ప్రపంచకప్ తర్వాత అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలకనున్న పలువురు స్టార్స్
మెస్సీ, రొనాల్డో, నెమార్ ఆఖరి ఆట
ఈ జాబితాలో సలా, మోడ్రిచ్ తదితరులు
ఏ ఆటలో అయినా నిలకడగా రాణిస్తూ... మంచి గుర్తింపు తెచ్చుకునే ప్లేయర్లు చాలా మంది ఉంటారు. కానీ తమ ఉనికితోనే మ్యాచ్‌ను రసవత్తరంగా మార్చేసి... చిన్న కదలికలతో ఆబాలగోపాలాన్ని మంత్రముగ్ధులను చేసేవారు కొందరే! స్టార్, సూపర్ స్టార్ స్థాయి దాటేసి అలా లెజెండ్‌గా మారిన పలువురు ప్లేయర్లు ఈ ‘ఫిఫా’ ప్రపంచకప్‌తో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు టాటా చెప్పనున్నారు.
లియోనెల్ మెస్సీ (అర్జెంటీనా), క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్), నెమార్ (బ్రెజిల్), మొహమ్మద్ సలా (ఈజిప్ట్), లూకా మోడ్రిక్ (క్రొయేషియా), మాన్యుయెల్ న్యూయెర్ (జర్మనీ), విర్జిల్ వాన్ డిక్ (నెదర్లాండ్స్), కెవిన్ డి బ్రూనీ (బెల్జియం), సాడియో మానె (సెనెగల్), సన్ హెంగ్ మిన్ (దక్షిణ కొరియా), జేమ్స్ రోడ్రిగెజ్ (కొలంబియా) ఇలా ఈ జాబితా చాలా పెద్దదే! ఈ దిగ్గజాలను ఆయా దేశాల తరఫున అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో చూడటం దాదాపు ఇదే చివరిసారి కానుంది. అలాంటి వాళ్ల కెరీర్‌ను ఓసారి పరిశీలిస్తే...
మెస్సీ... అర్జెంటీనా తురుపుముక్క
సుదీర్ఘ కాలంగా అర్జెంటీనా జట్టు తురుపుముక్కగా ఉన్న స్టార్ స్ట్రయికర్ లియోనెల్ మెస్సీ ‘ఫిఫా’ ప్రపంచకప్–2026 తర్వాత కెరీర్‌కు వీడ్కోలు పలకనున్నాడు. నాలుగేళ్ల క్రితం ఖతార్‌లో జరిగిన మెగా టోర్నీ సమయంలోనే ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాలనుకున్న 39 ఏళ్ల మెస్సీ... అప్పుడు అర్జెంటీనా జట్టు వరల్డ్ చాంపియన్‌గా నిలవడంతో... సుదీర్ఘకాలంగా తాను కన్న కలను ఆస్వాదించేందుకు ఆటలో కొనసాగాలనుకుంటున్నట్లు వెల్లడించాడు. జాతీయ జట్టు తరఫున ఇప్పటి వరకు 198 మ్యాచ్‌లాడిన మెస్సీ 115 గోల్స్ కొట్టాడు.
ఐదుసార్లు ‘ఫిఫా’ వరల్డ్‌కప్‌లో పాల్గొన్న మెస్సీ... రికార్డు స్థాయిలో ఆరోసారి మెగా టోర్నీలో ఆడిన అనంతరం వీడ్కోలు పలికే అవకాశాలున్నాయి. మరే ఆటగాడికీ సాధ్యం కాని రీతిలో ఈ అర్జెంటీనా స్టార్ 26 ప్రపంచకప్ మ్యాచ్‌లు ఆడాడు. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనున్న అర్జెంటీనా జట్టు... టైటిల్‌ను నిలబెట్టుకొని మెస్సీకి ఘనంగా వీడ్కోలు పలకాలని భావిస్తోంది. అతడి నాయకత్వ పటిమ, అనుభవం ఈ టోర్నీలో అర్జెంటీనాకు మరింత బలాన్నిస్తాయని యోచిస్తోంది. ఫిట్‌నెస్ ఎంతో కీలకమైన ఫుట్‌బాల్‌లో 39 ఏళ్ల వయసు వరకు కొనసాగడం అంటే మామూలు విషయం కాదు. జాతీయ జట్టుతో పాటు క్లబ్‌లు కలుపుకుంటే కెరీర్‌లో మొత్తం 1151 అధికారిక మ్యాచ్‌లు ఆడిన మెస్సీ... 906 గోల్స్ చేశాడు.
రొనాల్డో... ముందే చెప్పేశాడు
యావత్ క్రీడా ప్రపంచం ‘సీఆర్7’గా పిలుచుకునే... ఫుట్‌బాల్ దిగ్గజం, పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఈ ప్రపంచకప్ అనంతరం కెరీర్‌కు వీడ్కోలు పలకనున్నాడు. మెస్సీతో సరిసమానంగా రికార్డు స్థాయిలో ఆరోసారి ‘ఫిఫా’ వరల్డ్‌కప్ బరిలోకి దిగనున్న 41 రొనాల్డో ఇదే తనకు చివరి ప్రపంచకప్ అని ఇప్పటికే వెల్లడించాడు. కెరీర్‌లో ఎన్నో అవార్డులు, రివార్డులు సాధించిన రొనాల్డో లెక్కకు మిక్కిలి ట్రోఫీలు సైతం చేజిక్కించుకున్నాడు. అయితే సుదీర్ఘ కాలంగా ఎంతగానో తపిస్తున్నా ‘ఫిఫా’ విన్నర్స్ ట్రోఫీ మాత్రం అతడి చేతికి చిక్కలేదు. ‘ఔర్ ఏక్ ధక్కా... ఇస్ బార్ పక్కా’ అన్నట్లు తన చివరి ప్రయత్నంలో అయినా అందని ద్రాక్షను అందుకోవాలని రొనాల్డో భావిస్తున్నాడు.
2003లో తొలిసారి జాతీయ జట్టు తరఫున బరిలోకి దిగిన రొనాల్డో... 23 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో పోర్చుగల్ తరఫున 226 మ్యాచ్‌లు ఆడి 143 గోల్స్ చేశాడు. ప్రస్తుతం సౌదీ అరేబియాకు చెందిన ‘అల్ నాసర్’ క్లబ్‌కు సారథ్యం వహిస్తున్న రొనాల్డో... ఇటీవలే సౌదీ ప్రొ లీగ్ టైటిల్ సాధించి ఫుల్ జోష్‌లో ఉన్నాడు. అదే ఊపు ప్రపంచకప్‌లోనూ కొనసాగిస్తూ తన చిరకాల లక్ష్యాన్ని అందుకుంటాడా చూడాలి. సీనియర్ స్థాయిలో ఇప్పటి వరకు 1320 మ్యాచ్‌లు ఆడిన రొనాల్డో 970 గోల్స్ చేశాడు. 41 ఏళ్ల వయసులోనూ ఫిట్‌నెస్‌కు ప్రతిరూపంగా నిలచే రొనాల్డో... సోషల్ మీడియాలో వంద కోట్లకుపైగా ఫాలోవర్స్ సంపాదించుకున్న తొలి వ్యక్తిగా అరుదైన ఘనత సైతం తన ఖాతాలో వేసుకున్నాడు.
నెమార్... బ్రెజిల్ గుండె చప్పుడు
మూడుసార్లు ‘ఫిఫా’ ప్రపంచకప్ ఆడిన బ్రెజిల్ సూపర్ స్టార్ నెమార్ జూనియర్ చివరి టోర్నీకి సిద్ధమవుతున్నాడు. తన తరంలో జట్టుకు అందని ట్రోఫీని అందించాలనే బలమైన సంకల్పంతో ఉన్నాడు. అయితే ఫిట్‌నెస్ కారణాలరీత్యా అతడు అన్నీ మ్యాచ్‌లు ఆడతాడా అనేది సందేహమే. అత్యధికంగా ఐదుసార్లు (1958, 1962, 1970, 1994, 2002లో) వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన బ్రెజిల్ ‘సిక్సర్’ కొట్టాలంటే నెమార్ ప్రదర్శన కీలకం కానుంది. ఇది తనకు చివరి మెగా టోర్నీ అని 34 ఏళ్ల నెమార్ ఇప్పటికే పలుమార్లు వెల్లడించాడు.
జాతీయ జట్టు తరఫున 128 మ్యాచ్‌లు ఆడిన నెమార్... 79 గోల్స్ చేయడంతో పాటు మరో 59 గోల్స్‌కు సహకారం అందించాడు. బ్రెజిల్ తరఫున అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్‌గా కొనసాగుతున్న నెమార్ చివరి వరల్డ్‌కప్‌లోనూ అదే నిలకడ కొనసాగించాలని భావిస్తున్నాడు. ఐదో ప్రపంచకప్ ఆడనున్న జర్మనీ గోల్ కీపర్ న్యూయెర్ (40 ఏళ్లు), మెక్సికో గోల్ కీపర్ ఒచోవా (40 ఏళ్లు), కొలంబియా కెప్టెన్ జేమ్స్ రోడ్రిగెజ్ (34 ఏళ్లు), సాడియో మానె (34 ఏళ్లు), విర్జిల్ వాన్ డిక్ (35 ఏళ్లు), కెవిన్ డి బ్రూనీ (35 ఏళ్లు), సన్ హెంగ్ మిన్ (34 ఏళ్లు) కూడా చివరిసారి ప్రపంచకప్‌లో కనిపించనున్నారు.
సలా... వన్ మ్యాన్ షో
క్లబ్ ఫుట్‌బాల్ లివర్‌పూల్ తరఫున సంచలనాలు నమోదు చేసిన ఈజిప్ట్ సూపర్ స్టార్ మొహమ్మద్ సలాకు కూడా ఇదే చివరి ‘ఫిఫా’ వరల్డ్‌కప్ కానుంది. 2010లో సీనియర్ స్థాయిలో తొలి మ్యాచ్ ఆడిన సలా జాతీయ జట్టు తరఫున ఇప్పటి వరకు 115 మ్యాచ్‌లాడి 67 గోల్స్ చేశాడు. అటాకింగ్‌కు పెట్టింది పేరైన సలా... రెప్పపాటులో ప్రత్యర్థి ప్లేయర్లను బోల్తా కొట్టించడంలో నేర్పరి. ఇప్పటి వరకు ఒకే ఒక్కసారి (2018లో) ప్రపంచకప్ బరిలోకి దిగిన సలా... 2 మ్యాచ్‌లాడి రెండు గోల్స్ చేశాడు.
క్లబ్ ఫుట్‌బాల్‌లో 750కి పైగా మ్యాచ్‌లాడిన అనుభవం ఉన్న అతడు... ఈజిప్ట్‌ను ఎలా ముందుకు నడిపిస్తాడనేది కీలకం. మైదానంలో అతడి వేగం, గోల్స్ చేయడంలో అతడి సామర్థ్యంపై ఈజిప్ట్ భారీ ఆశలు పెట్టుకుంది. సుదీర్ఘ ‘ఫిఫా’ వరల్డ్‌కప్ చరిత్రలో ఈజిప్ట్ ఇప్పటి వరకు మూడుసార్లు (1934, 1990, 2018) మాత్రమే మెగా టోర్నీకి అర్హత సాధించింది. 33 ఏళ్ల సలాకు ఫిట్‌నెస్ పరంగా సమస్యలు లేకపోయినా... ఇప్పటి వరకు ప్రపంచకప్‌లో ఒక్క మ్యాచ్ కూడా గెలవని ఈజిప్ట్ వచ్చే సీజన్‌కు అర్హత సాధిస్తుందా అనేది అనుమానమే. ఈ నేపథ్యంలో... అతడికిదే చివరి ప్రపంచకప్ అయ్యే అవకాశాలున్నాయి.
లూకా మోడ్రిచ్... క్రొయేషియా ఆశ
క్రొయేషియా మిడ్‌ఫీల్డర్ లూకా మోడ్రిచ్ ఐదోసారి ప్రపంచకప్ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. ఆ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత జాతీయ జట్టు ఆడిన సగానికి పైగా మ్యాచ్‌ల్లో బరిలోకి దిగిన 40 ఏళ్ల మోడ్రిక్ చివరిసారి ‘ఫిఫా’ వరల్డ్‌కప్ టోర్నీ ఆడనున్నాడు. కెరీర్‌లో 196 మ్యాచ్‌లాడిన మోడ్రిచ్... 28 గోల్స్ చేశాడు. గోల్స్ పరంగా చూసుకుంటే సంఖ్య తక్కువే కనిపించినా మిడ్‌ఫీల్డ్‌లో అతడి అనుభవం జట్టుకు ఎంత బలాన్నిస్తుందో గత ప్రపంచకప్‌లో రుజువైంది.
2022 టోర్నీలో అనూహ్య ఆటతీరుతో జట్టును ముందుకు నడిపించిన మోడ్రిచ్... క్రొయేషియాను మూడో స్థానంలో నిలిపాడు. ప్రస్తుతం ఇటలీ లీగ్‌లో ఏసీ మిలాన్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న లూకా... ఇటీవల గాయపడి కోలుకున్నాడు. ముఖానికి శస్త్రచికిత్స జరిగిన నేపథ్యంలో ఈ టోర్నీలో అతడు సేఫ్టీ మాస్క్‌తో బరిలోకి దిగొచ్చు. క్రొయేషియా జట్టు సంధి దశలో ఉన్న ప్రస్తుత తరుణంలో లూకా అనుభవం ఆ జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుందని మేనేజర్ డాలీ ఆశాభావం వ్యక్తం చేశాడు.
– సాక్షి క్రీడా విభాగం


