ఉత్తమ నాటిక ‘ఎవరిని ఎవరు క్షమించాలి?’


విజయనగరం టౌన్‌: విజయనగరంలోని గురజాడ కళాభారతిలో మూడు రోజులపాటు నిర్వహించిన తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలో విజేతల వివరాలను సోమవారం ప్రకటించారు. ఏపీ ప్రభుత్వం, నాటకశాల, అభినయ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు పాల్గొన్నారు. ఉత్తమ ప్రదర్శనగా కెజెఆర్‌ కల్చరల్‌ అసోసియేషన్‌ (సికింద్రాబాద్‌) ఆధ్వర్యంలోని ‘ఎవరిని ఎవరు క్షమించాలి’ నాటిక నిలిచింది. ద్వితీయ ఉత్తమప్రదర్శనగా లిఖిత సాయిశ్రీ క్రియేషన్స్‌ (గోవాడ) ప్రదర్శించిన ’పంపకాలు’, తృతీయ ఉత్తమ ప్రదర్శగా చైతన్య కళాభారతి (కరీంనగర్‌) ప్రదర్శించిన ’ఈ లెక్క ఇంతే’ నిలిచాయి.



ఉత్తమనటుడిగా చైతన్య కళాభారతి(కరీంనగర్‌) ప్రదర్శించిన ’ఈ లెక్క ఇంతే’ లో సత్యం పాత్రధారి మంచాల రమేష్, ఉత్తమ నటిగా జన చైతన్య సంస్థ (ఒంగోలు) ప్రదర్శించిన ’చేతిరాత’ నాటికలో దుర్గ పాత్రధారిణి పద్మావతి, ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ రచనలో దర్శకులు ఉదయ్‌ భాగవతుల (సికింద్రాబాద్‌) ఎంపికయ్యారు. ఉత్తమ సంగీతంగా ఉషోదయా కళానికేతన్‌ కు చెందిన పి.లీలామోహన్‌ (హైదరాబాద్‌), ఉత్తమ ఆహార్యంలో జానా రామయ్య (హైదరాబాద్‌), ఉత్తమ రంగాలంకరణలో పి.శ్రీధర్‌ (గోవాడ), ఉత్తమ సహాయనటిగా ఎస్‌.జ్యోతి (కరీంనగర్‌), ఉత్తమ బాలనటిగా ప్రత్యూష (నెల్లూరు), ఉత్తమ హాస్యనటుడిగా జానా రామయ్య (హైదరాబాద్‌), ఉత్తమ ప్రతినాయకుడిగా ఎ.కిషన్‌రెడ్డి (కరీంనగర్‌), ఉత్తమ క్యారెక్టర్‌ యాక్టర్‌గా గోపరాజు రమణ (కొలకలూరు) ఎంపికయ్యారు.



జ్యూరీ అవార్డులకు ‘పంపకాలు’ నాటికలో ప్రభాకర్‌ పాత్రధారి పి.వరప్రసాద్‌ (గోవాడ), తలుపు చప్పుడు నాటికలో వెంకట్‌ పాత్రధారి డి.సుబ్రహ్మణ్యం (నెల్లూరు), ఆఖరి ఉత్తరం నాటికలో శారద పాత్రధారిణి డి.విజయలక్ష్మి (హైదరాబాద్‌) ఎంపికయ్యారు. న్యాయనిర్ణేతలుగా జొన్నలగడ్డ సీతారామశాస్త్రి, ఎన్‌.రామలింగస్వామి, ఆరిపాక బ్రహ్మానందం వ్యవహరించారు. 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top