breaking news
natika poteelu
-
తెనాలిలో నాటికల పోటీలు; ఉత్తమ ప్రదర్శన ‘వృద్ధోపనిషత్’
సాక్షి, తెనాలి: వైఎస్ రాజశేఖరరెడ్డి నాటక కళాపరిషత్ ప్రథమ జాతీయస్థాయి నాటికల పోటీల్లో గంగోత్రి, పెదకాకాని సమాజం ప్రదర్శించిన వృద్ధోపనిషత్ నాటికకు ఉత్తమ ప్రదర్శన బహుమతి లభించింది. దీంతోపాటు మరో నాలుగు బహుమతుల్ని ఈ నాటిక కైవసం చేసుకోవడం విశేషం. స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రమ్‌లో వైఎస్ రాజశేఖరరెడ్డి నాటక కళాపరిషత్ ప్రథమ జాతీయస్థాయి ఆహ్వాన నాటికల పోటీల్లో విజేతలకు బుధవారం రాత్రి బహుమతుల ప్రదానం జరిగింది. గంగోత్రి, పెదకాకాని సమాజం ప్రదర్శించిన ‘వృద్ధోపనిషత్’ నాటిక ఉత్తమ ప్రదర్శనగా ఎంపికైంది. నటించి, దర్శకత్వం వహించిన ప్రసిద్ధ రంగస్థల/సినీ నటుడు నాయుడు గోపి ఉత్తమ సహాయ నటుడిగా, ఉత్తమ దర్శకుడిగా బహుమతులు అందుకున్నారు. సంగీతం అందించిన శ్రీరమణకూ బహుమతి లభించింది. నటుడు ఎన్.సూర్యకు జ్యూరీ బహుమతి వచ్చింది. ► అరవింద ఆర్ట్స్, తాడేపల్లి వారి ‘స్వర్గానికి వంతెన’ నాటిక కూడా పోటాపోటీగా బహుమతుల్ని కైవసం చేసుకుంది. ఉత్తమ ద్వితీయ ప్రదర్శన బహుమతితోపాటు నటించి, దర్శకత్వం వహించిన గంగోత్రి సాయి ఉత్తమ క్యారెక్టర్ నటుడు బహుమతిని గెలుచుకున్నారు. ఉత్తమ రచన బహుమతిని సుప్రసిద్ధ కథ, నాటక రచయిత వల్లూరు శివప్రసాద్‌కు బహూకరించారు. ఉత్తమ ఆహార్యం బహుమతి థామస్‌కు, జ్యూరీ బహుమతి సత్యనారాయణకు లభించాయి. ► కళాంజలి, హైదరాబాద్ వారి ‘మనిషి మంచోడే’ నాటిక ఉత్తమ తృతీయ ప్రదర్శనగా నిలిచింది. శర్వాణి గ్రామీణ గిరిజన సాంస్కృతిక సేవాసంఘం, శ్రీకాకుళం, బొరివంక వారి ‘ది డెత్ ఆఫ్ మేనీటర్’ నాటికలో టైగర్ రాజు పాత్రధారి బెందాళం శోభన్‌బాబు ఉత్తమ నటుడు బహుమతిని గెలిచారు. ► హర్ష క్రియేషన్స్, విజయవాడ వారి ‘అగ్నిసాక్షి’ నాటికలో ఆమనిగా నటించిన అమృతవర్షిణి ఉత్తమ నటి బహుమతిని అందుకున్నారు. స్నేహ ఆర్ట్స్, వింజనంపాడు వారి ‘కొండంత అండ’ నాటికలో రాంబాబు పాత్రధారి నెమలకింటి వెంకటరమణ ఉత్తమ విలన్ బహుమతిని, ‘మనిషి మంచోడే’ నాటికలో టైగర్ బాలు పాత్రధారి గుంటూరు చలపతి ఉత్తమ హాస్యనటుడు బహుమతిని అందుకున్నారు. ‘ది డెత్ ఆఫ్ మేనీటర్’ నాటికకు ఉత్తమ రంగాలంకరణ బహుమతిని రమణ స్వీకరించారు. న్యాయనిర్ణేతలుగా ఎన్.రవీంద్రారెడ్డి, ఎం.రాంబాబు, ఎ.నర్సిరెడ్డి వ్యవహరించారు. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖలేదా నసీమ్, ఇతర అతిథులు బహుమతుల్ని ప్రదానం చేశారు. (చదవండి: జైహింద్ స్పెషల్: కోటప్పకొండ దొమ్మీ) -
ఉత్తమ నాటిక ‘ఎవరిని ఎవరు క్షమించాలి?’
విజయనగరం టౌన్: విజయనగరంలోని గురజాడ కళాభారతిలో మూడు రోజులపాటు నిర్వహించిన తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలో విజేతల వివరాలను సోమవారం ప్రకటించారు. ఏపీ ప్రభుత్వం, నాటకశాల, అభినయ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు పాల్గొన్నారు. ఉత్తమ ప్రదర్శనగా కెజెఆర్ కల్చరల్ అసోసియేషన్ (సికింద్రాబాద్) ఆధ్వర్యంలోని ‘ఎవరిని ఎవరు క్షమించాలి’ నాటిక నిలిచింది. ద్వితీయ ఉత్తమప్రదర్శనగా లిఖిత సాయిశ్రీ క్రియేషన్స్ (గోవాడ) ప్రదర్శించిన ’పంపకాలు’, తృతీయ ఉత్తమ ప్రదర్శగా చైతన్య కళాభారతి (కరీంనగర్) ప్రదర్శించిన ’ఈ లెక్క ఇంతే’ నిలిచాయి. ఉత్తమనటుడిగా చైతన్య కళాభారతి(కరీంనగర్) ప్రదర్శించిన ’ఈ లెక్క ఇంతే’ లో సత్యం పాత్రధారి మంచాల రమేష్, ఉత్తమ నటిగా జన చైతన్య సంస్థ (ఒంగోలు) ప్రదర్శించిన ’చేతిరాత’ నాటికలో దుర్గ పాత్రధారిణి పద్మావతి, ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ రచనలో దర్శకులు ఉదయ్ భాగవతుల (సికింద్రాబాద్) ఎంపికయ్యారు. ఉత్తమ సంగీతంగా ఉషోదయా కళానికేతన్ కు చెందిన పి.లీలామోహన్ (హైదరాబాద్), ఉత్తమ ఆహార్యంలో జానా రామయ్య (హైదరాబాద్), ఉత్తమ రంగాలంకరణలో పి.శ్రీధర్ (గోవాడ), ఉత్తమ సహాయనటిగా ఎస్.జ్యోతి (కరీంనగర్), ఉత్తమ బాలనటిగా ప్రత్యూష (నెల్లూరు), ఉత్తమ హాస్యనటుడిగా జానా రామయ్య (హైదరాబాద్), ఉత్తమ ప్రతినాయకుడిగా ఎ.కిషన్‌రెడ్డి (కరీంనగర్), ఉత్తమ క్యారెక్టర్ యాక్టర్‌గా గోపరాజు రమణ (కొలకలూరు) ఎంపికయ్యారు. జ్యూరీ అవార్డులకు ‘పంపకాలు’ నాటికలో ప్రభాకర్ పాత్రధారి పి.వరప్రసాద్ (గోవాడ), తలుపు చప్పుడు నాటికలో వెంకట్ పాత్రధారి డి.సుబ్రహ్మణ్యం (నెల్లూరు), ఆఖరి ఉత్తరం నాటికలో శారద పాత్రధారిణి డి.విజయలక్ష్మి (హైదరాబాద్) ఎంపికయ్యారు. న్యాయనిర్ణేతలుగా జొన్నలగడ్డ సీతారామశాస్త్రి, ఎన్.రామలింగస్వామి, ఆరిపాక బ్రహ్మానందం వ్యవహరించారు.