నన్నపనేని కారు ఢీ : వ్యక్తికి తీవ్ర గాయాలు | nannapaneni rajakumari car hits in guntur district man injured | Sakshi
Sakshi News home page

నన్నపనేని కారు ఢీ : వ్యక్తికి తీవ్ర గాయాలు

Oct 21 2016 7:31 PM | Updated on Oct 8 2018 3:08 PM

మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి కారు ఢీకొని ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

గుంటూరు : ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్‌పర్సన్, టీడీపీ నాయకురాలు నన్నపనేని రాజకుమారి ప్రయాణిస్తున్న కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రత్యక్ష సాక్షులు, బాధితుడి తల్లి తెలిపిన వివరాల ప్రకారం వివరాలిలా ఉన్నాయి.

నందివెలుగు రోడ్డులోని బాలాజీ నగర్లో నివసించే బసవయ్య, ధనలక్ష్మిల కుమారుడు అన్నం గరటయ్య (27) బీఏటీ పొగాకు కంపెనీలో ముఠా పనిచేసి జీవనం సాగిస్తుంటాడు. నెల రోజుల క్రితం తమ్ముడు అనారోగ్యంతో మృతిచెందడం, తండ్రి పక్షవాతంతో మంచంలో ఉండడంతో తల్లికి సహాయంగా ఇంటి వద్దే ఉంటున్నాడు. శుక్రవారం ఉదయం ఇంట్లోని గేదెలకు దాణా తెచ్చేందుకు ద్విచక్రవాహనంపై తక్కెళ్లపాడు బయలుదేరాడు. తక్కెళ్లపాడు వైపు నుంచి రాజకుమారి ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు ముందు వెళ్తున్న ఆటోను ఓవర్‌టేక్ చేసి అతి వేగం కారణంగా అదుపుతప్పి రోడ్డుకు కుడి వైపు వచ్చి గరటయ్య ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. 
 
ఈ సంఘటనలో గరటయ్య తీవ్ర గాయాలపాలయ్యాడు. ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడం వలన కారులోని వారంతా క్షేమంగా బయటపడ్డారు. వెంటనే గమనించిన స్థానికులు గరటయ్యను గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో పీజీ విద్యార్థులే గరటయ్యకు వైద్యం చేస్తుండడం.. ప్రత్యేక విభాగం వైద్యులు ఎవరూ పట్టించుకోకపోవడంతో బంధువులు ఆందోళనకు దిగారు. నన్నపనేని రాజకుమారి కనీసం ఫోన్‌లోనైనా పరామర్శించకపోవడంపై బంధువులు నిరసనకు దిగారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆస్పత్రికి వచ్చి వైద్యులతో చర్చించారు. అనంతరం అతన్ని ప్రైవేటు ఆస్పత్రికి తరలించాలని ఎమ్మెల్యే సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement