అభిమానులతో సూపర్‌స్టార్ | Rajinikanth meet with fans | Sakshi
Sakshi News home page

అభిమానులతో సూపర్‌స్టార్

Jan 2 2015 2:11 AM | Updated on Sep 2 2017 7:04 PM

అభిమానులతో సూపర్‌స్టార్

అభిమానులతో సూపర్‌స్టార్

అభిమానులు ఎంతగానో ఆరాధించే నటుడిని ప్రత్యక్షంగా చూసే అవకాశం కలిగితే.. వారి సంతోషానికి అవదులుండవు.

 అభిమానులు ఎంతగానో ఆరాధించే నటుడిని ప్రత్యక్షంగా చూసే అవకాశం కలిగితే.. వారి సంతోషానికి అవదులుండవు. అదీ నూతన సంవత్సరం తొలిరోజున సూపర్‌స్టార్ రజనీకాంతే తమ కళ్ల ఎదుట నిలిస్తే ఇక అభిమానుల ఆనందానికి అంతేలేదు. సరిగ్గా రజనీకాంత్ అభిమానులు అలాంటి అనుభూతినే గురువారం పొందారు. సాధారణంగా రజనీకాంత్ ఎక్కువగా అభిమానుల మధ్యకు రారు. ఇంతకుముందు పుట్టినరోజు వేడుక సందర్భంలోనూ.. తన నూతన చిత్రం విడుదల సమయాల్లోనూ అభిమానులను స్వయంగా కలుసుకుని ముచ్చటించేవారు.
 
 ఈ మధ్య అలాంటి సందర్భాల్లో కూడా అభిమానులను కలవడం మానేశారు. ఆయన భార్య లతా రజనీకాంత్‌నే అభిమానులను కలిసి వారి కోరికలను, భావాలను వినేవారు. అలాంటిది ఇటీవల తన పుట్టినరోజున కూడా అభిమానులకు దూరంగా ఉన్న రజనీకాంత్ ఈ నూతన సంవత్సరం తొలిరోజున అభిమానులను కలవాలని నిర్ణయించుకోవడం విశేషం. ఈ విషయం ఆయన అభిమానులకు తెలిసింది. ఇంకేముంది పెద్ద ఎత్తున ఆయన నివాసమున్న పోయెస్‌గార్డెన్ వద్ద గుమికూడారు. వారందరినీ రజనీకాంత్ సాదరంగా ఆహ్వానించి కొంతసేపు ముచ్చటించారు.
 
 అనంతరం ఆయన వారిని నుద్దేశించి మాట్లాడారు. ‘మాకు మా కుటుంబం చాలా ముఖ్యం. అందరూ మీ కుటుంబాలను మంచిగా చూసుకోండి. వారికి సేవలందిస్తూ మంచి పౌరుడిగా పేరు తెచ్చుకోండి’ అంటూ హితవు పలికి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి పంపించారు. చాలా కాలం తరువాత తమ అభిమాన నటుడిని దగ్గరగా చూసిన అభిమానులు ఎనలేని ఆనందంతో ఇళ్లకు తిరుగుముఖం పట్టారు.
 

Advertisement
 
Advertisement
Advertisement