గల్లంతైన ఓట్లు 2,05,174

2 05 174 Votes Missing In Adilabad - Sakshi

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఏటా 18 సంవత్సరాలు నిండిన యువ ఓటర్లు పెరుగుతున్న నేపథ్యంలో ఐదేళ్లకోసారి ఆయా నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య పెరగాలి. కానీ ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. 2014 ఏప్రిల్‌లో ఉమ్మడి జిల్లాలో ఉన్న ఓటర్ల కన్నా 2018 సెప్టెంబర్‌ నాటికి ఓటర్ల సంఖ్య ఏకంగా 2.05 లక్షలకు తగ్గింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 19,59,661 మంది ఓటర్లు ఉండగా, 2018 సెప్టెంబర్‌ నాటికి ఈ సంఖ్య 17,54,486 మందికి తగ్గింది. నాలుగేళ్లలో కేవలం మూడు నియోజకవర్గాల్లో మాత్రమే గతంలో కన్నా 12,679 మంది ఓటర్లు పెరిగారు. తద్వారా ఉమ్మడి జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 17,67,165గా తేలింది. ఓటుహక్కుపై అవగాహన పెంచేందుకు ఓవైపు కేంద్ర ఎన్నికల  సంఘం చేస్తున్న ప్రయత్నాలు నాలుగేళ్లలో ఎంతమేర సఫలీకృతమయ్యాయో ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాలోని పరిస్థితిని చూస్తే తేటతెల్లం అవుతోంది.

ఒక్క మంచిర్యాలలోనే 92,337 ఓట్లు గల్లంతు

  • రాష్ట్రంలో బహుశా ఎక్కడా లేని విధంగా మంచిర్యాలలో 2014 ఎన్నికల నుంచి ఇప్పటికి ఏకంగా 92,337 ఓట్లు తగ్గాయి. ఈ నియోజకవర్గంలో 2014 సంవత్సరంలో 2,38,423 ఓటర్లు ఉంటే.. ఇప్పుడు ఆ సంఖ్య ఏకంగా 1,46,086కు తగ్గింది. మంచిర్యాల పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా భారీగా ఓటర్ల పేర్లు గల్లంతయ్యాయని జాబితాను పరిశీలిస్తే అర్థమవుతోంది. 
  • మంచిర్యాల తరువాత అత్యధికంగా ఆదిలాబాద్‌ నియోజకవర్గంలో 49,224 మంది ఓటర్లు తగ్గగా. ఆ తరువాత నిర్మల్‌లో 23,582 ఓట్లు తగ్గాయి. ఈ రెండు నియోజకవర్గాల్లో పట్టణ ఓటర్లను గణనీయంగా ఏరివేసినట్లు స్పష్టమవుతోంది. 
  • ముథోల్‌లో 15,074, సిర్పూర్‌లో 11,430 , ఖానాపూర్‌లో 7,720, బెల్లంపల్లిలో 5,807 ఓట్లు తగ్గడం గమనార్హం. ఆసిఫాబాద్‌లో 10,271 ఓట్లు నాలుగేళ్లలో ఎక్కువయ్యాయి. తరువాత చెన్నూర్‌లో 1897, బోథ్‌లో 511 మాత్రమే గత ఎన్నికల కన్నా పెరిగిన ఓటర్లు.

తొలగింపుల వెనుక ప్రజాప్రతినిధులు
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాలను ఉమ్మడి ఆదిలాబాద్‌లో నాలుగుసార్లు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇష్టానుసారంగా ఓటర్లను ఏరివేయడంతోనే ఓటర్ల సంఖ్య తగ్గిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. గ్రామాలు, పట్టణాల్లో చనిపోయిన ఓటర్లతో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారిని జాబితా నుంచి తొలగించడం జరుగుతుంది. కానీ అనేక నియోజకవర్గాల్లో ఉద్దేశపూర్వకంగానే ఓటర్ల సంఖ్యను తగ్గించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో వార్డు సభ్యులుగా పోటీ చేసినవారు, స్థానిక ప్రజాప్రతినిధులుగా పనిచేసిన వారి ఓట్లు కూడా ఓటర్ల సవరణల్లో గల్లంతైనట్లు సమాచారం.

ఓటర్ల సవరణ కార్యక్రమం నిర్వహించినప్పుడు అభ్యంతరాలు వచ్చిన ఓట్లను తొలగించి, కొత్తగా నమోదు చేసుకోవడం జరుగుతుంది. గ్రామాలతో పాటు పట్టణాల్లో కూడా వార్డు సభ్యులు, సర్పంచులు, కౌన్సిలర్లు ఈ ఓటర్ల జాబితా సవరణను ప్రభావితం చేస్తుండడంతో అర్హులైన వారి పేర్లు కూడా చాలావరకు గల్లంతవుతున్నాయి. వీఆర్‌వో, గ్రామ కార్యదర్శుల నేతృత్వంలో జరిగే ఈ కార్యక్రమాన్ని మండల తహసీల్దార్‌ పర్యవేక్షించాల్సి ఉంటుంది. అయితే గ్రామ సర్పంచి గానీ, ఎంపీటీసీ గానీ ఈ ఓటర్ల జాబితాలపై పెత్తనం చలాయించడం సర్వసాధారణమైంది. గ్రామాల్లో తమకు వ్యతిరేక వర్గంగా భావించే వారి ఓట్లను మూకుమ్మడిగా తొలగించడం వల్లనే ఈ పరిస్థితి ఎదురవుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఇచ్చిన గడువులోగా వచ్చిన అభ్యంతరాల మేరకు ఓటర్లను తొలగించడం, కొత్త ఓటర్లను నమోదు చేయకపోవడంతో ప్రతీ సవరణ సమయంలో ఓటర్ల సంఖ్య తగ్గుతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా గల్లంతైన ఓట్ల వివరాలు మళ్లీ ఎన్నికలు వచ్చేంత వరకు సంబంధిత వ్యక్తులకు తెలియని పరిస్థితి తలెత్తుతోంది.

జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యమే....
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటేసే హక్కు లభిస్తుంది. వీరిని ఓటర్లుగా నమోదు చేసేందుకు ఓటర్ల సవరణలో ప్రత్యేక శ్రద్ధ చూపాలి. అలాగే ఆన్‌లైన్‌లో ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌ ద్వారా 18 ఏళ్లు నిండిన వారు గానీ, ఓటు హక్కు లేని ఎవరైనా ఫారం–6ని పూర్తి చేసి కొత్తగా ఓటర్లుగా నమోదు కావచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే వీఆర్‌వో ద్వారా విచారణ జరిపి, ధ్రువీకరణ పత్రాలను సరిచూసి కొత్త ఓటర్లుగా నమోదు చేస్తారు. ఈ ప్రక్రియ కూడా గ్రామీణ స్థాయిలో సక్రమంగా జరగకపోవడం వల్ల కూడా కొత్త ఓటర్ల సంఖ్య తగ్గిపోతుంది. అదే సమయంలో ఉన్న ఓటర్లు తొలగించబడుతున్నారు. కొత్త జిల్లాలు ఏర్పాటైన తరువాత ఉమ్మడి జిల్లాలో ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి అంతర్గత బదిలీలపై వెళ్లిన వారు కూడా ఫారం–6 ద్వారా మార్పులు చేసుకోవచ్చు. కానీ నాలుగేళ్లలో మూడు నియోజకవర్గాలలో మాత్రమే ఓటర్ల సంఖ్య పెరిగినట్లు తాజా ఓటర్ల జాబితా ద్వారా తెలుస్తోంది.

25 వరకు ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమం
ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఓటర్ల నమోదు కార్యక్రమం చేపట్టింది. ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతైన వారు గానీ, నియోజకవర్గాల నుంచి ఈనెల 25వ తేదీ వరకు తిరిగి ఓటర్లుగా నమోదు అయ్యేందుకు అవకాశం కల్పించారు. 2018 జనవరి 1 వరకు 18 సంవత్సరాలు నిండిన వారంతా ఇందుకు అర్హులే. ఆన్‌లైన్‌ ద్వారా కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top