రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు

రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు - Sakshi


హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించేది లేదంటూ కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించిన నేపథ్యంలో గురువారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని తుంగలో తొక్కడంతో రాష్ట్ర ప్రజలు భగ్గుమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా అన్ని జిల్లాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు.ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా విజయవాడలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ నేతలు పార్థసారధి, వంగవీటి రాధా, వామపక్ష నేతలు రామకృష్ణ, మధు పాల్గొన్నారు. శనివారం వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలని సీపీఐ రాష్ట్రకార్యదర్శి మధు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు కోరారు. ప్రత్యేక హోదా కోసం అందరూ కలిసిరావాలని ఈ సందర్భంగా నేతలు పిలుపునిచ్చారు.ప్రత్యేక హోదాకోసం వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ ఆధ్వర్యంలో విజయవాడలో ఆందోళనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇబ్రహీపట్నం వద్ద జాతీయ రహదారిని నిర్బంధించి ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. ఓటుకు కోట్ల కేసు కోసం చంద్రబాబు రాష్ట్రాన్ని తాకట్టుపెట్టారని జోగి రమేష్ మండిపడ్డారు. హోదా రాకపోతే రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదని తెలిపారు.ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా గుంటూరు శంకర్ విలాస్ సెంటర్‌లో వైఎస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నేతలు లేళ్ల అప్పిరెడ్డి, రోశయ్య, ఆంజనేయులు పాల్గొన్నారు.ఒంగోలులో ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రానికి జరిగే అన్యాయానికి నిరసనగా ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్‌సీపీ నేతలు బత్తుల బ్రహ్మానందరెడ్డి, అహ్మద్‌తో పాటు సీపీఎం నేత ఆంజనేయులు, సీపీఐ నాయకురాలు అరుణ పాల్గొన్నారు.ప్రత్యేక హోదా కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ, సీపీఎం, సీపీఐ, ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రానికి లబ్ధి చేకూరుతుందని నేతలు నినాదాలు చేశారు.చిత్తూరు శ్రీకాళహస్తిలో ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ సీపీ నేత బియ్యపు మధుసుదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. తిరుపతిలో ప్రత్యేక హోదా కోరుతూ.. వామపక్ష నేతలు బీఎస్ఎన్ఎల్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.వైఎస్ఆర్ జిల్లాలో ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా ఆందోళనలు వెల్లువెత్తాయి. ఓటుకు కోట్లు కేసులో చిక్కుకున్న చంద్రబాబు అర్థరాత్రి జైట్లీతో ప్రకటన చేయించారని, హోదా వచ్చేవరకు వైఎస్ఆర్ సీపీ పోరాడుతుందని కడప మేయర్ సురేష్‌బాబు స్పష్టం చేశారు.అనంతపురం జిల్లాలో ప్రత్యేక హోదా కోరుతూ ఎస్కే యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. అనంతపురం- చెన్నై రహదారిపై విద్యార్థులు బైఠాయించారు. ప్రత్యేక హోదా సాధించలేని చంద్రబాబు రాజీనామా చేయాలని వారు నినాదాలు చేశారు.శ్రీకాకుళం జిల్లాలో ప్రత్యేక హోదా కోరుతూ ఇన్‌కం ట్యాక్స్ ఆఫీస్ ఎదుట వామపక్షాలు ధర్నా నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్‌సీపీ నేతలు రెడ్డి శాంతి, ధర్మాన కృష్ణదాస్ మద్దతు తెలిపారు.

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top