లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ చరిత్రాత్మక విజయం సాధించిన తర్వాత తొలిసారి నగరానికి వచ్చిన ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ రోడ్‌షో భారీ భద్రత మధ్య సాగింది.
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ చరిత్రాత్మక విజయం సాధించిన తర్వాత తొలిసారి నగరానికి వచ్చిన ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ రోడ్‌షో భారీ భద్రత మధ్య సాగింది. ఢిల్లీ విమానాశ్రయం నుంచి బీజేపీ కార్యాలయం వరకు ఆయన నిర్వహించిన రోడ్‌షోకు బహుళ అంచెల భద్రత కల్పించారు. సుమారు వందమంది పోలీసులు, ఎన్‌ఎస్‌జీ కమాండోలు రక్షణ కవచంలా విధులు నిర్వహించారు. రోడ్‌షో జరిగిన ప్రాంతాలన్నింటిలో పోలీసులు డేగకన్నుతో పహరా కాశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు అనుమానం వచ్చిన ప్రతి వాహనాన్ని, వ్యక్తిని తనిఖీ చేశారు. ఆశోకా రోడ్డులోని బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద పోలీసులు, ఎన్‌ఎస్‌జీ కమాండోలతో బహుళ అంచెల భద్రతను కల్పించారు. రోడ్‌షో జరిగిన ప్రాంతాల్లో పెట్రోలింగ్ నిర్వహించామని, ట్రాఫిక్‌ను కూడా మళ్లించామని జాయింట్ కమిషనర్ ఎంకే మీనా తెలిపారు. అన్ని భద్రతా సంస్థలు ఢిల్లీ పోలీసులతో సమన్వయం చేసుకున్నాయని అన్నారు. ఏ సమయంలో ఏమీ జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండేందుకే ఈ భద్రతా ఏర్పాట్లని తెలిపారు.
ట్రాఫిక్ మళ్లింపు...
ఐజీఐ ఎయిర్ పోర్టు నుంచి బీజేపీ ప్రధాన కార్యాలయం వరకు ట్రాఫిక్ మళ్లించారు. ఉదయం పది గంటలకు టెర్మినల్-3 నుంచి వెళ్లే వాహనాలను సెంటౌర్ హోటల్, మహిపాల్‌పూర్‌కు మళ్లించారు. ఉదయం 11 గంటలకు దౌలా కౌన్, సర్ధార్ పటేల్ మార్గ్ ప్రాంతాల నుంచి ఇతర రోడ్లకు ట్రాఫిక్‌ను మళ్లించారు. ఐజీఐ ఎయిర్‌పోర్టు టెర్మినల్ త్రీ నుంచి సర్వీసు రోడ్డు, సెంట్రల్ స్పైన్ రోడ్డు, ఏరోసిటీ, దౌలా కువాన్ ఫ్లైఓవర్, సర్ధార్ పటేల్ మార్గ్, మదర్ థెరిస్సా క్రిసెంట్, టీన్ మూర్తి మార్గ్ నుంచి అక్బర్ రోడ్డు, మోతీలాల్ నెహ్రూ పాలెస్, జన్‌పథ్, విండ్సర్ ప్లేస్ మీదుగా ఆశోకారోడ్డులోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి మోడీ చేరుకున్నారు. ప్రధానమంత్రికి కల్పించే అన్ని సదుపాయాలను మోడీ రోడ్‌షోకు కల్పించామని పోలీసు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ రోడ్ షో ఉంటుందని ముందే తెలపడంతో అనేకమంది నగరవాసులు ప్రజా రవాణా వ్యవస్థ బస్సులు, మెట్రో రైళ్లను ఆశ్రయించారని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీసు (ట్రాఫిక్) అనిల్ శుక్లా తెలిపారు.