
దటీజ్ రజనీ
సంస్కారమంటే శివాజీరావ్ గైక్వాడ్ నుంచి తెలుసుకోవాలి... అదేనండి సౌత్ ఇండియా సూపర్‌స్టార్ రజనీకాంత్. అప్పట్లో ఆయన పేరు శివాజీరావ్ గైక్వాడ్.
బెంగళూరు, న్యూస్‌లైన్ : సంస్కారమంటే శివాజీరావ్ గైక్వాడ్ నుంచి తెలుసుకోవాలి... అదేనండి సౌత్ ఇండియా సూపర్‌స్టార్ రజనీకాంత్. అప్పట్లో ఆయన పేరు శివాజీరావ్ గైక్వాడ్. ఆదరించడంలోనూ... ఆప్యాయత కురిపించడంలోను, దాన ధర్మాల్లోను ఆయనకు ఆయనే సాటి. తన కు విద్యాబుద్ధులు నేర్పించిన ఉపాధ్యాయురాలు కష్టాల్లో ఉందని తెలుసుకుని తల్లడిల్లిపోయారు.
తన మిత్రుడి ద్వారా ఆమె సమాచారం తెలుసుకుని స్వయంగా ఆమెకు ఫోన్ చేసి క్షేమ సమాచారాలు తెలుసుకుని ఆర్థికసాయం చే సిన సంఘటన వెలుగు చూసింది. బెంగళూరుకు చెందిన రజనీకాంత్ ఇక్కడి గెవిపురంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం చేశాడు. ఆ సమయంలో అక్కడ ఉపాధ్యాయురాలిగా ఉన్న శాంతమ్మ (ప్రస్తుతం ఆమె వయస్సు 78) రజనీపై ప్రత్యేక శ్రద్ధతో ఇంగ్లిషు, కన్నడ భాషలు నేర్పించారు. ఇక్కడి జాలహళ్లిలో భర్తతో కలిసి నివాసముంటున్న శాంతమ్మకు పిల్లలు లేరు.
ప్రస్తుతం ఆమె ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు తన బాల్య స్నేహితుడు మురుగన్ ద్వారా రజనీ తెలుసుకున్నారు. ఆమె మొబైల్ నంబర్ తెలుసుకుని ఇటీవల ఆమెతో మాట్లాడారు. రజనీ ఫోన్‌లో మాట్లాడటంతో శాంతమ్మ ఉబ్బితబ్బిబ్బయ్యారు. బెంగళూరు వచ్చినప్పుడు తానే స్వయంగా వచ్చి కలుస్తానని రజనీ చెప్పినట్లు తెలిసింది. ఉపాధ్యాయ దినోత్సవం రోజున శాంతమ్మ అకౌంట్‌లో రూ. 3 లక్షలు రజనీ జమ చేశారు. ఈ విషయం తెలుసుకున్న శాంతమ్మ తన శిష్యుడు ఎంత ఎదిగినా తమను మరిచిపోలేదని ఆనందభాష్పాలు రాల్చారు. త్వరలో తన ఇంటికి ర జనీకాంత్ వస్తాడని ఆమె ఆశగా ఎదురు చూస్తున్నారు.