ఛూ మంత్రకాళీ!

Vamsadhara River Affected Places Safety Measures TDP Froud - Sakshi

టీడీపీ నాయకులు చెప్పే మాటలకు, ఆచరణలో చేతలకు పూర్తి వైరుధ్యం ఉంటోందనేది బహిరంగ రహస్యమే! తాము ప్రకృతి వనరులను పవిత్రంగా చూసుకుంటామని, ప్రజాధనానికి పరిరక్షకులమని తరచుగా వారి ప్రసంగాలు వినిపిస్తుంటాయి. కానీ వంశధార కరకట్టల టెండర్ల మాటున రూ. 21.83 కోట్ల ప్రజాధనానికి ఎందుకు రెక్కలొచ్చాయో మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలకే ఎరుక! ఇప్పటికే పనులు చేస్తున్న నిర్మాణ సంస్థలను పొమ్మనలేక పొగబెట్టి, తర్వాత తమకు కావాల్సిన సంస్థలు అంచనా వ్యయం కన్నా అధికంగా కోట్‌ చేసినా పనులు కట్టబెట్టారు! సుమారు రూ.22 కోట్లు ప్రజాధనం పక్కదారి పడుతుంటే ఇప్పుడేమి చెబుతారో చూడాలి మరి! 

సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం : వర్షాకాలం వస్తే చాలు వంశధార నదిలో వరద పోటెత్తుతుంది. నదిలో ప్రవాహం అరలక్ష క్యూసెక్కుల దాటితే చాలు జిల్లాలోని పరివాహక ప్రాంతాల్లోని ప్రజల గుండెల్లో రైళ్లు పరుగెడుతుంటాయి! గట్టు బలహీనంగా ఉన్నచోట్ల వరద పంటపొలాలు, గ్రామాలను ముంచెత్తుతూనే ఉంటుంది. ఈ దృష్ట్యానే దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే జిల్లాలో వంశధారతో పాటు నాగావళి నదుల నదుల గట్లు కట్టుదిట్టం చేయాలని సంకల్పించారు. కరకట్టల నిర్మాణ పనులను ప్రారంభించారు. తర్వాత ఆయన అకాల మరణం, ప్రభుత్వాల అలసత్వం కారణంగా ఆ పనులు మందగమనంలోకి వెళ్లిపోయాయి. వాటిని పూర్తి చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన టీడీపీ మూడున్నరేళ్ల పాటు ఏమాత్రం పట్టించుకోలేదు. తమకు నష్టం వస్తున్న దృష్ట్యా కొంతమేర అంచనా వ్యయం సవరించాలని నిర్మాణ సంస్థలు మొత్తుకున్నా స్పందించలేదు.

చివరకు పనుల ఆలస్యం సాకుతో ఆ సంస్థలకు పనులను టీడీపీ ప్రభుత్వం రద్దుచేసింది. తర్వాత అంచనా వ్యయం సవరించి కొత్తగా టెండర్లు పిలిచింది. కానీ అంచనా వ్యయానికి మించి అదనంగా కోట్‌ చేసినా తమకు నచ్చిన మూడు సంస్థలకు మూడు ప్యాకేజీలు ఒక్కొక్కటి చొప్పున దక్కేలా టీడీపీ ప్రభుత్వంలో ఇద్దరు మంత్రులు చక్రం తిప్పారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. రాజధాని కేంద్రంగా చక్రం తిప్పిన ఈ వ్యవహారంలో వంశధార ప్రాజెక్టు ఉన్నతాధికారి ఒకరు, జలవనరుల శాఖ, సర్కిల్‌ కార్యాలయంలో అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ఓ అధికారి కీలక పాత్ర పోషించారనే గుసగుసలు ఆ శాఖ సిబ్బంది నుంచే వినిపిస్తున్నాయి. దీనిపై లోతుగా విచారణ జరిపిస్తే రూ.22 కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైన వ్యవహారంలో కీలక పాత్రధారులు, సూత్రధారుల గుట్టు రట్టవుతుందని చెబుతున్నారు. 

మూడు ప్యాకేజీలకూ ఆ కంపెనీలే...
వంశధార నది కరకట్టల నిర్మాణ పనులను మొత్తం నాలుగు ప్యాకేజీలుగా జరుగుతున్నాయి. తొలి మూడు ప్యాకేజీలకు అంచనా వ్యయం సవరించి గత ఏడాది నవంబరులో టెండరు నోటిఫికేషన్లను ప్రభుత్వం జారీ చేసింది. శ్రీసాయిలక్ష్మి కన్‌స్ట్రక్షన్స్‌ అండ్‌ కంపెనీ (విజయవాడ), ఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (అనంతపురం), కేతన్‌ కన్‌స్ట్రక్షన్స్, జీవీవీ కన్‌స్ట్రక్షన్స్, ఆర్‌ఎస్‌ఆర్‌ ఇన్‌ఫ్రా వర్క్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ (రాజమండ్రి)... ఈ ఐదు సంస్థలే మూడు ప్యాకేజీలకు పోటీపడ్డాయి. వాటిలో మూడు సంస్థలు ఒక్కో ప్యాకేజీ చొప్పున దక్కించుకున్నాయి. మొత్తం ఈ మూడు ప్యాకేజీల పనులకు రూ. 595.25 కోట్లు అంచనా వ్యయంకాగా, రూ.21.83 కోట్లు అదనంగా పెంచేయడం వల్ల నిర్మాణ వ్యయం రూ. 617.08 కోట్లకు చేరినట్లయ్యింది.  ప్యాకేజీ–1లో భామిని మండలంలో బత్తిలి గ్రామం నుంచి కీసర గ్రామం వరకూ, అలాగే కొత్తూరు మండలంలో సిరుసువాడ నుంచి ఆకులతంపర గ్రామం వరకూ నది కుడివైపు గట్టు, కొత్తూరు మండలం కడుము గ్రామం నుంచి పొన్నుటూరు గ్రామం వరకూ ఎడమవైపు గట్టు కరకట్టల పనుల కోసం రూ. 238.66 కోట్లతో టెండర్లు పిలిచారు.

గత ఫిబ్రవరి నెలలో తెరిచిన టెక్నికల్‌ బిడ్‌లో శ్రీసాయిలక్ష్మి కన్‌స్ట్రక్షన్స్‌ అండ్‌ కంపెనీ (విజయవాడ), ఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (అనంతపురం), కేతన్‌ కన్‌స్ట్రక్షన్స్, జీవీవీ కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థలు అర్హత సాధించాయి. ఇవన్నీ అంచనా వ్యయం కన్నా అధికంగా కోట్‌ చేసినవే. నిర్దేశించిన మొత్తం కన్నా 4.47 శాతం అదనంగా రూ. 249.32 కోట్లతో ప్రైస్‌ బిడ్‌ దాఖలు చేసిన శ్రీసాయిలక్ష్మి కన్‌స్ట్రక్షన్స్‌ అండ్‌ కంపెనీ టెండర్లను దక్కించుకుంది. మరో విశేషం ఏమిటంటే ఈ పోటీలో ఎల్‌–2గా నిలిచిన ఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ 4.99 శాతం అదనంగా రూ. 250.56 కోట్లకు కోట్‌ చేసింది. దీనికి ప్యాకేజీ–1 పనులు దక్కకపోయినా ప్యాకేజీ–2 పనులు దక్కించుకోవడం గమనార్హం. 

ప్యాకేజీ–2లో హిరమండలం మండలంలోని రుగడ గ్రామం నుంచి జలుమూరు మండలంలోని కరకవలస గ్రామం వరకూ ఎడమవైపు గట్టు, హిరమండలం మండలంలోని గులుమూరు నుంచి ఎల్‌ఎన్‌ పేట మండలంలోని స్కాట్‌పేట వరకూ కుడివైపు గట్టు కరకట్టల నిర్మాణానికి రూ.143.02 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు ఆహ్వానించారు. టెక్నికల్‌ బిడ్‌లో శ్రీసాయిలక్ష్మి కన్‌స్ట్రక్షన్స్, ఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్, కేతన్‌ కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థలు అర్హత సాధించాయి. వాటిలో ప్రైస్‌బిడ్‌లో అంచనా వ్యయం కన్నా 4.2 శాతం అదనంగా రూ.149.02 కోట్లకు అంటే రూ.6 కోట్లు ఎక్కువగా కోట్‌ చేసిన ఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థకు పనులు దక్కాయి. 

 ప్యాకేజీ–3 కింద ఎల్‌ఎన్‌ పేట మండలంలోని స్కాట్‌పేట గ్రామం నుంచి ఆమదాలవలస మండలంలోని చవ్వాకులపేట గ్రామం వరకూ, అలాగే శ్రీకాకుళం మండలంలోని నవనంబాడు గ్రామం నుంచి గార మండలంలోని కళింగపట్నం వరకూ కరకట్టల నిర్మాణానికి రూ. 213.57 కోట్ల అంచనా వ్యయంతో రెండోసారి టెండర్లు పిలిచారు. టెక్నికల్‌ బిడ్‌లో శ్రీసాయిలక్ష్మి కన్‌స్ట్రక్షన్స్, ఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్, కేతన్‌ కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థలతో పాటు ఆర్‌ఎస్‌ఆర్‌ ఇన్‌ఫ్రా వర్క్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ (రాజమండ్రి) కూడా అర్హత పొందింది. అంచనా విలువ కన్నా 2.7 శాతం అదనంగా రూ. 218.74 కోట్లకు ప్రైస్‌బిడ్‌లో కోట్‌ చేసిన ఆర్‌ఎస్‌ఆర్‌ సంస్థకే పనులు దక్కాయి. ఈ పోటీలో 3.25 శాతం అదనంగా రూ. 219.89 కోట్లకు కోట్‌ చేసిన ఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ ఎల్‌–2గా నిలిచింది. శ్రీసాయిలక్ష్మి కన్‌స్ట్రక్షన్స్‌ అండ్‌ కంపెనీ 4.89 శాతం అదనంగా రూ. 223.41 కోట్లకు కోట్‌ చేసి ఎల్‌–3గా మిగిలింది.   

ఈ సీజన్‌లో పునఃప్రారంభమయ్యేనా?
వంశధార నది కరకట్టల నిర్మాణ పనులు ప్యాకేజీ–1లో 9.42 శాతం, ప్యాకేజీ–2లో 3.76 శాతం, ప్యాకేజీ–3లో 2.45 శాతం మాత్రమే ఇప్పటివరకూ పూర్తయ్యాయి. ప్యాకేజీ–1లో పనుల కోసం 460.48 ఎకరాల భూమి సేకరించగా, ఇంకా 82.40 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ప్యాకేజీ–2లో 32.12 ఎకరాలు మాత్రమే సేకరించగా ఇంకా 196.88 ఎకరాలు సేకరించాలి. ప్యాకేజీ–3లో 222 ఎకరాలు సేకరించగా, ఇంకా 131 ఎకరాలు సేకరించాల్సి ఉంది. మిగిలిన భూసేకరణ ప్రక్రియ ఇటీవల కాలంలో రెవెన్యూ, వంశధార ప్రాజెక్టు అధికారులు వేగవంతం చేశారు. కానీ తమకు తగిన నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండు చేస్తున్నారు. దీంతో భూసేకరణ ఇంకా కొలిక్కిరాలేదు. వచ్చే నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా కరకట్టల నిర్మాణ పనులు పునఃప్రారంభ కార్యక్రమం నిర్వహిస్తామని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఇటీవల జరిగిన జిల్లా నీటిపారుదల సలహా సంఘం సమావేశంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏదేమైనా ఈ సీజన్‌ (వర్షాలు మొదలయ్యేలోగా)లో కరకట్టల నిర్మాణ పనులు పునఃప్రారంభమయ్యే సూచనలు కనిపించట్లేదు. 

ప్యాకేజీ–1పై న్యాయవివాదం 
వంశధార ప్యాకేజీ–1 పనులను కొంతవరకూ రాంకీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ (హైదరాబాద్‌) చేసింది. పనులకు సంబంధించి గడువు ముగిసినప్పటికీ లావాదేవీలు పూర్తి చేయకుండానే ప్రభుత్వం రెండోసారి టెండర్లు పిలవడాన్ని సవాలు చేస్తూ ఆ సంస్థ మార్చి నెలలో హైకోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం ఈ న్యాయ వివాదం కొనసాగుతోంది. ఇది తేలేవరకూ మూడు ప్యాకేజీల పనులూ కొత్త కాంట్రాక్టర్లు చేయడానికి అవకాశం కనిపించట్లేదు. కానీ అధికారులు మాత్రం ఆ న్యాయ వివాదం వల్ల పనులకు ఆటంకం ఉండదని చెబుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top