‘డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా కఠిన చట్టం చేయండి’ | Strictly rules maintain on drunk and drive cases | Sakshi
Sakshi News home page

‘డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా కఠిన చట్టం చేయండి’

Apr 1 2015 10:30 PM | Updated on Aug 30 2018 3:56 PM

మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి వ్యతిరేకంగా కఠిన చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని సామాజిక కార్యకర్తలు...

న్యూఢిల్లీ: మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి వ్యతిరేకంగా కఠిన చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని సామాజిక కార్యకర్తలు, బాధిత కుటుంబాల వారు డిమాండ్ చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాతో ఎన్జీవోలు బుధవారం సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు తమ డిమాండ్లను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. మద్యం సేవించి వాహనాలు నడపడం ద్వారా రోడ్డు ప్రమాదాలకు పాల్పడుతూ అనేక మంది ప్రాణాలను గాలిలో కలిపేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

అటువంటి వారిని వెంటనే అరెస్టు చేయడంతో పాటు బాధిత కుటుంబాలకు న్యాయ సహాయం చేయాలని కోరారు. అలాగే అలాంటి వారికి తగిన కౌన్సిలింగ్ ఇవ్వాలని చెప్పారు. ‘డిప్యూటీ సీఎంతో సమావేశంలో డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి అనేక అంశాలను చర్చించాం. మద్యం సేవించి ప్రమాదాలకు కారణమవుతున్న వారిని వెంటనే అరెస్టు చేయాలని కోరాం. వారిపై నాన్ బెయిలబుల్ కింద కేసు నమోదు చేయాలని అడిగాం.

అలాగే నిర్ణీత వయసు కంటే తక్కువగా ఉండి మద్యం షాపులకు వెళ్లే వారిని నియంత్రించడం కోసం వయసు ధ్రువీకరణ తప్పనిసరి చేయాలని డిప్యూటీ సీఎంను కోరాం’ అని క్యాంపైన్ అగనెస్ట్ డ్రంక్ అండ్ డ్రైవ్ వ్యవస్థాపకుడు ప్రిన్స్ సింఘాల్ వివరించారు. అలాగే మార్చి 1న అశోక్ నగర్‌లో మద్యం సేవించి వాహనం నడపడం ద్వారా 14 ఏళ్ల వయసు గల ఇద్దరి మరణానికి కారణమైన ఇన్నోవా కారు డ్రైవర్‌ను అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశామని సింఘాల్ చెప్పారు. ఘటనలు జరిగిన వెంటనే చర్యలు తీసుకోకపోవడంతో తాము న్యాయం కోసం రోడ్లు ఎక్కాల్సి వస్తోందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement