శివసేన కార్యకర్తలపై జరిగిన లాఠీచార్జి కాంగ్రెస్ పార్టీ పనేనని ఆ పార్టీ అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే ఆరోపించారు.
సాక్షి, ముంబై: శివసేన కార్యకర్తలపై జరిగిన లాఠీచార్జి కాంగ్రెస్ పార్టీ పనేనని ఆ పార్టీ అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే ఆరోపించారు. సింధుదుర్గా జిల్లా కనకవ్లీలో పోలీసుల లాఠీ చార్జీలో గాయపడ్డ శివసైనికులను ఆయన మంగళవారం కలిసి పరామర్శిం చారు. ఈ సందర్భంగా కనకవ్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. డబ్బులు (సుపారి) తీసుకుని శివసేన కార్యకర్తలపై కొందరు పోలీసులు కావాలనే లాఠీ చార్జీ చేశారని అన్నారు. అధికారం ఉంది కదా అని విర్రవీగుతున్న కాంగ్రెస్ పార్టీకి భజన చేస్తున్న పోలీసుల జాబితా రూపొందిస్తామని తెలిపారు. తాము అధికారంలోకి రాగానే చర్యలు తీసుకుంటామన్నారు. అయితే శివసేన కార్యకర్తలపై లాఠీ చార్జీకి ఆదేశాలు జారీచేసిన పోలీసు సూపరింటెండెంట్‌ను వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.
కాగా, సింధుదుర్గా జిల్లా కనకవ్లీలో నారాయణ రాణే అవినీతిని బట్టబయలు చేస్తామంటూ శివసేన కార్యకర్తలు ఆదివారం ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జరిగిన వాగ్వాదం అనంతరం పోలీసులు శివసేన కార్యకర్తలపై లాఠీ చార్జీ చేశారు.
ఒకే కుటుంబం అభివృద్ధి చెందింది....
నారాయణ రాణే పేరు తీయకుండానే ఆయనపై తనదైన శైలిలో ఉద్ధవ్ విమర్శలు గుప్పించారు. కొంకణ్‌లో అభివృద్ది జరిగిందని చెప్పుకుంటున్నారు. కానీ ఒకే కుటుంబం అభివృద్ధి చెందిందని నారాయణ రాణే పేరు తీయకుండానే ఆయనకు చురకలంటించారు.
‘ఆ మాటలు సరికావు’
రాష్ట్రంలో శివసేన అధికారంలోకి రావడం అసంభవమని ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే జోస్యం చెప్పారు. కొంకణ్‌లోని కనకవ్లీ పర్యటనకు వెళ్లిన ఉద్ధవ్ ఠాక్రే కాంగ్రెస్ పార్టీపై చేసిన విమర్శలను తప్పుబట్టారు. కొంకణ్‌లో శివసేన కార్యకర్తలు చేసిన దౌర్జాన్యానికి ఠాక్రే మద్దతు పలకడం సబబుకాదన్నారు. మరోవైపు అధికారం రాదన్న భయంతోనే పోలీసులను బెదిరిస్తున్నారని మండిపడ్డారు. అధికారంలో లేకుండానే చట్టాన్ని ఉల్లంఘించడంతోపాటు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటామని మాట్లాడుతున్న ఉద్ధవ్ రేపొద్దున్న అధికారంలోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రజలకు అర్థమై ఉంటుందని మాణిక్‌రావ్ ఠాక్రే చెప్పారు. పోలీసులు చేసిన లాఠీ చార్జీని సమర్థించారు. శాంతి భద్రతలకు భంగం వాటిల్లితే పోలీసులు వారి పని వారు చేయడంలో తప్పేమీలేదన్నారు. మరోవైపు ఎన్సీపీ నాయకుడు జితేంద్ర అవాడ్ కూడా ఉద్దవ్‌వ్యాఖ్యలపై మండిపడ్డారు.