ప్రాంతాలకు సైతం వేలాదిమంది తరలివెళ్లడం విశేషం.

ఆర్టీసీ,ప్రైవేటు బస్సుల్లో పది లక్షల మంది జర్నీ.. ...
సంక్రాంతి పండగ సందర్భంగా ఈనెల 10 నుంచి 14వ తేదీ వరకు వివిధ ప్రాంతాలకు సుమారు 6044 బస్సులు నడిపినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.  అదనంగా బస్సులు నడిపేందుకు కృషిచేసిన కార్మికులను ఆర్టీసీ అధికారులు ప్రత్యేకంగా అభినందించారు. ఇక సుమారు మూడువేల ప్రైవేటు బస్సులను కూడా ప్రైవేటు ఆపరేటర్లు నడిపారు. పండగ రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రయాణికుల నుంచి అందినకాడికి దండుకొని వారి జేబులు గుల్ల చేయడం గమనార్హం.

రైళ్లలో 15 లక్షల మంది...
నగరంలోని సికింద్రాబాద్, కాచిగూడా,నాంపల్లి స్టేషన్ల నుంచి పండగ సందర్భంగా నడిపిన సాధారణ,ప్రత్యేక రైళ్లలో గత ఐదు రోజులుగా నిత్యం 3 లక్షలమంది చొప్పున సుమారు 15 లక్షలమంది పల్లెబాట పట్టినట్లు ద.మ. రైల్వే అధికారులు అంచనావేస్తున్నారు. 

వ్యక్తిగత వాహనాల్లో మరో ఐదు లక్షలు..
నగరంలో నివసిస్తున్న వివిధ జిల్లాలకు చెందిన వారు కార్లు, జీపులు, ఇతర వాహనాల్లో సుమారు ఐదు లక్షల మంది సొంతూళ్లకు బయలుదేరివెళ్లారు. ప్రయాణికుల రద్దీ పెరగడంతో పంతంగి, తూప్రాన్, భువనగిరి తదితర ప్రాంతాల్లో ఉన్న టోల్‌గేట్ల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top