breaking news
Lokam Naga Madhavi
-
జనసేన ఎమ్మెల్యే ఇంటిపన్ను బకాయి 24 లక్షలు.. కట్టమని అడిగితే..
సాక్షి, భోగాపురం: ‘ఎమ్మెల్యే గారూ.. మీ ఇంటి పన్ను బకాయి రూ.24 లక్షలు ఉంది. అది కడితే పంచాయతీలో అభివృద్ధి పనులు చేసేందుకు ఆస్కారం ఉంటుంది. తక్షణమే ఇంటి పన్ను చెల్లించి అభివృద్ధి పనులకు సహకరించండి’ అని విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముంజేరు సర్పంచ్ పూడి నూకరాజు నెల్లిమర్ల జనసేన ఎమ్మెల్యే లోకం నాగమాధవిని కోరారు.భోగాపురం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఉప్పాడ అనూషారెడ్డి అధ్యక్షతన ఆదివారం మండల సర్వసభ్య సమావేశం జరిగింది. సర్పంచ్ నూకరాజు మాట్లాడుతూ.. మీరు బకాయి ఉన్న ఇంటిపన్ను రూ.24 లక్షలు కడితే అభివృద్ధి పనులకు తీర్మానం చేసి ఇస్తామని చెప్పడంతో కంగుతిన్న ఎమ్మెల్యే మాధవి.. సర్పంచ్ నూకరాజుపై రుసరుసలాడారు. మీరు ఉన్నంత వరకు అభివృద్ధి జరగదంటూ సర్పంచ్‌పై అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలంటూ సమావేశం నుంచి నిష్క్రమించారు. దీంతో, ఆమె తీరుపై ప్రజలకు మండిపడుతున్నారు. బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. -
పబ్లిక్‌గా.. లోకం మాధవి పరువు తీసిన టీడీపీ
విజయనగరం, సాక్షి: కూటమి భాగస్వామ్య పార్టీలు టీడీపీ-జనసేన నేతల మధ్య విభేదాలు కొత్తకాదు. కానీ, ప్రభుత్వం ఏర్పాటయ్యాక కూడా అవి అంతే స్థాయిలో కొనసాగుతూ వస్తుండడం గమనార్హం. ఈ తగవులు ఇరు పార్టీల అధినేతల దృష్టిలోకి తరచూ వెళ్తున్నాయి. అయితే ఈ విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎక్కువగా కాంప్రమైజ్ అవుతూ వస్తుండడం గమనిస్తున్నదే. తాజాగా..మరోమారు ఆయా పార్టీల నేతల మధ్య విభేదాలు బహిర్గతం అయ్యాయి. నెల్లిమర్ల జనసేన ఎమ్మెల్యే లోకం నాగ మాధవి, ఏపీ మార్క్‌ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు మధ్య జరిగిన వివాదం రచ్చకెక్కింది. అది ఎక్కడదాకా వెళ్లింది అంటే.. బహిరంగంగా సమావేశం నిర్వహించి మరీ మాధవి పరువును తీసిపారేశారు టీడీపీ నేతలు.‘‘ముంజేరు ఆడపడుచు అంటూ ఆమె గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. ఆమె నియోజకవర్గానికి ఏదో మంచి చేయాలని రాలేదు. కేవలం తన 30 ఎకరాల భూమిని రక్షించుకునేందుకే రాజకీయాల్లోకి వచ్చారు..’’ అంటూ ఓ టీడీపీ నేత ఒకరు వేదిక మీద మాట్లాడారు.తాము వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కూడా ఇంత ఇబ్బంది పడలేదని మరో టీడీపీ నేత వ్యాఖ్యానించగా.. మాధవి ఎలాగైనా టీడీపీని లేకుండా చేయాలని ప్రయత్నిస్తోందని, టీడీపీ వాళ్లను కూలీల్లాగా తీసి పారేస్తోందని ఆవేశంగా ఓ మహిళా నేత మాట్లాడారు. ఇలా.. టీడీపీ నేతలంతా ఆమెపై ఆరోపణలు, విమర్శలు, తీవ్ర వ్యాఖ్యలు చేశారు.బంగార్రాజు రివెంజా?బుధవారం నెల్లిమర్ల నగర పంచాయతీ సమావేశం వేదికగా మాధవి-బంగార్రాజు మధ్య విభేదాలు బయటపడ్డాయి. సమావేశంలో మాధవి మాట్లాడుతుండగా.. బంగార్రాజు అడ్డుకుని ఏదో ప్రశ్న వేశారు. దానికి ఆమె కాసేపు ఆగాలంటూ ఆయనకు సూచించారు. దీంతో మొదలైన గొడవ తీవ్ర రూపం దాల్చింది. దీంతో సమావేశం మధ్యలోనే ఎమ్మెల్యే బయటకు వెళ్లిపోయారు. ఆపై ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని బంగార్రాజు మీడియాకు చెప్పారు. ఈలోపే.. నలుగురిలో తనకు జరిగిన అవమానానికి తన అనుచరగణంతో పబ్లిక్‌గా మీటింగ్ పెట్టించి మరీ ఇలా రివెంజ్ తీర్చుకుని ఉంటారనే చర్చ నడుస్తోందక్కడ.