వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి
ఉదయగిరి: రాష్ట్రంలో కూటమి పాలన అరాచకాలు వింజమూరు ఎంపీపీ ఎన్నిక ఘటనతో పరాకాష్టకు చేరాయని వైఎస్సార్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ‘‘గతంలో వైఎస్సార్‌సీపీ తరఫున వింజమూరు ఎంపీపీగా ఉన్న వ్యక్తిపై అవిశ్వాసాన్ని ప్రకటించి టీడీపీ నేతలు బలవంతంగా పదవి నుంచి దించారు. ఈ నేపథ్యంలో ఎంపీపీ ఎన్నికకు అధికారులు సోమవారం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. టీడీపీకి తగినంత బలం లేకపోవడంతో కుట్రలకు తెరలేపింది. వైఎస్సార్‌సీపీకి చెందిన ఎంపీటీసీ మోహన్‌రెడ్డిని పోలీసులతో బలవంతంగా కిడ్నాప్ చేయించి నిర్బంధించి, కుటుంబ సభ్యులను బెదిరించి ఆ«దీనంలో ఉంచుకున్నారు.
ప్రత్యేక సమావేశానికి వస్తున్న ఊటుకూరు ఎంపీటీసీ మల్లికార్జునను పోలీసుల సమక్షంలో టీడీపీ గూండాలు కిడ్నాప్ చేశారు. మరో మహిళా ఎంపీటీసీ ఉంటా రత్నమ్మను కిడ్నాప్ చేసేందుకు యత్నించగా మా పార్టీ శ్రేణులు అడ్డుకున్నారు. ఈ ఘటనలో ఆమెకు గాయాలయ్యాయి. టీడీపీ సభ్యులకు తగిన కోరం లేనందున తటస్థంగా ఉన్న ఎంపీటీసీనీ పోలీసుల ద్వారా బలవంతంగా స్టేషన్‌కు తరలించి అక్కడి నుంచి ఎమ్మెల్యే కార్యాలయానికి తీసుకెళ్లి అప్పగించారు. ఎమ్మెల్యే బలవంతంగా ఆ వ్యక్తిని సమావేశం దగ్గరకు తీసుకొచ్చి ఎన్నిక వాయిదా పడేందుకు రెండు నిమిషాల ముందు దొడ్డిదారిన లోపలికి పంపారు. అక్కడే తిష్ట వేసిన ఎమ్మెల్యే తమ ఎంపీటీసీలను పోలీసులు, అధికారుల ద్వారా బలవంతంగా బయటకు పంపి ఏకగ్రీవంగా ఎన్నిక పూర్తిచేశారు.
ఓటమి భయంతో టీడీపీ బరితెగించి, మా పార్టీ ఎంపీటీసీలను బలవంతం చేస్తూ దౌర్జన్యాలు, దాడులకు తెగబడి ప్రజాస్వామ్య విలువలను కాలరాసింది. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకే ఈ ప్రభుత్వంలో రక్షణ లేకుండా పోయింది. ఇక సామాన్యుల పరిస్థితులు ఎలా ఉంటాయో వేరే చెప్పనవసరం లేదు. ఇప్పటికే చంద్రబాబు, లోకేశ్ విధానాలను, కూటమి పాలనను ప్రజలు ఈసడించుకుంటున్నారు.’’ అని కాకాణి విమర్శించారు. టీడీపీ ఎన్ని కుట్రలు పన్నినా, దౌర్జన్యాలు, అరాచకాలను లెక్క చేయకుండా ఎదురొడ్డి నిలబడిన ఎంపీటీసీలు, వైఎస్సార్‌సీపీ శ్రేణులకు కాకాణి ధన్యవాదాలు తెలిపారు. వింజమూరులో పోలీసులు, టీడీపీ శ్రేణులు, టీడీపీ ఎమ్మెల్యే గూండాల్లాగా వ్యవహరించిన తీరును వైఎస్సార్‌సీపీ తీవ్రంగా ఖండిస్తోందని పేర్కొన్నారు.


