కొత్త వ్యూహమా? | Srirangam election campaign Panneerselvam phone call outrage | Sakshi
Sakshi News home page

కొత్త వ్యూహమా?

Feb 6 2015 1:12 AM | Updated on Sep 2 2017 8:50 PM

కొత్త వ్యూహమా?

కొత్త వ్యూహమా?

శ్రీరంగం ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న మంత్రులంతా వెంటనే చెన్నై చేరుకోవాలంటూ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం చేసిన ఫోన్‌కాల్ కలకలం సృష్టించింది.

 శ్రీరంగం ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న మంత్రులంతా వెంటనే చెన్నై చేరుకోవాలంటూ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం  చేసిన ఫోన్‌కాల్ కలకలం సృష్టించింది. ఉప ఎన్నికలో గెలుపుకోసం కొత్త వ్యూహ రచనకే అని ప్రతిపక్ష పార్టీలు ఊహాగానాల్లో మునిగిపోయాయి.
 
 చెన్నై, సాక్షి ప్రతినిధి :అన్నాడీఎంకే అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత ప్రాతినిధ్యం వహించిన శ్రీరంగం అసెంబ్లీ స్థానానికి ప్రస్తుతం ఉప ఎన్నిక  జరుగుతోంది. అన్నాడీఎంకే, డీఎంకే, బీజేపీ, సీపీఎం బరిలో దిగాయి. అయితే ప్రధాన పోటీ మాత్రం అన్నాడీఎంకే, డీఎంకేల మధ్యనే సాగుతోంది. గతంలో అన్నాడీఎంకే ప్రాతినిధ్యం వహించిన స్థానం కావడంతో సిట్టింగ్ సీటును దక్కించుకోవడం అధికార పార్టీకి ప్రతిష్టగా మారింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు పాలై ప్రతిష్ట కోల్పోయిన జయలలితను మరింతగా దెబ్బతీసేందుకు శ్రీరంగం ఎన్నికలను డీఎంకే అవకాశంగా తీసుకుంది. తమ రాజకీయ ప్రతిష్టను పెంచగల శ్రీరంగంలో విజయం డీఎంకే ఎంతో అవసరంగా భావిస్తోంది. రెండు పార్టీల మధ్య పోటీ ప్రతిష్టాత్మకంగా మారడంతో సిట్టింగ్ సీటును దక్కించుకోవడం కోసం 29 మంది మంత్రులు మూడువారాలుగా శ్రీరంగంలో తిష్టవేశారు.
 
  నియోజకవర్గాన్ని విభజించుకుని ప్రచార బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈనెల 11వ తేదీతో ఎన్నికల ప్రచారం ముగిసేవరకు చెన్నైకి రావద్దని అమ్మ గతంలో ఆదేశించింది. రాష్ట్రంలో అన్నాడీఎంకే గెలుపు నల్లేరుపై నడకగా భావించిన పరిస్థితులు క్రమేణా మారిపోతున్నాయి. డీఎంకే అభ్యర్థి ఆనంద్ గతంలో అమ్మపై పోటీచేసి ఓడిపోయిన సానుభూతి, సామాజిక పరంగా బలమైన అభ్యర్థి కావడంతో గెలుపు అవకాశాలు మెరుగుపడ్డాయి. ఈ పరిణామం అధికార పార్టీ నేతల కంటిపై కనుకులేకుండా చేసింది. ఈనెల 13న పోలింగ్ సందర్భంగా పార్టీలన్నీ ప్రచారంలో మునిగి తేలుతున్నాయి. ఇటువంటి కీలకసమయంలో గురువారం రాత్రి కల్లా మంత్రులను ఆగమేఘాలపై చెన్నైకి చేరుకోవాలని ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం ఆదేశించారు. బుధవారం సాయంత్రం పోయెస్‌గార్డెన్‌లో జయలలితతో సమావేశమైన అనంతరం పన్నీర్ సెల్వం మంత్రులకు ఫోన్ చేయడం వల్ల ఇది అమ్మ ఆదేశంగా ప్రచారంలో ఉంది.
 
  కేబినెట్‌లో కీలక నిర్ణయాలు తీసుకునే ముందు సీఎంగా జయలలిత మంత్రులతో సమావేశం కావడం ఆనవాయితీ. అయితే పన్నీర్ సెల్వం సీఎం అయిన ఈ నాలుగు నెలల్లోఇంత వరకు కేబినెట్ సమావేశాన్ని నిర్వహించలేదు. మంత్రులతో శుక్రవారం కేబినెట్ సమావేశాన్ని నిర్వహించేందుకే ఈ పిలుపుగా భావిస్తున్నారు. అలాగే శ్రీరంగంలో అన్నాడీఎంకే అభ్యర్థి గెలుపు అవకాశాలు మందగించడం వల్ల ప్రచార వ్యూహంలో ఏమైనా మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందంటున్నారు. అంతేగాక ఈనెల 23నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే నిర్ణయంతోనే మంత్రులను రప్పించినట్లు భావిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement