తెనాలిలో నాటికల పోటీలు; ఉత్తమ ప్రదర్శన ‘వృద్ధోపనిషత్‌’ | YS Rajasekhara Reddy Nataka Kala Parishad National Level Drama Competition | Sakshi
Sakshi News home page

తెనాలిలో నాటికల పోటీలు; ఉత్తమ ప్రదర్శన ‘వృద్ధోపనిషత్‌’

Published Fri, Jul 15 2022 6:16 PM | Last Updated on Fri, Jul 15 2022 6:22 PM

YS Rajasekhara Reddy Nataka Kala Parishad National Level Drama Competition - Sakshi

సాక్షి, తెనాలి: వైఎస్‌ రాజశేఖరరెడ్డి నాటక కళాపరిషత్‌ ప్రథమ జాతీయస్థాయి నాటికల పోటీల్లో గంగోత్రి, పెదకాకాని సమాజం ప్రదర్శించిన వృద్ధోపనిషత్‌ నాటికకు ఉత్తమ ప్రదర్శన బహుమతి లభించింది. దీంతోపాటు మరో నాలుగు బహుమతుల్ని ఈ నాటిక కైవసం చేసుకోవడం విశేషం. 

స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రమ్‌లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి నాటక కళాపరిషత్‌ ప్రథమ జాతీయస్థాయి ఆహ్వాన నాటికల పోటీల్లో విజేతలకు బుధవారం రాత్రి బహుమతుల ప్రదానం జరిగింది. గంగోత్రి, పెదకాకాని సమాజం ప్రదర్శించిన ‘వృద్ధోపనిషత్‌’ నాటిక ఉత్తమ ప్రదర్శనగా ఎంపికైంది. నటించి, దర్శకత్వం వహించిన ప్రసిద్ధ రంగస్థల/సినీ నటుడు నాయుడు గోపి ఉత్తమ సహాయ నటుడిగా, ఉత్తమ దర్శకుడిగా బహుమతులు అందుకున్నారు. సంగీతం అందించిన శ్రీరమణకూ బహుమతి లభించింది. నటుడు ఎన్‌.సూర్యకు జ్యూరీ బహుమతి వచ్చింది.  


► అరవింద ఆర్ట్స్, తాడేపల్లి వారి ‘స్వర్గానికి వంతెన’ నాటిక కూడా పోటాపోటీగా బహుమతుల్ని కైవసం చేసుకుంది. ఉత్తమ ద్వితీయ ప్రదర్శన బహుమతితోపాటు నటించి, దర్శకత్వం వహించిన గంగోత్రి సాయి ఉత్తమ క్యారెక్టర్‌ నటుడు బహుమతిని గెలుచుకున్నారు. ఉత్తమ రచన బహుమతిని సుప్రసిద్ధ కథ, నాటక రచయిత వల్లూరు శివప్రసాద్‌కు బహూకరించారు.  ఉత్తమ ఆహార్యం బహుమతి థామస్‌కు, జ్యూరీ బహుమతి సత్యనారాయణకు లభించాయి.  

► కళాంజలి, హైదరాబాద్‌ వారి ‘మనిషి మంచోడే’ నాటిక ఉత్తమ తృతీయ ప్రదర్శనగా నిలిచింది. శర్వాణి గ్రామీణ గిరిజన సాంస్కృతిక సేవాసంఘం, శ్రీకాకుళం, బొరివంక వారి ‘ది డెత్‌ ఆఫ్‌  మేనీటర్‌’ నాటికలో టైగర్‌ రాజు పాత్రధారి బెందాళం శోభన్‌బాబు ఉత్తమ నటుడు బహుమతిని గెలిచారు. 


► హర్ష క్రియేషన్స్, విజయవాడ వారి ‘అగ్నిసాక్షి’ నాటికలో ఆమనిగా నటించిన అమృతవర్షిణి ఉత్తమ నటి బహుమతిని అందుకున్నారు. స్నేహ ఆర్ట్స్, వింజనంపాడు వారి ‘కొండంత అండ’ నాటికలో రాంబాబు పాత్రధారి నెమలకింటి వెంకటరమణ ఉత్తమ విలన్‌ బహుమతిని, ‘మనిషి మంచోడే’ నాటికలో టైగర్‌ బాలు పాత్రధారి గుంటూరు చలపతి ఉత్తమ హాస్యనటుడు బహుమతిని అందుకున్నారు. ‘ది డెత్‌ ఆఫ్‌ మేనీటర్‌’ నాటికకు ఉత్తమ రంగాలంకరణ బహుమతిని రమణ స్వీకరించారు.

న్యాయనిర్ణేతలుగా ఎన్‌.రవీంద్రారెడ్డి, ఎం.రాంబాబు, ఎ.నర్సిరెడ్డి వ్యవహరించారు. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సయ్యద్‌ ఖలేదా నసీమ్, ఇతర అతిథులు బహుమతుల్ని ప్రదానం చేశారు. (చదవండి: జైహింద్‌ స్పెషల్‌: కోటప్పకొండ దొమ్మీ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement