
సాక్షి, భోగాపురం: ‘ఎమ్మెల్యే గారూ.. మీ ఇంటి పన్ను బకాయి రూ.24 లక్షలు ఉంది. అది కడితే పంచాయతీలో అభివృద్ధి పనులు చేసేందుకు ఆస్కారం ఉంటుంది. తక్షణమే ఇంటి పన్ను చెల్లించి అభివృద్ధి పనులకు సహకరించండి’ అని విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముంజేరు సర్పంచ్ పూడి నూకరాజు నెల్లిమర్ల జనసేన ఎమ్మెల్యే లోకం నాగమాధవిని కోరారు.
భోగాపురం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఉప్పాడ అనూషారెడ్డి అధ్యక్షతన ఆదివారం మండల సర్వసభ్య సమావేశం జరిగింది. సర్పంచ్ నూకరాజు మాట్లాడుతూ.. మీరు బకాయి ఉన్న ఇంటిపన్ను రూ.24 లక్షలు కడితే అభివృద్ధి పనులకు తీర్మానం చేసి ఇస్తామని చెప్పడంతో కంగుతిన్న ఎమ్మెల్యే మాధవి.. సర్పంచ్ నూకరాజుపై రుసరుసలాడారు. మీరు ఉన్నంత వరకు అభివృద్ధి జరగదంటూ సర్పంచ్‌పై అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలంటూ సమావేశం నుంచి నిష్క్రమించారు. దీంతో, ఆమె తీరుపై ప్రజలకు మండిపడుతున్నారు. బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.