లోక్‌సభ ఎన్నికల తర్వాత అధికారంలోకి వస్తే ప్రధాని పదవిని చేపట్టేందుకు రాహుల్‌గాంధీ విముఖత చూపడం లేదని ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల తర్వాత అధికారంలోకి వస్తే ప్రధాని పదవిని చేపట్టేందుకు రాహుల్‌గాంధీ విముఖత చూపడం లేదని ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ పేర్కొన్నారు. ఆదివారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారని, ఆయనకు పార్టీకి అండదండగా నిలుస్తుందని రాష్ట్ర శాసనసభకు జరుగుతున్న ఎన్నికల్లో వరుసగా నాలుగోసారికూడా విజయం సాధించడంపై దృష్టి సారించిన షీలాదీక్షిత్ ప్రశంసించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే రాహుల్‌నే ప్రధానిగా ఎన్నుకుంటుందన్నారు. ప్రతి రోజు, ప్రతి నిమిషం ఆయన ఎక్కడో ఒకచోట పర్యటిస్తున్నారన్నారు.
అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారన్నారు. ప్రధానమంత్రి అభ్యర్థిని ముందుగానే ప్రకటించే సంస్కృతి కాంగ్రెస్ పార్టీలో లేదన్నారు. ఆరు నెలల క్రితమే రాహుల్‌గాంధీ పార్టీ ఉపాధ్యక్ష పదవిని చేపట్టాడన్నారు. ఆ బాధ్యతలనే ఆయన ప్రస్తుతం నిర్వర్తిస్తున్నాడన్నారు. అందువల్ల ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరనే అంశాన్ని ప్రస్తుతానికి వదిలేయడమే ఉత్తమమన్నారు. వచ్చే సార ్వత్రిక ఎన్నికల్లో విజయం కోసం తమతోపాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. తదుపరి తరం నాయకుడు రాహుల్‌గాంధీయేనని, అందువల్ల ఆయనను ప్రధానమంత్రిగా చూడాలని ఉందని ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ తన మనసులో మాట చెప్పారు. రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి కావాలనే యోచన మీ మనసులో నుంచి ఏరోజైనా బయటికొచ్చిందా అని ప్రశ్నించగా అటువంటిదేమీ లేదన్నారు.
ఈసారీ గెలుపు మాదే
రాష్ట్ర శాసనసభకు ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో వరుసగా నాలుగోసారి కూడా తామే విజయం సాధిస్తామని ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ ధీమా వ్యక్తం చేశారు. తమకు సంపూర్ణ మెజారిటీ లభిస్తుందన్నారు. ఒపీనియన్ పోల్స్‌లో తేలినవిధంగా హంగ్ అసెంబ్లీ వచ్చే అవకాశం ఉందా అని అడగ్గా అలా జరుగుతుందని తాననుకోవడం లేదన్నారు. ఢిల్లీ ప్రజలు సుస్థిర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారన్నారు.