రేపు చెన్నైకు ప్రణబ్ రాక


సాక్షి, చెన్నై: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం చెన్నైకు రానున్నారు. నగరంలో జరిగే పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ఈ పర్యటనకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘా లు నిరసనలకు దిగాలని నిర్ణయించాయి. దీంతో నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఒక రోజు పర్యటన నిమిత్తం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చెన్నైకు వచ్చేందుకు నిర్ణయించారు. ఎంఆర్‌సీ నగర్‌లోని హోటల్‌లో జరిగే కార్యక్రమంలోనూ, నుంగబాక్కంలోని లయోల కళాశాలలో జరిగే వేడుకలోనూ ఆయన పాల్గొననున్నారు. ఆయన రాకను పురస్కరించుకుని ఆయా ప్రాంతాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, రాష్ర్టపతి పర్యటనకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టనున్నట్టు విద్యార్థి సంఘాలు ప్రకటించారుు.ఈ సంఘాల్లో లయోల కళాశాల విద్యార్థులు సైతం ఉన్నారు. ఈలం తమిళులను అణగతొక్కేయడంలో మంత్రిగా ఉన్న సమయంలో ప్రణబ్ పాత్ర ఉందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. అందుకే ఆయన పర్యటనకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టబోతున్నామని ప్రకటించారుు. దర్శకుడు గౌతమన్ నేతృత్వంలో కొన్ని సంఘాలు ఇందుకు వ్యూహ రచన చేస్తున్నాయి. ఎక్కడెక్కడ నిరసనలు తెలియజేయాలన్న వివరాలు విద్యార్థి సంఘాలు గోప్యంగా ఉంచడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. రాష్ట్రపతి కాన్వాయ్ వెళ్లే మార్గాల్లో డేగ కళ్లతో నిఘా ఏర్పాటు చేశారు. ప్రైవేటు కార్యక్రమం జరిగే హోటల్ పరిసరాల్లోను, ఆ కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్కర్నీ క్షుణ్ణంగా తనిఖీలు చేయడానికి నిర్ణయించారు. ఆహ్వాన పత్రికలు ఉన్న వాళ్లను మాత్రమే ఆ కార్యక్రమానికి అనుమతించనున్నారు. ఇక, ప్రధానంగా లయోల కళాశాల వేడుక పోలీసులకు సవాల్‌గా మారింది. ఈలం తమిళులకు మద్దతుగా జరుగుతున్న ఉద్యమాల్లో ఆ కళాశాల విద్యార్థులు భాగస్వాములుగా ఉన్నారు. దీంతో అక్కడ విద్యార్థులకు ఆంక్షలు విధించాలంటే సమస్య తలెత్తుతోంది. దీంతో పకడ్బందీగా వ్యవహరించి విద్యార్థి సంఘాల వ్యూహాలకు చెక్‌పెట్టే పనిలో నగర పోలీసు యంత్రాంగం ఉరకలు తీస్తున్నది. ప్రణబ్ పర్యటించే ప్రాంతాల్లో ఆగమేఘాలపై రోడ్లకు మెరుగులు దిద్దుతున్నారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top