టెన్షన్..టెన్షన్..టెన్షన్! | Tomorrow the counting of votes | Sakshi
Sakshi News home page

టెన్షన్..టెన్షన్..టెన్షన్!

Oct 17 2014 10:37 PM | Updated on Mar 29 2019 9:24 PM

మహారాష్ట్రలో అసెంబ్లీఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఓట్ల లెక్కింపు ఆదివారం జరగనున్న నేపథ్యంలో ఏ పార్టీ అధికారంలోకి రానుంది..

రేపే ఓట్ల లెక్కింపు
చక్రం తిప్పనున్న ఇండిపెండెంట్లు?


సాక్షి, ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.  ఓట్ల లెక్కింపు ఆదివారం జరగనున్న నేపథ్యంలో ఏ పార్టీ అధికారంలోకి రానుంది...? ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనే... విషయంపై అనేక ఊహగానాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా అందరి దృష్టి ఓట్ల లెక్కింపుపైనే కేంద్రీకృతమైంది. ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీ పెద్ద పార్టీగా అవతరించనుందని తేలడంతో బీజేపీ వర్గాల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. ఆ పార్టీలో ముఖ్యమంత్రి పదవి కోసం అప్పుడే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి.

ఒకవేళ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి మెజారిటీ స్థానాలు లభ్యమైతే ముఖ్యమంత్రి పదవి ఎవరికి కట్టబెట్టాలనే విషయంపై ఇప్పటినుంచే రాష్ట్రవ్యాప్తంగా జోరుగా చర్చలు ప్రారంభమయ్యాయి. ఆ పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా రోజుకో పేరు తెరపైకి వస్తోంది. ముఖ్యమంత్రి రేసులో ఇప్పటికే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి, పంకజా ముండే, దేవేంద్ర ఫడ్నవీస్, వినోద్ తావ్డే, ఏక్‌నాథ్ ఖడ్సేలున్న సంగతి తెలిసిందే. వీరితోపాటు ఇప్పుడు మరో పేరు విన్పిస్తోంది. కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్‌కు ముఖ్యమంత్రి పదవి అప్పగించే అవకాశాలున్నాయంటూ కొందరు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి విషయంపై సుదీర్ఘ చర్చలు జరిగే అవకాశముంది.

కీలకంగా మారనున్న ఇండిపెండెంట్లు...
ఎవరికీ పూర్తి మెజార్టీ లభించనట్టయితే ఇండిపెండెంట్లు కీలకంగా మారే అవకాశాలున్నాయి. ముఖ్యంగా పాతికేళ్ల తర్వాత పార్టీలన్నీ ఒంటరిగా బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్నటివరకు మిత్రపక్షాలుగా ఉన్న కాంగ్రెస్, ఎన్సీపీలతోపాటు శివసేన, బీజేపీల ఓట్లు చీలే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీంతో ఎవరు గెలిచినా చాల స్వల్పమెజార్టీతో గట్టెక్కే అవకాశాలున్నాయి.

మరోవైపు గతంలో మాదిరిగా ఓట్లు చీలి ప్రధాన పార్టీల అభ్యర్థులు కూడా పరాజయం పాలయ్యే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఏ పార్టీకీ పూర్తి మెజార్టీరాకుండా హంగు ఏర్పడినట్టయితే  ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఇండిపెండెంట్లు ప్రధాన పాత్ర పోషిస్తారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,686 మంది ఇండిపెండెంట్లు పోటీచేశారు. వీరిలో ఎంత మంది విజయం సాధిస్తారనేది ఆదివారం వరకు వేచిచూడాల్సిందే.

ప్రతిపక్షంలో ఎవరో మరి..
సాక్షి, ముంబై: రాష్ట్రంలో బుధవారం జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలు వెల్లడి కాకముందే కొన్ని ప్రముఖ పార్టీలు తమకు తోచిన విధంగా పదవులపై అంచనాలు వేసుకుంటున్నాయి. ఎగ్జిట్ పోల్స్ సర్వేలో బీజేపీకి భారీ మెజార్టీ వస్తుందని, సొంత బలంపై ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని స్పష్టం కావడంతో ఇక ప్రతిపక్షంలో ఎవరుంటారనే దానిపై ప్రముఖ పార్టీల్లో ఉత్కంఠ రేపుతోంది. ఎగ్జిట్ పోల్స్ సర్వే ప్రకారం మొదటి స్థానంలో బీజేపీ ఉండగా రెండు, మూడు, నాలుగో స్థానంలో నిలిచే పార్టీల మధ్య ఎక్కువ తేడా లేదు. దీంతో ప్రతిపక్షంలో ఎవరు కొనసాగుతారనే దానిపై అంతటా చర్చ జరుగుతోంది.

కాగా సర్వే రిపోర్టు ప్రకారం రెండో స్థానంలో శివసేన ఉన్నప్పటికీ ప్రతిపక్ష నాయకుడి పదవి ఎవరిని వరిస్తుందనే దానిపై కూడా పార్టీ వర్గీయుల్లో చర్చనీయంశమైంది. కాని సర్వే రిపోర్టుపై తమకు నమ్మకం లేదని తామే ప్రభుత్వం ఏర్పాటుచేస్తామనే ధీమాతో శివసేన నాయకులు ఉన్నారు. కాని సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేంత మెజార్టీ రాకున్నప్పటికీ కనీసం ప్రతిపక్షంలోనైనా కొనసాగుతామనే ధీమాతో ఉన్నట్లు తెలుస్తోంది. మరోపక్క ప్రభుత్వం ఏర్పాటులో ఎన్సీపీ కీలకపాత్ర పోషిస్తుందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు ప్రఫుల్ పటేల్ అభిప్రాయపడిన విషయం తెలిసిందే. ఇలా ఎవరికి వారు ఫలితాల తర్వాత ఎదురయ్యే రాజకీయ పరిణామాలపై బేరీజు వేసుకుంటున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement