హద్దుమీరుతున్న ఫేర్‌వెల్ పార్టీలు | Rocking hard farewell parties leave Delhi schools worried | Sakshi
Sakshi News home page

హద్దుమీరుతున్న ఫేర్‌వెల్ పార్టీలు

Nov 24 2014 10:18 PM | Updated on Oct 1 2018 5:14 PM

పన్నెండవ తరగతి చదివే పిల్లల ఫేర్‌వె ల్ పార్టీలు ఇటు తల్లిదండ్రులకు, అటు స్కూళ్లకు ఆందోళన కలిగిస్తున్నాయి.

 సాక్షి, న్యూఢిల్లీ: పన్నెండవ తరగతి చదివే పిల్లల ఫేర్‌వె ల్ పార్టీలు ఇటు తల్లిదండ్రులకు, అటు స్కూళ్లకు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రీ బోర్డు పరీక్షలు సమీపిస్తుండడంతో మరికొన్ని నెలల తర్వాత తమ దారులు వేరవుతాయన్న భావంతో విద్యార్థులు జోరుగా పార్టీలు చేసుకుంటున్నారు. ఈ పార్టీల ఆర్భాటం ఎంతగా ఉంటోందంటే.... ‘‘వాటికి, మాకు ఏ సంబంధం లేదు, మీ పిల్లల పార్టీల బాధ్యత మీదే’’నంటూ స్కూలు యాజమాన్యాలు తల్లిదండ్రులను హెచ్చరిస్తూ నోటీసులు పంపుతున్నాయి.
 
 ఫేర్‌వెల్ పార్టీలలో మద్యం, సిగార్లు, పబ్‌లు, ఫార్మ్‌హౌజ్‌లు.... డబ్బు పారేస్తే చాలు అన్నీ అందుబాటులో ఉంటాయి. ఖరీదైన స్కూళ్లలో చదివే సంపన్నుల పిల్లలు ఈ సరదాల కోసం డబ్బు వెచ్చించడానికి వెనుకాడడం లేదు. తలాకొంత వేసుకుని భారీ సొమ్ముతో డాబుగా పార్టీలు చేసుకుంటున్నారు. నగరంలోని ఖరీదైన రెస్టారెంట్లు, లాంజ్‌బార్లలో ఇప్పటికే పూర్తయిన బుకింగ్‌లు పిల్లల పార్టీలకు సాక్ష్యంగా  నిలుస్తున్నాయి. దక్షిణ ఢిల్లీలోని సాకేత్, వసంత్‌కుంజ్, వసంత్ విహార్‌లో ఇటీవల జరిగిన పిల్లల ఫేర్ వెల్ పార్టీలలో కొన్ని అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోవడం, అవి తమ వరకు రావడం జరిగిందని ఢిల్లీ పోలీసులు చెప్పారు. దీంతో పలు పబ్‌లపై తాము చర్యలు చేపట్టామని, దక్షిణ ఢిల్లీలో చాలా పబ్‌లు ఇప్పుడు స్కూలు పిల్లల పార్టీలపై నిషేధం విధించాయని పోలీసు అధికారులు చెప్పారు. పబ్‌లలో నిషేధం విధించడంతో పిల్లలు ఇప్పుడు ఫార్మ్‌హౌజ్‌ల వైపు మళ్లినట్లు తెలుస్తోంది.
 
 గత సంవత్సరం గుర్గావ్‌లోని ఓ పబ్‌లో 100 మందికి పైగా స్కూలు విద్యార్థినీ విద్యార్థులు మద్యం, సిగరెట్లు, హుక్కా సేవిస్తూ పట్టుబడ్డారు. సెక్స్ అండ్ స్మోక్ థీమ్‌తో పార్టీ జరుగుతున్నట్లు అందిన సమాచారంతో పోలీసులు, ఎక్సైజ్ విభాగం అధికారులు పబ్‌పై దాడి నిర్వహించడంతో ఈ గుట్టు బయటపడింది. ఆ తరువాత పబ్‌ను మూసివేశారు. 2000 సంవత్సరంలో కూడా గుర్గావ్‌లోని మరో పబ్‌లో 80 మంది విద్యార్థులు విందు చేసుకుంటూ పట్టుబడ్డారు. ఈ రెండు సందర్భాలలోనూ పిల్లలను తల్లిదండ్రుల జోక్యంతో విడిచిపెట్టారు.
 

Advertisement
 
Advertisement
Advertisement