breaking news
drama competition
-
తెనాలిలో నాటికల పోటీలు; ఉత్తమ ప్రదర్శన ‘వృద్ధోపనిషత్’
సాక్షి, తెనాలి: వైఎస్ రాజశేఖరరెడ్డి నాటక కళాపరిషత్ ప్రథమ జాతీయస్థాయి నాటికల పోటీల్లో గంగోత్రి, పెదకాకాని సమాజం ప్రదర్శించిన వృద్ధోపనిషత్ నాటికకు ఉత్తమ ప్రదర్శన బహుమతి లభించింది. దీంతోపాటు మరో నాలుగు బహుమతుల్ని ఈ నాటిక కైవసం చేసుకోవడం విశేషం. స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రమ్‌లో వైఎస్ రాజశేఖరరెడ్డి నాటక కళాపరిషత్ ప్రథమ జాతీయస్థాయి ఆహ్వాన నాటికల పోటీల్లో విజేతలకు బుధవారం రాత్రి బహుమతుల ప్రదానం జరిగింది. గంగోత్రి, పెదకాకాని సమాజం ప్రదర్శించిన ‘వృద్ధోపనిషత్’ నాటిక ఉత్తమ ప్రదర్శనగా ఎంపికైంది. నటించి, దర్శకత్వం వహించిన ప్రసిద్ధ రంగస్థల/సినీ నటుడు నాయుడు గోపి ఉత్తమ సహాయ నటుడిగా, ఉత్తమ దర్శకుడిగా బహుమతులు అందుకున్నారు. సంగీతం అందించిన శ్రీరమణకూ బహుమతి లభించింది. నటుడు ఎన్.సూర్యకు జ్యూరీ బహుమతి వచ్చింది. ► అరవింద ఆర్ట్స్, తాడేపల్లి వారి ‘స్వర్గానికి వంతెన’ నాటిక కూడా పోటాపోటీగా బహుమతుల్ని కైవసం చేసుకుంది. ఉత్తమ ద్వితీయ ప్రదర్శన బహుమతితోపాటు నటించి, దర్శకత్వం వహించిన గంగోత్రి సాయి ఉత్తమ క్యారెక్టర్ నటుడు బహుమతిని గెలుచుకున్నారు. ఉత్తమ రచన బహుమతిని సుప్రసిద్ధ కథ, నాటక రచయిత వల్లూరు శివప్రసాద్‌కు బహూకరించారు. ఉత్తమ ఆహార్యం బహుమతి థామస్‌కు, జ్యూరీ బహుమతి సత్యనారాయణకు లభించాయి. ► కళాంజలి, హైదరాబాద్ వారి ‘మనిషి మంచోడే’ నాటిక ఉత్తమ తృతీయ ప్రదర్శనగా నిలిచింది. శర్వాణి గ్రామీణ గిరిజన సాంస్కృతిక సేవాసంఘం, శ్రీకాకుళం, బొరివంక వారి ‘ది డెత్ ఆఫ్ మేనీటర్’ నాటికలో టైగర్ రాజు పాత్రధారి బెందాళం శోభన్‌బాబు ఉత్తమ నటుడు బహుమతిని గెలిచారు. ► హర్ష క్రియేషన్స్, విజయవాడ వారి ‘అగ్నిసాక్షి’ నాటికలో ఆమనిగా నటించిన అమృతవర్షిణి ఉత్తమ నటి బహుమతిని అందుకున్నారు. స్నేహ ఆర్ట్స్, వింజనంపాడు వారి ‘కొండంత అండ’ నాటికలో రాంబాబు పాత్రధారి నెమలకింటి వెంకటరమణ ఉత్తమ విలన్ బహుమతిని, ‘మనిషి మంచోడే’ నాటికలో టైగర్ బాలు పాత్రధారి గుంటూరు చలపతి ఉత్తమ హాస్యనటుడు బహుమతిని అందుకున్నారు. ‘ది డెత్ ఆఫ్ మేనీటర్’ నాటికకు ఉత్తమ రంగాలంకరణ బహుమతిని రమణ స్వీకరించారు. న్యాయనిర్ణేతలుగా ఎన్.రవీంద్రారెడ్డి, ఎం.రాంబాబు, ఎ.నర్సిరెడ్డి వ్యవహరించారు. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖలేదా నసీమ్, ఇతర అతిథులు బహుమతుల్ని ప్రదానం చేశారు. (చదవండి: జైహింద్ స్పెషల్: కోటప్పకొండ దొమ్మీ) -
రాయల వైభవాన్ని తలపించిన నాటిక పోటీలు
– డిప్యుటీ సీఎం కె.ఇ.కృష్ణమూర్తి కర్నూలు(కల్చరల్): తానా అసోసియేషన్ నాటిక పోటీలు అలనాటి రాయల వైభవాన్ని తలపించాయని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి అన్నారు. స్థానిక టీజీవీ కళాక్షేత్రంలో శనివారం సాయంత్రం జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తానా సంస్థ అమెరికాలో తెలుగు భాషా సంస్కృతిని పరిరక్షిస్తూనే ఆంధ్ర దేశంలోని పలు ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. కర్నూలు జిల్లాలోనూ తానా పలు చోట్ల పేదల కాలనీలు నిర్మించేందుకు సహకరించిందన్నారు. రాయలసీమలో తొలిసారిగా నాటక పోటీలను నిర్వహించి తానా సంస్థ స్థానిక కళాకారులకు చక్కని ప్రోత్సాహాన్ని అందించిందన్నారు. కళాకారుల కోసం కమ్యూనిటీ హాల్ నిర్మించేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం మూడు రోజులుగా సాగిన తానా నాటిక పోటీల్లో విజేతలైన కళాకారులకు తానా అధ్యక్షులు జంపాల చౌదరి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్, తానా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధి కోమటి జయరాం, నియమిత అధ్యక్షులు సతీష్ వేమన, ప్రముఖ రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణ, ప్రముఖ పారిశ్రామికవేత్త టి.జి.భరత్, తానా సహాయ కార్యదర్శి రవి పొట్లూరి, ప్రోగ్రామ్ కన్వీనర్ ముప్పా రాజశేఖర్, న్యాయ నిర్ణేతలు గురుస్వామి, వన్నెం బలరామ్, సుభాన్ సింగ్, లలిత కళాసమితి అధ్యక్షుడు పత్తి ఓబులయ్య, కార్యదర్శి మహమ్మద్ మియ, సహాయ కార్యదర్శి ఇనాయతుల్లా తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ నాటకంగా 'అనగనగా'.. స్థానిక టీజీవీ కళాక్షేత్రంలో మూడు రోజులుగా సాగిన నాటక పోటీలలో యంగ్ ఆర్ట్ థియేటర్స్ విజయవాడ వారు ప్రదర్శించిన అనగనగా.. నాటిక ఉత్తమ నాటికగా ఎంపికయ్యింది. ద్వితీయ ఉత్తమ నాటికగా అభినయ ఆర్ట్స్ గుంటూరు వారు ప్రదర్శించిన రెండు నిశ్శబ్దాల మధ్య, ఉత్తమ తృతీయ నాటికగా సాయి ఆర్ట్స్ కొలకలూరు వారు ప్రదర్శించిన ఒక్క మాటే చాలు ఎంపికయ్యాయి.